బీజేపీ భయపడుతున్నట్టే జరుగుతోంది. టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన వాళ్లు…ఎన్నికలకు ముందు తిరిగి మాతృ పార్టీలోకి వెళ్లిపోతారనే ప్రచారమే నిజమవుతోంది. మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు రాజీనామాతో ఈ విషయం రుజువవుతోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీకి ఇబ్బందులు రాకుండా చంద్రబాబు వ్యూహాత్మకంగా కొందరిని బీజేపీలోకి పంపినట్టు గత మూడేళ్లుగా ప్రచారం జరుగుతోంది.
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటికొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక కూటమిలో చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషించారు. మోదీని ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని కానివ్వొద్దనే పట్టుదలతో చివరికి బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తో కూడా చంద్రబాబు చేతులు కలిపారు. చివరికి చంద్రబాబు అధికారాన్ని కోల్పోగా,మోదీ మరోసారి ప్రధాని అయ్యారు. దీంతో కుక్కిన పేనులా చంద్రబాబు ఉండిపోయారు.
ఎందుకైనా మంచిదని నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి పంపారని పెద్ద ఎత్తున విమర్శలున్న సంగతి తెలిసిందే. ఈ పరంపరలో మాజీ మంత్రి ఆదినారాయరెడ్డి, లంకా దినకర్, నాగభూషణం చౌదరి తదితర నేతల్ని కూడా బీజేపీలోకి పంపారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీలో ఉన్న టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటారనే ప్రచారానికి తెరలేచింది.
ఏపీలో బీజేపీకి ఇప్పట్లో భవిష్యత్ లేదనేది అందరికీ తెలుసు. రాజకీయ అవసరాల కోసం కొందరు ఆ పార్టీలో కొనసాగుతున్నారనేది వాస్తవం. ఎన్నికల ముందు ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుందని వారు అనుకోవడం లేదు. దీంతో తమ రాజకీయ భవిష్యత్‌ను చక్కదిద్దుకోడానికి టీడీపీ వైపు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు పార్టీకి , పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఈయన త్వరలో టీడీపీలో చేరుతారని సమాచారం. ఈయన మార్గంలోనే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మరి కొందరు టీడీపీ అభిమాన నేతలు వెళ్లే అవకాశం ఉందని బీజేపీ అనుమానిస్తోంది.
ఎందుకంటే రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని వీరు కోరడం వెనుక బాబు హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తుకు బీజేపీ నేతలు అంగీకరించకపోవడంతో …ఇక తాము ఉండి ప్రయోజనం లేదనే అభిప్రాయానికి ఆ నేతలు వచ్చినట్టు సమాచారం.
వచ్చే నెలలో రాజ్యసభ పదవీ కాలం ముగియనున్న సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్‌లు బీజేపీలో కొనసాగడంపై ఆ పార్టీ అనుమానిస్తోంది. టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ ఇప్పటికే కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్. అలాగే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు భూపేష్ జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్. వీరి గెలుపు కోసం కాకుండా, బీజేపీ కోసం పని చేస్తారని ఎవరైనా అనుకుంటే, అంతకంటే అజ్ఞానం మరొకటి వుండదు.
ఇక సుజనాచౌదరి గురించి చెప్పేదేముంది. రాజ్యసభలో ఇటీవల తన చివరి ప్రసంగంలో చంద్రబాబుపై ప్రదర్శించిన అభిమానం, ఆయన మనసులో చోటు ఎవరికో చెప్పకనే చెప్పింది. అందుకే రావెలతో మొదలైన రాజీనామాల పర్వం ఇంకా ఎవరెవరిని తీసుకెళుతుందోననే భయం మాత్రం బీజేపీలో ఉంది.