ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెలుగుదేశం పార్టీకి దడ పుట్టించేదిలా ఉంది. ఆ మధ్య జగన్ ఢిల్లీకి వెళితే ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల అపాయింట్ మెంట్ దక్కలేదని తెలుగుదేశం అనుకూల మీడియా గంతులేసింది. అమిత్ షా కలిసినా.. నిమిషాల వ్యవధే అంటూ.. అంతులేని ఆనంద పడిపోయింది పచ్చ మీడియా. మరి అప్పుడు జగన్ కు ఢిల్లీలో కీలక అపాయింట్ మెంట్ లు దక్కలేదని ఆనంద పడ్డారంటే, ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటన, మోడీ అపాయింట్ మెంట్ టీడీపీకి సహజంగానే మింగుడుపడేది కాదు.
అందునా జగన్, మోడీల సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతకు మించి టీడీపీకి షాకింగ్ ఏమిటంటే, ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేబినెట్లో చేరే అంశం కూడా చర్చకు వస్తుందనేది! దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి వరస ఝలక్ లు తగులుతున్నాయి. ఇటీవలే ఒక మిత్రపక్షం శివసేన దూరం అయ్యింది. అకాళీదల్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇక జేడీయూ నితీష్ కుమార్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాడో తెలియదు. అవకాశవాదంలో నితీష్ ఇప్పటికే చంద్రబాబు స్థాయికి చేరారు.
ఆర్జేడీతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్న నితీష్ కుమార్, ఇప్పుడు బీజేపీతో కలిసి అధికారం అనుభవిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీతో ఆయన తెగదెంపులు చేసుకున్నా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి నేపథ్యంలో బీజేపీకి మిత్రుల అవసరం అయితే గట్టిగానే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాజ్యసభలో బీజేపీ ధాటిగా వ్యవహరించడానికి అవకాశం లేకుండా పోతోంది. సమీప భవిష్యత్తులో తాము అధికారాన్ని ఆశించే చోట కమలం పార్టీ మిత్రులను సంపాదించుకోలేదు. ఏపీలో బీజేపీ ఓటు బ్యాంకు ఒక్క శాతానికి లోపే ఉందాయె.
ఇలాంటి నేఫథ్యంలో మిత్రుడే కావాలనుకుంటే బీజేపీకి జగన్ కు మించిన ఛాయిస్ లేదు. అయితే ఇటీవలే పవన్ కల్యాణ్ ఆ పార్టీకి దోస్తు అయ్యాడు. కానీ పవన్ కనీసం ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేదనే విషయం దాస్తే దాగేది కాదు. పవన్ ను పట్టుకుని ఏపీని ఈదాలనే ప్రయత్నం బీజేపీ చేసేలా లేదు. తనైతాను ఢిల్లీ చుట్టూ తిరిగినా, బీజేపీ పల్లకి మోయడానికే వెళ్లినా మోడీ, షాలు పవన్ కు అపాయింట్ మెంట్ కూడా లేరు. ఈ సమీకరణాలన్నీ తెలుగుదేశం పార్టీకి ఝలక్ ను ఇచ్చేవిలా ఉన్నాయి. బీజేపీకి దగ్గరకావడమే శరణ్యం అనేలా చంద్రబాబు రాజకీయం సాగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గనుక మోడీ కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటే.. అప్పుడు పడుతుంది టీడీపీ గొంతులో పచ్చివెలగ కాయ!