సీఎం జగన్ కామెంట్లు చూసి పవన్ కల్యాణ్ నొచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకరకంగా ఆయన సంతోషించాల్సిందే. 23 సీట్లున్న ప్రతిపక్ష నేతతో సమానంగా తనని కూడా సీఎం జగన్ పట్టించుకుంటున్నారని ఆనందించాలి. బాబుతో కలిపి చాకిరేవు పెడితే పెట్టారు, అసలు తన ఉనికిని ఆయన గుర్తిస్తున్నారని సంబరపడాలి.
బీజేపీ, సీపీఐ, సీపీఎం.. ఇతర చిన్నా చితకా పార్టీలను జగన్ పట్టించుకోవట్లేదు కానీ, అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని (ఉన్నా లేనట్టే), సొంతంగా పార్టీ అధ్యక్షుడే రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయిన పార్టీనీ, ఆ పార్టీ నాయకుడిని జగన్ పట్టించుకుంటున్నారంటే అంతకంటే విశేషం ఏముంటుంది..?
వ్యూహాత్మకంగా బాబుని పక్కనపెట్టినట్టే..
గతంలో చంద్రబాబుని పదే పదే వైసీపీ టార్గెట్ చేసేది. కానీ ఈ దఫా బాబుతో పాటు పవన్ కల్యాణ్ ని కూడా బాగానే టార్గెట్ చేస్తున్నారు. నేరుగా సీఎం జగనే దత్త పుత్రుడు అంటూ ర్యాగింగ్ చేస్తున్నారు. ఒకరకంగా ఈ వ్యాఖ్యలతో ఆయన చంద్రబాబుని పక్కనపెట్టారనే చెప్పాలి.
చంద్రబాబు గురించి క్లుప్తంగా మాట్లాడుతూ అదే సమయంలో పవన్ కల్యాణ్ ని విమర్శించేందుకు కూడా సమయం కేటాయిస్తున్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరూ తోడుదొంగలని చెప్పడమే ఇక్కడ జగన్ ఉద్దేశం.
చంద్రబాబు తప్పులు చేసినప్పుడు పవన్ తప్పించుకు తిరిగారని, తమ హయాంలో మంచి జరుగుతున్నా.. దాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారనేది జగన్ ఆరోపణ.
జనసైనికులకు నోటినిండా పనే..
జనసేనానిపై పదే పదే సీఎం జగన్ చేతిలో పంచ్ లు పడుతుండేసరికి జనసైనికులు కూడా రెచ్చిపోతున్నారు. దత్తపుత్రుడు అనే పేరు స్థిరపడిపోతుందేమోనని భయపడిపోతున్నారు. అటు పవన్ కూడా ఈ ర్యాగింగ్ ని తట్టుకోలేకపోతున్నారు. గతంలో పలుమార్లు ఆ పేరుతో పిలవొద్దు అని గింజుకున్నారు. కానీ పవన్ అనేకొద్దీ, జగన్ అదే పేరు ప్రస్తావించడం గమనార్హం.
సినిమాల్లో పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కావొచ్చు కానీ, ఏపీ రాజకీయాల్లో మాత్రం దత్తపుత్రుడు ఎవరంటే చిన్న పిల్లలు కూడా పవన్ కల్యాణ్ పేరు చెప్పే పరిస్థితి ప్రస్తుతం ఉంది. అప్పట్లో జగన్ ని సీఎం పీఠం ఎక్కకుండా అడ్డుకుంటానని ప్రగల్భాలు పలికిన పవన్, ఇప్పుడు ఎలాగైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జగన్ ని గద్దె దింపేస్తానంటూ రెచ్చిపోతున్నారు.
అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమీ లేదు. అప్పుడు అనధికారిక పొత్తు, రాబోయేది అధికారిక పొత్తు. అందుకే దత్తపుత్రుడి వ్యవహారం ఇప్పుడు హైలెట్ అవుతోంది.
ఒకరకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, కనీసం తనను కన్సిడర్ చేస్తున్నందుకైనా పవన్ గొప్పగా ఫీలవ్వాల్సిందే. అసెంబ్లీలోకి ఎంట్రీ లేకపోయినా సీఎం నోటి వెంట పదే పదే తన పేరు వస్తున్నందుకు సంతోషపడాలి.