ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తామన్న శత్రుత్వం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా మాయమైంది. ఫిలింసిటీకి ఏం కావాలన్నీ చేస్తామన్న స్థాయికి రామోజీ-కేసీఆర్ స్నేహం బలపడింది. ఇక ఓం సిటీ అనే బృహత్తర ప్రాజెక్ట్ విషయంలో రామోజీ-కేసీఆర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం రెండు రాష్ట్రాల ప్రజలకు మరోసారి తెలిసింది.
ఆ తర్వాత కూడా ఈ స్నేహం కొనసాగింది కానీ.. ఏపీలో జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత మిత్రుడికి శత్రువు.. తనకి కూడా శత్రువే అయినట్టు రామోజీని దూరం పెట్టారు కేసీఆర్. తాజాగా.. తెలంగాణలో ఏర్పాటుచేయబోతున్న చలనచిత్ర శిక్షణ సంస్థ వ్యవహారంలో ఈ దూరం మరింతగా స్పష్టమైంది. ఈ మొత్తం వ్యవహారానికి రామెజీని పూర్తిగా దూరం చేశారు కేసీఆర్.
ఇప్పటికే రామోజీ ఫిలింసిటీలో నటనకు సంబంధించి ఓ సంస్థ ఉంది. గతంలో ఉన్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకుంటే.. కచ్చితంగా ఈ సంస్థను కూడా తెలంగాణ సర్కారు పరిగణలోకి తీసుకుని ఉండేది. అంతెందుకు.. కొత్త సంస్థ ఏర్పాటులో రామోజీరావు భాగస్వామ్యాన్ని కూడా ఆహ్వానించేవారు. ఆయన సూచనలు, సలహాలు కూడా అడిగేవారు. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు.
కేవలం చిరంజీవి, నాగార్జునతో మాత్రమే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే 2సార్లు సమావేశమయ్యారు. మరిన్ని సమావేశాలు వీళ్ల మధ్య జరుగుతాయి. ఇటు నందమూరి కుటుంబాన్ని పిలవలేదు, అటు ఏ ఎండకాగొడుగు పట్టే సురేష్ బాబుకి కూడా అంత ప్రాధాన్యతనివ్వలేదు. కేవలం చిరంజీవి, నాగార్జునతోనే అన్నీ మాట్లాడేసుకుని నిర్ణయాన్ని వెలిబుచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని చెప్పారాయన.
మొత్తమ్మీద ఈ వ్యవహారంలో ఇటు రామోజీని, అటు నందమూరి-దగ్గుబాటి కుటుంబాల్ని కేసీఆర్ పూర్తిగా దూరం పెట్టారనే విషయం క్లియర్ గా తెలుస్తోంది. అంతేకాదు, ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతోందనే విషయం కూడా అందరికీ అర్థమౌతోంది.