విజయ్ దేవరకొండ. టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్. అతి తక్కువ టైమ్ లో, అతి తక్కువ సినిమాలతో ఈ రోజు ఎవరైతే తాము టాప్ హీరోలం అనుకుంటున్నారో వాళ్లతో సమానంగా అభిమానుల్ని, క్రేజ్ ను స్వంతం చేసుకున్న హీరో. అందులో సందేహం లేదు. వందల కోట్ల రెవెన్యూ సినిమాలు లేకపోవచ్చు, కానీ క్రేజ్ లో మాత్రం టాప్ హీరోలను మించిన క్రేజ్ యూత్ లో వుందన్నది వాస్తవం. సరైన సినిమా పడితే బొమ్మ దద్దరిల్లిపోవడం గ్యారంటీ అని అందరికీ తెలుసు. కానీ ఆ టైమ్ రావడం లేదు.
గీతగోవిందం, టాక్సావాలా లాంటి హిట్ లు పడ్డాయి కానీ ఇంకా సరైన లైనప్ రాలేదు. ఇది ఇలా వుంటే విజయ్ దాదాపు ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగానే వుంటున్నాడు. పెద్ద హీరోలు పిలిస్తే వాళ్ల సినిమాలకు మద్దతుగా నిలిచాడు. గీతా లాంటి బ్యానర్ లో తన సినిమాకు కిందా మీదా పడి ప్రచారం చేసాడు. యువి/గీతా నిర్మించిన టాక్సీవాలాను అంతా తానై ప్రచారం సాగించాడు.
బన్నీ, మహేష్ ఇలా ఎవర్ని అయినా అన్నా, అన్నా అంటూనే వున్నాడు. అరవింద్ గారు ఓటిటి ప్లాట్ ఫారమ్ లాంచ్ అంటే వెళ్లాడు. మరో సినిమా చేయాలి అంటే చేస్తా అన్నాడు. కానీ ఇంత చేసినా, మన హీరోలు మాత్రం విజయ్ అంటే దూరంగానే వుంటున్నారనిపిస్తోంది.
''..ప్రతి చిన్నదానికి ట్వీట్ లు వేసే మన సూపర్ స్టార్ లు, మెగా హీరోలు విజయ్ సినిమా కు సంబంధించి ట్వీట్ లు వేయరు.వరల్డ్ ఫేమస్ లవర్ ట్రయిలర్ వచ్చింది. ఎవ్వరూ ఓ ట్వీటు వేసిన దాఖలా లేదు. మళ్లీ వాళ్ల సినిమాల పంక్షన్లు అంటే జనాలను అట్రాక్ట్ చేయడానికి విజయ్ కావాలి. విజయ్ సినిమాకు మాత్రం వాళ్లు ఓ ట్వీటు వేయరు..'' అని ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత కామెంట్ చేసారు.
ఆలోచించదగ్గ విషయమే. ఒకటి రెండు సినిమాలు సరైనవి పడితే విజయ్ రేంజ్ ఎక్కడో వుంటుంది. ఆ సంగతి తెలిసే మన హీరోలు వెనుకాడుతున్నారో? జంకుతున్నారో? మరి.