అత్త.. అల్లుడు సరే మరి మామ సంగతేంటి?

అత్త.. అల్లుడు టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సక్సెస్ ఫార్ములా. అత్తకు తగ్గ అల్లుడు హీరో అయితే, ఇలాంటి సినిమాల్లో అత్త పక్కన కనిపించే మామలు మాత్రం జీరోలవుతుంటారు. అత్త క్యారెక్టర్ కి తగ్గ మామ…

అత్త.. అల్లుడు టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సక్సెస్ ఫార్ములా. అత్తకు తగ్గ అల్లుడు హీరో అయితే, ఇలాంటి సినిమాల్లో అత్త పక్కన కనిపించే మామలు మాత్రం జీరోలవుతుంటారు. అత్త క్యారెక్టర్ కి తగ్గ మామ కోసం మంచి వెయిట్ ఉన్న నటుడిని పెట్టినా అతని క్యారెక్టర్ కి మాత్రం వెయిట్ లేకుండా చేస్తారు దర్శకులు. అలా చేస్తేనే సినిమాలో అత్త డామినేషన్ రక్తి కడుతుంది. గయ్యాళి అత్త మెడలు వంచే హీరోగారి డామినేషన్ ఎలివేట్ అవుతుంది.

'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు'లో రావుగోపాలరావు దగ్గర్నుంచి.. 'నారీ నారీ నడుమ మురారి' సత్యనారాయణ వరకు.. 'అల్లరి రాముడు' నరేష్ దగ్గర్నుంచి.. 'అత్తారింటికి దారేది' రావురమేష్ వరకు ఎంతోమంది నోరులేని మామలుగా తమ క్యారెక్టర్లని రక్తి కట్టించారు. నూతన్ ప్రసాద్, సత్యనారాయణ, నరేష్, రాజేంద్రప్రసాద్.. చాలామంది గయ్యాళి భార్యల చెప్పుచేతల్లో ఉండే భర్తలుగా నటించి మెప్పించారు.

అత్త ఎలివేట్ అవ్వాలంటే మామ డమ్మీ కావాల్సిందే. మొగుడ్ని చెడుగుడు ఆడుకునే భార్యని.. చివరకు అల్లుడు ఎలా దారిలోకి తెచ్చాడు మధ్యలో తన ప్రేమాయణం ఎలా సాగించాడనేదే ఈ కథలన్నిటి సారాంశం. అది ఎంత కన్విన్సింగ్ గా, కామెడీగా చెప్పగలిగితే సినిమా అంత హిట్. ఈ క్రమంలో అల్లుడికి సపోర్ట్ గా మామ తెరపైకి వస్తాడు. తన భార్యకి వ్యతిరేకంగా.. అల్లుడి కోసం, కూతురి కోసం మంత్రాంగం నడుపుతుంటాడు.

తాజాగా శైలజారెడ్డి అల్లుడు విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. గయ్యాళి భర్తల కొంగుచాటు మొగుడిగా అల్లరి రాముడు, అ..ఆ వంటి సినిమాల్లో హీరో మామగా నటించిన నరేష్.. శైలజారెడ్డికి భర్తగా నటిస్తున్నాడు. తీరా ట్రైలర్ చూస్తే శైలజారెడ్డి అసిస్టెంట్ కి ఇచ్చిన ప్రాధాన్యత కూడా భర్తకు ఇవ్వలేదు డైరెక్టర్ మారుతి.

ట్రైలర్ లో రమ్యకృష్ణ అసిస్టెంట్ మాణిక్యంగా పృథ్వీకి నాలుగు డైలాగుల స్పేస్ ఇచ్చారు కానీ, నరేష్ కి నోరువిప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ట్రైలర్ లో రెండుమూడు చోట్ల కనిపించినా, ఒక్క చోట కూడా వినిపించడు నరేష్. పాత సినిమాల్లో పాపం మామలంతా క్లైమాక్స్ లో తెరపైకి వచ్చి తమ భార్యల కళ్లు తెరిపిస్తారు, నాలుగు సెంటిమెంట్ డైలాగులు కొడతారు.

ఆ విధంగా సినిమా మొత్తం ప్రాధాన్యత లేకుండా రీళ్లన్నీ కనిపించే మామ క్యారెక్టర్ ఆఖరులో కాస్త ఊపిరిపోసుకుంటుంది. మరి శైలజారెడ్డి సినిమాలో నరేష్ కి ఆమాత్రం అవకాశమైనా డైరెక్టర్ ఇచ్చాడా లేక ట్రైలర్ లోనే నరేష్ సంగతి ఇదీ అని తేల్చేశాడా?