చంద్రబాబుకు ఈనాడు ఎందుకు భగవద్గీత అయ్యిందో, శాసనమండలి పరిణామాలపై ఆ పత్రిక కథనాలు చదివితే అర్థమవుతుంది. బాబుకు అనుకూల నిర్ణయాలు జరిగితే మాత్రం జజ్జనక జజ్జనక అంటూ అక్షరాలతో చిందులు తొక్కడం, కాస్త వ్యతిరేకంగా జరిగితే మాత్రం ఆగ్రహంతో కలం కత్తితో వేటాడటం రామోజీరావుకే చెల్లు.
అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్న జగన్ సర్కార్ వాటిని శాసనమండలికి పంపింది. గత నెల 21న శాసనమండలికి వచ్చిన బిల్లులను కనీసం ప్రవేశ పెట్టేందుకు కూడా వీల్లేకుండా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. ఇందుకోసం టీడీపీ సభ్యులు నిబంధన 71ను వాడుకున్నారు.
దీన్ని మరుసటి రోజు ఈనాడులో ‘సర్కార్కు షాక్’ పతాక శీర్షికతో క్యారీ చేశారు. ఈ కథనానికి సబ్ హెడ్డింగ్స్ కింద
– మండలిలో చర్చకు రాని రాజధాని బిల్లులు – వ్యూహాత్మకంగా నిబంధన 71 అస్త్రం ప్రయోగించి అడ్డుకున్న టీడీపీ
– చేష్టలుడిగిన అధికార పక్షం అని ఇచ్చారు. అలాగే ‘మూడు రాజధానుల బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలన్న అధికార వైకాపా ప్రయత్నాన్ని ప్రతిపక్ష తెదేపా శాసనమండలిలో వ్యూహాత్మకంగా తిప్పికొట్టింది’ అని కథనం రాసుకెళ్లారు.
ఆ మరుసటి రోజు జనవరి 22న మళ్లీ మండలిలో ఎట్టకేలకు బిల్లులను ప్రవేశ పెట్టారు. మండలి చైర్మన్ వాటిని సెలక్ట్ కమిటీకి పంపారు. దీనిపై మరుసటి రోజు ఈనాడులో …
‘3 రాజధానులకు ఎదురు దెబ్బ’ శీర్షికతో ప్రధాన వార్తగా ఇచ్చారు. అలాగే శాసనమండలిలో ఆమోదం పొందని బిల్లులు అని సబ్ హెడ్డింగ్ ఇచ్చారు.
‘ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు పెద్దల సభలో చుక్కెదురైంది. తన విచక్షణాధికారంతో ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించడంతో అధికార వైకాపా సభ్యులు, మంత్రులు నిర్ఘాంతపోయారు. మరోవైపు తెదేపా సభ్యులు హర్షాతిరేకాలతో సభను హోరెత్తించారు’..… ఇలా సాగింది బాబు భగవద్గీత ఈనాడులో వార్తా కథనం.
తాజాగా సెలక్ట్ కమిటీ దస్త్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి వెనక్కి పంపారు. దీనిపై ఈనాడులో ఏమొచ్చిందో తెలుసుకోవాలి కదా. అక్కడికే పోదాం పదండి.
‘కొత్త మెలిక’ శీర్షికతో ఈనాడు కథనాన్ని క్యారీ చేసింది. ఈ కథనానికి సబ్ హెడ్డింగ్స్ః సెలక్ట్ కమిటీ దస్త్రం వెనక్కి; మండలి చైర్మన్ కార్యాలయానికి తిప్పి పంపిన అసెంబ్లీ కార్యదర్శి .
‘పాలన వికేంద్రీకరణ , సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు బ్రేక్ పడింది. కమిటీ ఏర్పాటు చేసేందుకు మండలి చైర్మన్ షరీఫ్ కార్యాలయం నుంచి పంపిన దస్త్రం అసెంబ్లీ కార్యదర్శి తిప్పి పంపినట్టు సమాచారం. మండలి 154 నిబంధన కింద తనకున్న విచక్షణాధికారంతో ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు గత నెల 22న శాసనమండలిలో చైర్మన్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీ కార్యదర్శిని ఆయన ఆదేశించారు. అయితే ఆ నిబంధన ఆధారంగా సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయడం సాధ్యపడదని అసెంబ్లీ కార్యదర్శి సోమవారం చైర్మన్కు తిప్పి పంపిన దస్త్రంలో పేర్కొన్నట్టు తెలిసింది’...అని వార్తా కథనాన్ని రాసుకెళ్లారు.
అంటే టీడీపీ చేస్తే మాత్రం ఈనాడు దృష్టిలో వ్యూహాత్మకమవుతుంది. అలాగే అధికార పక్షం చేష్టలుడిగి ప్రేక్షక పాత్ర వహించినట్టు కనిపిస్తుంది. అధికార పక్షానికి షాక్ తగిలినట్టు అవుతుంది. అదే అధికార పక్షం వైసీపీ చేస్తే మాత్రం ‘మెలిక’గా ఈనాడుకు కనిపిస్తుంది. ఇదన్న మాట రామోజీరావు జర్నలిజం నీతి. ఇదేనా బాబు భగవద్గీత ఇచ్చే సందేశం. ఇలాంటి ద్వంద్వ నీతితో ఈనాడులో రాతలు ఉండటం వల్లే రోజురోజుకూ ఆ పత్రిక విశ్వసనీయత పాతాళానికి దిగజారుతోంది.