ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా నోటిఫికేషన్ ను రద్దు చేయాలనే డిమాండ్ మాత్రం తప్పడం లేదు. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ ఇలాంటి డిమాండ్ లను చేయడాన్ని పనిగా పెట్టుకుంది.
గతంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్, ఆ పై ప్రాదేశిక ఎన్నికల నోటిఫికేషన్ విషయంలో కూడా బీజేపీ ఇదే డిమాండ్ చేసింది, చేస్తోంది. నోటిఫికేషన్ లను రద్దు చేసి ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించాలనే డిమాండ్ బీజేపీది. అయితే తీరా ఏ ఎన్నికలోనూ బీజేపీ కనీసం తన ఉనికిని చాటలేకపోయింది.
విశేషం ఏమిటంటే.. తిరుపతి ఉప ఎన్నిక విషయంలోనూ బీజేపీది అదే డిమాండ్! ఢిల్లీలోని బీజేపీ నేతలు, ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యులు వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి తిరుపతి ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరారట!
ఎందుకలా.. అంటే, బీజేపీకి ఇదొక అలవాటుగా మారినట్టుగా ఉందంతే. నోటిఫికేషన్ నే రద్దు చేసేయమని కోరితే ఒక పని అయిపోతుందన్నట్టుగా ఉంది కమలం పార్టీ వ్యవహారం. ఆల్రెడీ ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ జరుగుతోందని.. రెండింటికీ ప్రచారం కష్టమని బీజేపీ నేతలు అన్నారట. రెండు ఎన్నికలు ఒకేసారి ఎలా జరుపుతారంటూ కమలం నేతలు ప్రశ్నించారట!
ఇక చిత్తూరు, నెల్లూరు కలెక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా సీఈసీకి ఫిర్యాదు చేశారట బీజేపీ నేతలు! గాజుగ్లాసు గుర్తును మరోపార్టీకి కేటాయించడం పై కూడా వారు కంప్లైంట్ ఇచ్చారట.
స్థూలంగా ప్రస్తుతం సాగుతున్న నోటిఫికేషన్ ను రద్దు చేసేసి, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలనేది బీజేపీ నేతల డిమాండ్ అట! మళ్లీ నోటిఫికేషన్ ఇస్తే? అప్పుడు మళ్లీ రద్దు చేయాలని కోరతారేమో! ఎన్నిక ఏదైనా నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరడం మాత్రం బీజేపీ రొటీన్ డిమాండ్ అయ్యింది.