తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. ప్రాదేశిక ఎన్నికల్లో ఎక్కడ టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు? ఎక్కడ తప్పుకున్నారు? అనేది అంతుబట్టని ప్రశ్నగా మారుతోంది. పలు చోట్ల తెలుగుదేశం నేతలు స్పందిస్తూ.. తమ పార్టీ అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నుంచి తమ అభ్యర్థులు తప్పుకునేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నట్టుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రకటించినా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నేతలు మాత్రం పోటీలో ఉన్నట్టుగా ప్రకటించుకుంటున్నారు.
సాధారణంగా ప్రాంతీయ పార్టీలో అధినేతలు చెప్పిందే వేదం. అధినేత కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అయినా నడుస్తుంది, నడవాలి కూడా. ఒక్కసారి అధినేత పట్టు జారిందంటే ఆ తర్వాత పార్టీ పరిస్థితి తేడా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు టీడీపీలో అదే జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కోరి ఈ పరిస్థితిని తెచ్చుకున్నారు.
ప్రాదేశిక ఎన్నికల బహిష్కరణ చంద్రబాబు చేసుకున్న సెల్ఫ్ గోల్. దాన్ని సమర్థించడానికి పచ్చ చొక్కాల్లో కొందరు చాలా ప్రయాస పడుతున్నారు. జయలలిత, మాయవతి అంటున్నారు. అయితే వారు ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదేమో కానీ, ఇలా స్థానిక ఎన్నికల్లో చేతులెత్తేస్తే ఈ పార్టీ పరిస్థితి అయినా డొల్లగా మారుతుంది.
ఈ విషయం టీడీపీ నేతలకు కూడా తెలుసు. అందుకే కొందరు తాము పోటీలో ఉన్నట్టే అని ప్రకటించుకుంటున్నారు. కర్నూలు జిల్లా టీడీపీ నేత భూమా అఖిలప్రియ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. తన నియోజకవర్గంలోని మండలాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉంటారంటూ ఆమె ప్రకటించారు. చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని ఆమె కూడా ధిక్కరించారు.
చంద్రబాబు నాయుడు బహిష్కరణ విషయాన్ని ప్రకటించగానే కొంతమంది పచ్చ చొక్కాలు ఖర్చులు మిగిలాయని, ఎండల్లో తిరిగే పని లేదని.. ఆ ప్రకటనను సమర్థించగా, మరి కొందరు మాత్రం పోటీలో ఉన్నట్టుగా స్పష్టం చేస్తున్నారు.
ఆల్రెడీ నామినేషన్లు కూడా దాఖలై ఉండటంతో వీరికి అవకాశం దక్కుతూ ఉంది. అయితే టీడీపీ ఎక్కడ పోటీలో ఉంది, ఎక్కడ చేతులెత్తేసింది అనే విషయాలపై ఆ పార్టీ వీరాభిమానులకు కూడా క్లారిటీ లేదు. స్థూలంగా పచ్చ పార్టీలో బహిష్కరణ పిలుపు పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తోంది. సైకిల్ పూర్తిగా బ్యాలెన్స్ తప్పిన వైనం స్పష్టం అవుతోంది.