సినీ నటి కరాటే కల్యాణి ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చారు. పిల్లల దత్తత, యూట్యూబర్‌పై దాడి నేపథ్యంలో ఆమె అదృశ్యం కావడం, సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ కావడంతో రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె మీడియా ముందుకొచ్చారు. తానెక్కడికీ పారిపోలేదని చెప్పుకొచ్చారు. ఫోన్ ప్రాబ్లమ్ ఉండటం వల్ల స్విచ్చాఫ్ అయిందన్నారు. అందుకే ఎవరికీ అందుబాటులోకి రాలేదన్నారు.
తానెవ్వరినీ కిడ్నాప్ చేయలేదన్నారు. పాపకు సంబంధించిన పూర్తి ఆధారాలను కలెక్టర్‌కు అందజేస్తానని కరాటే కల్యాణి స్పష్టం చేశారు. అన్యాయాన్ని సహించనని, అందుకే తానంటే కొందరికి నచ్చకపోవచ్చన్నారు. తనకు అన్యాయం జరుగుతూనే ఉందని వాపోయారు. సినిమా వాళ్లకు పిల్లలను అమ్ముకుంటున్నట్టు వస్తున్న ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేశారు. తాను అంత నీచమైన స్థాయికి దిగజారలేదన్నారు.
తన చావు కావాలని ఎవరైనా కోరుకుంటే సంతోషంగా చచ్చిపోతానన్నారు. ఫైట్ చేస్తుంటే తనను ఎదుర్కోలేక పోతున్నారా? అని ప్రశ్నించారు. పిల్లలను అమ్ముకునే హేయమైన పరిస్థితిలో లేనట్టు చెప్పారు. తాను పారిపోయే రకం కాదని, పరిగెట్టించే రకమని హెచ్చరించారు.
తనకు పిల్లలంటే ఇష్టమన్నారు. పిల్లలు పుట్టకపోవడంతో దత్తత తీసుకోవాలని అనుకున్నట్టు కరాటే కల్యాణి వివరణ ఇచ్చారు. తాను పిల్లను పెంచుకుంటున్న విషయంపై అమ్మ విజయలక్ష్మికి క్లారిటీ లేదన్నారు.
పాపను సంవత్సరం తర్వాత అధికారికంగా దత్తత తీసుకుంటానన్నారు. శివశక్తి అనే సంస్థ తనపై ఇదంతా చేయిస్తోందని ఆరోపించారు. ఇల్లు కొనుగోలు విషయంలో తనను మోసం చేశారన్నారు. పోర్న్ కంటెంట్‌పై పోరాటం చేస్తానన్నారు. తాను బీజేపీలో ఉన్నానని, అందుకే రాజకీయ కుట్ర కూడా ఉందని కల్యాణి అనుమానించడం గమనార్హం.