కొరటాలశివ డైరక్షన్ లో మెగాస్టార్ చేస్తున్న ఆచార్య సినిమా షూట్ చకచకా జరిగిపోతోంది. రామ్ చరణ్ పార్ట్ వుంటుంది. అది జూన్ తరువాత షూట్ చేసే అవకాశం వుంది. ఎలా లేదన్నా, ఎంత కాదన్నా ఈ సినిమా దసరా నాటికే రెడీ అయిపోతుంది. కానీ విడుదల మాత్రం 2021 జనవరి తరువాతే. ఈ విషయంలో కొరటాల శివకు ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళికి మధ్య రాయబారాలు నడుస్తున్నాయని, ఆగస్టులో ఆచార్య విడుదలకు మార్గం సుగమం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇవి ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
ఏమైనా ఆచార్య విడుదల తరువాత ఏంటీ? మెగాస్టార్ ఖాళీగా వుండిపోతారా? మరో సినిమా చేస్తారా? ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తలు అయితే అదే చెబుతున్నాయి. తిరుపతి ప్రసాద్ నిర్మాణంలో లూసిఫర్ రీమేక్ ను టేకప్ చేసేయాలని మెగాస్టార్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
సుకుమార్ స్క్రిప్ట్
దర్శకుడు సుకుమార్ ఇప్పటికే దాదాపు లూసిఫర్ రీమేక్ కు స్క్రిప్ట రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన డైరక్షన్ చేస్తారా? వేరేవాళ్లకు ఇస్తారా?అన్నది చూడాలి. ఇప్పటికిప్పుడు అయితే సుకుమార్ రెడీ కారు. ఆయన బన్నీ సినిమా చేసి వచ్చేసరికి టైమ్ పడుతుంది. మరి అంతవరకు మెగాస్టార్ వుండిపోతారా? సుకుమార్ ఇచ్చిన స్క్రిప్ట్ ను తీసుకుని, ఆయన సలహాతో మరెవరితో అయినా చేసేస్తారా? ఈ విషయంలో ఒకటి రెండు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఏదీ పక్కా కాదు.
మొత్తం మీద లూసిఫర్ రీమేక్ మాత్రం పక్కా అని తెలుస్తోంది. మరి ఇందులో కూడా ఓ యంగ్ క్యారెక్టర్ వుంది. అది ఎవరు చేస్తారు అన్నది ఇంకా చాలా దూరంలో వున్న నిర్ణయం. రాజమౌళి కనికరించి ఆచార్య సినిమాను ఆగస్టులో విడుదలకు ఓకె అన్నా, లేదు అనకపోయినా, మొత్తం మీద లూసిఫర్ రీమేక్ ఈ ఏడాదే సెట్ మీదకు వెళ్తుందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.