టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది. బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు అంతిమంగా బాబు మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. ఈ సోదాలు బాబు రాజకీయ జీవితంలో సంభవించే పెను తుపాను హెచ్చరికలగానే చూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దీనికి తోడు ఐటీ సోదాలపై చంద్రబాబు సహా టీడీపీ నేతలెవరూ నోరు తెరవకపోవడం, ఇదే సందర్భంలో ఇంటెలిజెన్స్ మాజీ ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై విమర్శలు చేయడాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇంతే కాదు బాబు భగవద్గీత ఈనాడు, దాని తోక పత్రిక ఆంధ్రజ్యోతిలో ఐటీ సోదాలపై నామమాత్రంగా కూడా వార్తలు రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
చంద్రబాబుపై మోడీ సర్కార్ ఒక పథకం ప్రకారం ఐటీ, ఈడీ సోదాలు చేయిస్తోందని, తమ నాయకుడికి ఏదో జరగబోతోందనే అనుమానాలున్నాయని, అయితే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని టీడీపీ నేత ఒకరు అన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇలాగే ఉందని సమాచారం.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావు నివాసంలో ఏకంగా ఐదు రోజుల పాటు ఢిల్లీ నుంచి వచ్చిన అదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించడం చిన్న విషయం కాదు. అంతేకాదు ఐటీకి ఈడీ కూడా తోడు కావడం టీడీపీ శ్రేణులకు మరింత ఆందోళన కలిగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు మోడీతో చంద్రబాబు విభేదించి ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన విషయం తెలిసిందే. ఇంతటితో ఆగి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు.
నేరుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ కావడం, కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం తెలిసింది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున నిధులను చంద్రబాబు సమకూర్చారనే ఆరోపణలున్నాయి. ఇదే సందర్భంలో మద్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా కర్నాటక ఫార్ములానే బాబు అనుసరించారనే విమర్శలున్నాయి. అంతేకాదు కర్నాటక, మద్యప్రదేశ్‌లో తమ వల్లే బీజేపీ ఓడిపోయిందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తుంటే అందరూ నవ్వుకున్నారు. ఇప్పుడిప్పుడు అసలు నిజాలు తెలుసుకుంటున్న జనం ‘ఔరా’ అని ముక్కున వేలేసుకుంటున్నారు.
గుజరాత్, రాజస్థాన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు బాబు ఆర్థికంగా కొండంత అండగా నిలబడటం వల్లే బీజేపీని ఢీకొట్టే పరిస్థితి ఎదురైందని మోడీ-అమిత్‌షా ద్వయం రగిలిపోతున్నట్టు సమాచారం. కర్నాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేసినప్పుడు లభ్యమైన పత్రాల్లో బాబుకు సంబంధించిన బలమైన ఆధారాలు లభ్యమైనట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
గతంలో మోడీతో విభేదించిన సందర్భంలో తనపై దాడులు చేయించవచ్చని సీఎం హోదాలో బాబు అసెంబ్లీలో ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ అప్పట్లో మోడీ సర్కార్ ఎలాంటి దాడులు చేయించలేదు. అదును చూసి ప్రస్తుతం మోడీ సర్కార్ బాబు ఆర్థిక మూలాలను పూర్తిగా విధ్వంసం చేసేందుకు మాస్టర్ ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు తనయుడు శరత్, లోకేశ్ ఆప్తుడు కిలారి రాజేష్ ఇళ్లు, కార్యాలయాల్లో (హైదరాబాద్, కడప) కూడా ఐటీ సోదాలు నిర్వహించారు. మరీ ముఖ్యంగా బాబు పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో ఏకంగా ఐదు రోజుల పాటు ఐటీతో పాటు ఈడీ సోదాలు నిర్వహించడం, తమ వెంట నాలుగు బ్యాగుల పత్రాలు, కొన్ని డైరీలు, హార్డ్ డిస్క్‌లను శ్రీనివాస్ ఇంటి నుంచి తీసుకెళ్లడం టీడీపీ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తోంది.
ఐటీ, ఈడీ అధికారులంతా ఉత్తరాధికి చెందిన వారు కావడంతో బాబు మేనేజ్ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడితే విమర్శలకు దిగిన టీడీపీ నేతలు….ఏకంగా తమ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసి కేంద్రప్రభుత్వం ఐటీ, ఈడీ సోదాలు చేస్తుంటే ఎందుకు నోళ్లు తెరవడం లేదన్నదే ప్రశ్న.
నోళ్లు తెరిచిన వాళ్లపై ఐటీ, ఈడీ దృష్టి పడుతుందనే భయంతో టీడీపీ నేతలు కిక్కురుమనడం లేదనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే చంద్రబాబుకు ఏదో జరగబోతోంది అనేది మాత్రం నిజం. చంద్రబాబు ముందున్నదంతా ‘ముంచు’ కాలమే అనే సంకేతాలు ఐటీ, ఈడీ సోదాలు హెచ్చరిస్తున్నాయి. ఎంతటి వారైనా కాలం ముందు లోకువే కదా.