మొదలైన పోలింగ్.. దిగ్గజాలు లేని తొలి తమిళ పోరు

జయలలిత, కరుణానిధి లేని తమిళనాడు ఎన్నికలివి. ప్రీపోల్ సర్వేలో.. డీఎంకేకే కాస్త మొగ్గు ఉందని తేలినా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తమిళనాడు ఎన్నికలను రసవత్తరంగా మార్చాయి. ఒకే విడతలో ఈరోజు పోలింగ్ పూర్తవుతుంది.…

జయలలిత, కరుణానిధి లేని తమిళనాడు ఎన్నికలివి. ప్రీపోల్ సర్వేలో.. డీఎంకేకే కాస్త మొగ్గు ఉందని తేలినా.. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తమిళనాడు ఎన్నికలను రసవత్తరంగా మార్చాయి. ఒకే విడతలో ఈరోజు పోలింగ్ పూర్తవుతుంది. మొత్తం 234 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈసారి పార్టీలు, కూటములు ఎక్కువకావడంతో.. తమిళనాడులో ఎన్నికల గందరగోళం నెలకొంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అన్నాడీఎంకే..అధికార అన్నాడీఎంకే పార్టీ 234 స్థానాల్లో కేవలం 179 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. 20 స్థానాలను బీజేపీకి అప్పగించింది, మిగతావి ఇతర పార్టీలకు కేటాయించింది. అన్నాడీఎంకేని 179 సీట్లకు పరిమితం చేయడంతోనే బీజేపీ సగం విజయం సాధించింది. కూటముల కుమ్ములాటతో లాభపడాలని చూస్తోంది బీజేపీ. అటు శశికళను ఎన్నికలకు దూరం పెట్టడంలో కూడా బీజేపీ హస్తం ఉందనే అనుమానాలున్నాయి. రజినీకాంత్ వెనకడుగు, ఆ తర్వాత ఆయనకు దాదా సాహెబ్ పురస్కారం.. అన్నీ ఎన్నికల స్టంట్ లు గా నే కనిపిస్తున్నాయి.

డీఎంకే..డీఎంకే కూటమి 173 స్థానాల్లో పోటీ చేస్తూ మిత్ర పక్షం కాంగ్రెస్ కి 25 స్థానాలు కేటాయించింది. కమ్యూనిస్ట్ లకు 12 సీట్లిచ్చారు. ప్రస్తుతానికి ఈ కూటమే కాస్త బలంగా కనిపిస్తోంది. దినకరన్ ఆద్వర్యంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం 161 స్థానాల్లో బరిలో ఉంది. ఆ కూటమిలో విజయ్ కాంత్ ఉన్నా.. పెద్ద ప్రభావం కనిపించేలా లేదు.

మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సొంతంగా పోటీ చేయాలని అనుకున్నా.. చివరకు ఆయన కూడా కూటమి కట్టారు. శరత్ కుమార్ సహా మరికొందరి సహకారం కోరారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కమల్ హాసన్ ఈసారి అక్కడ విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. ఆ స్థానంలో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పోటీలో లేకపోవడం, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు, ప్రత్యర్థులుగా ఉండటం కమల్ కి కలిసొచ్చే అంశం.

ఇక చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం కూడా వార్తల్లో నిలిచింది. బీజేపీ తరపున నటి కుష్బూ ఇక్కడ బరిలో దిగారు. ఆమె కోసం ఏకంగా అమిత్ షా ప్రచార పర్వానికి కదిలొచ్చారు.

ఎండలు మండిపోతుండటంతో.. తమిళనాడులో ఉదయం నుంచే పోలింగ్ జోరుగా సాగుతోంది. హీరో అజిత్ సహా ఇతర ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన ప్రీపోల్ సర్వేలన్నీ డీఎంకేకే మెజార్టీ వస్తుందని తేల్చి చెప్పినా చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.