“శ్రీలంక నుంచి తమిళనాడుకి గంట దూరం- శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరం. ఇంకా లేని పొత్తుల గురించి విమర్శించటం, గడప గడపకి ఎమ్మెల్యేలని పంపటం కాదు చెయ్యవలసింది, మీరు చేసిన అప్పులు నుంచి ఆంధ్రప్రదేశ్‌ని దూరం జరిపే ప్రయత్నం చెయ్యండి.”
ఇలా తన దత్తతండ్రి చంద్రబాబు డైలాగ్ ను మరోసారి రిపీట్ చేశారు పవన్ కల్యాణ్. ఆయన విమర్శించడంలో తప్పు లేదు. అది ఆయన హక్కు. కాకపోతే, ఈ ఏడుపు ఐదేళ్ల కిందట ఎక్కడికి పోయిందనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అప్పులు జగన్ తోనే ప్రారంభం కాలేదు. పైగా జగన్ తోనే ఇవి ముగిసిపోవు.
జగన్ కంటే ముందు చంద్రబాబు భారీగా అప్పులు చేశారు. ఆయన వేల కోట్లు అప్పులు చేసి భ్రమరావతిపై, పనికిరాని కార్యక్రమాలపై పెట్టినప్పుడు పవన్ కల్యాణ్ కు బాధలేదు. అదే జగన్ అప్పులు చేస్తే మాత్రం పవన్ కల్యాణ్ కు కోపం వస్తోంది.
మరీ ముఖ్యంగా అలా చేసిన అప్పులను పేదల సంక్షేమం కోసం జగన్ ఖర్చు చేయడం పవన్ కు అస్సలు నచ్చినట్టు లేదు. అందుకే ఏపీని శ్రీలంకతో పోలుస్తూ ఏడుస్తున్నారు. నిజానికి పవన్ ప్రస్తావించిన వార్తా కథనంలో భారీగా అప్పులు చేసిన రాష్ట్రాల్ని ఎత్తిచూపుతూనే, కేంద్రంపై విమర్శలు చేశారు. మరి పవన్ ఆ పని ఎందుకు చేయలేదు. ఎంతసేపు జగన్ పై పడి ఏడవడమే ఆయనకు వచ్చు. ప్రతి అంశాన్నీ వక్రీకరించి జగన్ పైకి నెట్టడమే ఆయనకు తెలుసు.
జగన్ కి, చంద్రబాబుకి ఒకటే తేడా.. ఇద్దరూ అప్పులు చేశారు. కానీ జగన్ వాటిని సంక్షేమ పథకాలకు ఉపయోగిస్తున్నారు. చంద్రబాబు అప్పులు చేసినా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం ఆయన వల్ల కాలేదు. అమ్మఒడి, రైతు భరోసా లాంటి పథకాలు అసలు అప్పుడు లేనే లేవు. ఏమీ చేయని, చేయలేని చంద్రబాబుని ఏమీ అనకుండా.. అన్నీ చేస్తున్న జగన్ ని ఆడిపోసుకోవడం ఎంతవరకు సమంజసం.
పైగా పవన్ కల్యాణ్ వేసిన ట్వీట్ చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయడం కంటే, వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు తిరిగి మైలేజీ పెంచుకోవడాన్ని జీర్ణించుకోలేనట్టుగా కనిపిస్తోంది. ఇలా చంద్రబాబు కడుపుమంటను కూడా షేర్ చేసుకుంటూ, దత్తపుత్రుడు బిరుదుకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారు పవన్ కల్యాణ్.
అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారో తెలియదా..?
అప్పులు తెస్తున్నా, తిప్పలు పడుతున్నా.. ఆదాయాన్ని ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తున్నారు సీఎం జగన్. శ్రీలంక పరిస్థితి అది కాదు. అక్కడ విదేశీ సాయం కోసం స్వదేశంలో వ్యవసాయాన్ని బలిచేశారు రాజపక్సే బ్రదర్స్. తప్పని తెలిసినా బలవంతంగా వ్యవసాయ నిబంధనలు మార్చి, ఆర్థిక పరిస్థితిని పతనం చేశారు.
కానీ ఏపీలో ఏ రాష్ట్రం ఎంత అప్పులు చేసినా, ఎన్ని తప్పులు చేసినా.. కేంద్ర పర్యవేక్షణ ఉంటుంది. కేంద్రాన్ని కాదని ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో రేట్లు పెంచితే కుదరదు. ప్రస్తుతం ఏపీలో అలాంటి పరిస్థితి కూడా లేదు.
పవన్ చెప్పినట్టు జీడీపీ లోటు తక్కువగా ఉన్న రాష్ట్రాలతో పోల్చి చూస్తే.. ఏపీలో కరెంటు చార్జీలు తక్కువ. కొన్ని నిత్యావసరాల రేట్లు మన దగ్గరే తక్కువ. రవాణా చార్జీలు కూడా తక్కువే. మరి జనం ఎందుకు బాధపడాలి, ఏ విషయంలో ఇబ్బంది పడాలి.
కేవలం చంద్రబాబు ఏడుపుని, తన ఏడుపుగా చెప్పుకుంటూ, వైసీపీ ఎమ్మెల్యేలకు గడప గడపకు వస్తున్న ఆదరణని తట్టుకోలేక పవన్ కల్యాణ్ ఈ ట్వీట్ వేసినట్టు తెలిసిపోతోంది. లేకపోతే శ్రీలంకకు, ఏపీకి పోలికేంటి పవన్. కావాలంటే మోదీని తిట్టు, బీజేపీని విమర్శించు. ఆ దమ్ములేక, ఇలా జగన్ పై అక్కసు వెళ్లగక్కడం ఎంతవరకు సమంజసం.