Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ రెండు ఓటీటీలపై విరుచుకుపడుతున్న జనం

ఆ రెండు ఓటీటీలపై విరుచుకుపడుతున్న జనం

ఏదైనా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే చాలు, అందులో ఉన్న కంటెంట్ మొత్తం ఉచితంగా చూసుకోవచ్చు. మొన్నటివరకు చందాదారుడి ఆలోచన ఇది. కానీ ఓటీటీ  కంపెనీలు రెండాకులు ఎక్కువే చదివాయి. తమ చందాదారుడి నుంచి మరింత డబ్బు ఎలా లాక్కోవాలో వాళ్లకు తెలిసినట్టు వేరే వాళ్లకు తెలియదు. అందుకే ఓ పెద్ద సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టినప్పుడు అదనపు రుసుము విధిస్తున్నాయి. మీకు అప్పటికే ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ.. అదనంగా ఇంకొంత చెల్లించి ఆ సినిమా చూడాలన్నమాట. ఈ విధానంపై ప్రస్తుతం నెటిజన్లు భగ్గుమంటున్నారు.

ఎక్కడ క్రేజ్ ఉంటే అక్కడ క్యాష్ చేసుకోవాలనే విధానం సర్వసాధారణం. కానీ ఓటీటీలో సినిమా విడుదలయ్యాక చూద్దాం అనుకునే వాళ్లు ఈ అదనపు రుసుముల విధానం చూసి అవాక్కవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజై 50 రోజులైంది. ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. చక్కగా ఇంట్లో కూర్చొని చూద్దాం అనుకుంటే, ఎక్స్ ట్రా పేమెంట్ అడుగుతోంది జీ5.

ఆర్ఆర్ఆర్ ను వీక్షించాలంటే నెలసరి లేదా ఏడాది సబ్ స్క్రిప్షన్ తో పాటు అదనంగా వంద రూపాయలు చెల్లించాలి. జీ5లో ఏడాది సబ్ స్క్రిప్షన్ 599 రూపాయలుగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా చూడాలనుకుంటే 699 రూపాయలు చెల్లించాలి. అది కూడా సినిమాను 24 గంటల్లోనే చూసేయాలి. లేదంటే మరో వంద రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 20వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తోంది.

ఆర్ఆర్ఆర్ కంటే ముందే కేజీఎఫ్2 ఈ పద్ధతిని మొదలుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సూపర్ హిట్ సినిమాను ఆల్రెడీ స్ట్రీమింగ్ కు పెట్టేశారు. అమెజాన్ సబ్ స్క్రిప్షన్ ఉంది కదా అని క్లిక్ చేస్తే మాత్రం ఆశాభంగం తప్పదు. కేజీఎఫ్2 చూడాలనుకుంటే 199 రూపాయలు అదనంగా సమర్పించుకోవాల్సిందే.

ఓటీటీలో ఈ పోకడపై నెటిజన్లు, సబ్ స్క్రైబర్లు భగ్గుమంటున్నారు. ఆల్రెడీ చందా తీసుకున్న తర్వాత తిరిగి అదనంగా చెల్లించమని డిమాండ్ చేయడం అనైతికం అని అంటున్నారు. అయితే రెగ్యులర్ స్ట్రీమింగ్ కంటే కాస్త ముందే ఇలా అద్దె ప్రాతిపదికన సినిమాను పెట్టడం వల్ల కొంతైనా సొమ్ము చేసుకోవచ్చనేది ఓటీటీల ప్లాన్. మొత్తమ్మీద 2 పెద్ద సినిమాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. కానీ చేతిలో సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ చూడలేని పరిస్థితిలో ఉన్నారు ఓటీటీ ప్రేక్షకులు.

ఓటీటీ నెత్తిన భస్మాసుర హస్తం..

ఇటీవల సినిమా టికెట్ రేట్లు పెరగడంతో సినిమావాళ్లకు లాభాలు రాకపోగా.. థియేటర్ ఆక్యుపెన్సీ తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇప్పుడు ఓటీటీ కూడా ఇలాగే అత్యాశకు పోతోందేమో అనిపిస్తోంది. ఏడాది సబ్ స్క్రిప్షన్ తో తాము రైట్స్ తీసుకున్న అన్ని సినిమాలను ఉచితంగా చూపించాల్సిన ఓటీటీలు సినిమాకో రేటు అంటున్నాయి. 

ఆర్ఆర్ఆర్ కి 100, కేజీఎఫ్2 కి రూ.199.. ఇలా ఇచ్చుకుంటూ పోతే ఇక సబ్ స్క్రిప్షన్ ఎందుకు. ఇలా అదనంగా దండుకునే పద్ధతి ఓటీటీ వ్యవస్థకు మంచిది కాదని, కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టే అవుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఈ కొత్త పద్ధతి ఎలాంటి ఫలితాలు అందిస్తుందో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?