పేపర్ బాయ్ సినిమాపై ఎలాంటి బజ్ లేదు. సినిమా ఆడదనే విషయాన్ని రిలీజ్ కు ముందే ప్రివ్యూ చూసిన చాలామంది ప్రచారం చేశారు. ఈ విషయం ఇండస్ట్రీలో ఉంటున్న అల్లు అరవింద్ కు తెలియనిది కాదు. కానీ అతడు పేపర్ బాయ్ సినిమాను టేకోవర్ చేశారు. ఇంత అనుభవం ఉన్న అరవింద్, పేపర్ బాయ్ విషయంలో ఎందుకు దొరికిపోయారు. దీనివెనక మెహర్ రమేష్ మంత్రాంగం ఉంది.
పేపర్ బాయ్ సినిమాను అల్లు అరవింద్ కు అంటగట్టిన విషయంలో కీలకపాత్ర మెహర్ రమేష్ దే. ఈ విషయాన్ని ప్రీ-రిలీజ్ ఫంక్ష్ లో అరవింద్ కూడా చెప్పుకొచ్చారు. ఎవరినైనా ఒప్పించడంలో, ఒకమాట మీదకు తేవడంలో మెహర్ రమేష్ దిట్ట అని, పేపర్ బాయ్ విషయంలో కూడా తనను మెహర్ అలాగే ఒప్పించాడని అరవింద్ అన్నారు.
అంటే, పేపర్ బాయ్ విషయంలో మెహర్ రమేష్ మూలంగానే అరవింద్ బుక్ అయ్యారని అనుకోవాలి. మొదటిరోజే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చేసింది. అటు కవితాత్మకంగా కాకుండా, ఇటు మాస్ ఎలిమెంట్స్ లేకుండా మధ్యస్థంగా సినిమా ఉండడంతో, ఏ ఒక్కవర్గాన్ని ఈ పేపర్ బాయ్ ఆకట్టుకోలేకపోయింది. అలా మెహర్ రమేష్ కారణంగా అల్లు అరవింద్ ఇరుక్కుపోయారని అనుకోవాలి.
మరోవైపు పేపర్ బాయ్-అరవింద్ ములాఖత్ మధ్య మరో కొత్తవాదన కూడా తెరపైకి వస్తోంది. గీతగోవిందం సినిమాతో భారీ లాభాలు కళ్లజూశారు ఈ నిర్మాత. ఆదాయపు పన్ను నుంచి తప్పించుకునేందుకు, డిస్ట్రిబ్యూషన్ లో భారీ నష్టాలు చూపించడం కోసం పేపర్ బాయ్ ను అరవింద్ తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనలు ఎలా ఉన్నా, వీళ్లందరి మధ్యలో పేపర్ చిరిగిపోయిందనేది మాత్రం వాస్తవం.