మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కడప జిల్లా కమలాపురంలో పర్యటనకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ నాయకుడు సాయినాథ్‌శర్మకు తీవ్రస్థాయిలో బెదిరింపులు వెళ్లడం చర్చనీయాంశమైంది. బాబు పర్యటనకు కేవలం ఒకరోజు ముందు సాయినాథ్‌శర్మను బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది? అనే చర్చకు తెరలేచింది.
“ఒరేయ్ సాయి నీ అంతుచూస్తాం. . చావుకు సిద్ధంగా ఉండు. నీవు రాజకీయాలు మానుకోకుంటే కారుకు పట్టిన గతే నీకు పడుతుంది. మేమంటే నీకు లెక్కలేదా? చంపేస్తాం నిన్ను తొందరలో” అని రాసిన స్టిక్కర్లను సాయినాథ్‌శర్మ కారుతో పాటు ఇంటికి అంటించడం గమనార్హం. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ విషయమై సాయినాథ్‌శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కడప జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం కమలాపురం నగర పంచాయతీ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇటీవల చంద్రబాబుకు సాయినాథ్‌శర్మ దగ్గరవుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేక ఎవరైనా బెదిరించి, రాజకీయాలకు దూరం చేయాలని భావిస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది.
కొంత కాలంగా కమలాపురంలో సాయినాథ్‌శర్మ యాక్టీవ్‌గా ఉన్నారు. అయితే కమలాపురం నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్ పుత్తా నరసింహారెడ్డి, సాయినాథ్‌శర్మ మధ్య తీవ్రస్థాయిలో గ్యాప్ వుంది. సాయిని పుత్తా లెక్కలోకి తీసుకోవడం లేదనే అభిప్రాయాలున్నాయి. కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల్లో సాయినాథ్‌శర్మకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఒకట్రెండు పంచాయతీల్లో తన అభ్యర్థులను సాయి గెలిపించుకున్నారు.
సాయినాథ్‌శర్మ నిత్యం ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తప్పు పడుతూ వుంటారు. పబ్లిక్‌లో కంటే మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తూ నాయకుడిగా సాయినాథ్‌శర్మ చెలామణి అవుతున్నారనే విమర్శ సొంత పార్టీ నేతల నుంచి తరచూ వినిపిస్తోంది. పార్టీలోని అంతర్గత విభేదాలే సాయినాథ్‌శర్మపై బెదిరింపులకు కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన ఎవరికీ మంచీచెడూ చేయరనే అభిప్రాయం వుంది. అందువల్లే సాయినాథ్‌శర్మను జగన్ మేనమామ బెదిరించే సీన్ లేదనేది టాక్.