ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ప్రజలు ఛీకొట్టినా కనీసం సొంతపార్టీ కార్యకర్తలయినా హర్షించేలా ఉండాలి. రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొంతమంది పచ్చ నేతలు వైసీపీపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే సొంత పార్టీవారే చీదరించుకుంటున్నారు. దిశ చట్టంపై టీడీపీ మహిళా నేతలు చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే వారు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థమవుతోంది.
మహిళా ఎమ్మెల్యే, టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కలసి ఓ డ్రామా మొదలు పెట్టారు. దిశ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ చేశారు. పోలీసులు ఫిర్యాదు తీసుకున్నా, దిశ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకోలేదని, అసలెందుకీ యాక్ట్, ఎందుకీ పోలీస్ స్టేషన్లంటూ ఓవర్ యాక్షన్ చేశారు. ఈ విమర్శలు వీరికే రివర్స్ అయ్యాయి.
సోషల్ మీడియాలో నెటిజన్లతో నానా తిట్లు తిన్నారు ఈ మహిళా నేతలు. మహిళల రక్షణ కోసం ప్రవేశ పెట్టిన పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సింది పోయి, రాజకీయ దురుద్దేశాలతో విమర్శలు చేయడం ఏపాటి న్యాయం, ఇదేనా మహిళకు మీరిచ్చే భద్రత, భరోసా అంటూ నెటిజన్లు వీరిని ఓ ఆటాడేసుకున్నారు.
భారతీయ నేరస్మృతి, నేర విచారణలో భాగంగా దిశ చట్టం ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే ఇది లాంఛనమే. మహిళలకు న్యాయం చేసే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినప్పుడు కేంద్రం కచ్చితంగా సమర్థిస్తుంది, అవసరమైతే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది అమలయ్యే విధంగా సూచిస్తుంది. ఈ ప్రాసెస్ లో ఉన్న చట్టాన్ని అమలులో లేని చట్టంగా టీడీపీ అభివర్ణించడం దారుణం. ఇలాంటి నీఛమైన విమర్శలు చేసి మరోసారి పరువు పోగొట్టుకున్నారు టీడీపీ మహిళా నేతలు.
ఏపీ దిశ చట్టం-2019 దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల దృష్టినీ ఆకర్షించింది. సత్వర న్యాయంతో పాటు, త్వరితగతిన బాధితులకు న్యాయ సహాయం అందే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ దిశ చట్టాన్ని అమలులోకి తెస్తున్నారు. దీనికి అనుబంధంగా దిశ పోలీస్ స్టేషన్లు, జిల్లాకో ప్రత్యేక న్యాయస్థానం కూడా రూపొందుతున్నాయి. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి చట్టాలని అమలు చేస్తామంటూ.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆసక్తి చూపించారు, అధికారులతో దిశ చట్టంపై అధ్యయనాలు మొదలు పెట్టారు.