జ‌గ‌న్‌కు ఉచిత స‌ల‌హాలు!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏం చేయాలో, ఏం చేయ‌కూడ‌దో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్ప‌డం కాసింత ఆశ్చ‌ర్యంగా, విడ్డూరంగా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టానంటూ ఇత‌ర పార్టీల ప‌ల్ల‌కీలు మోయ‌డం స్టార్ట్ చేయ‌డంతో…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఏం చేయాలో, ఏం చేయ‌కూడ‌దో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్ప‌డం కాసింత ఆశ్చ‌ర్యంగా, విడ్డూరంగా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టానంటూ ఇత‌ర పార్టీల ప‌ల్ల‌కీలు మోయ‌డం స్టార్ట్ చేయ‌డంతో విమ‌ర్శ‌లపాల‌వుతున్నారు. విద్వేష రాజ‌కీయాల‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెర‌లేపార‌నే ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు.

ఈ నేప‌థ్యంలో ట్విట‌ర్ వేదిక‌గా వైఎస్ జ‌గ‌న్‌కు ప‌వ‌న్ ఉచిత స‌ల‌హాలివ్వ‌డం విశేషం. నాడు చంద్ర‌బాబు పాల‌న‌లో రైతుల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోతే ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని జ‌గ‌న్ నిల‌దీసిన నేప‌థ్యంలో ఈ ట్వీట్ పొలిటిక‌ల్ తెర‌పైకి వ‌చ్చింది. చంద్ర‌బాబు చేస్తున్న విమ‌ర్శ‌ల‌నే త‌న పేరుతో ప‌వ‌న్ ట్వీట్ చేశారే త‌ప్ప‌, ఇవి ఆయ‌న సొంత అభిప్రాయాలు కాద‌నే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ప‌వ‌న్ ట్వీట్ ఏంటో చూద్దాం.

“శ్రీలంక  నుంచి తమిళనాడుకి గంట దూరం- శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరం. ఇంకా లేని పొత్తులు గురించి విమర్శించటం, గడప గడపకి ఎమ్మెల్యేలని పంపటం కాదు చెయ్యవలసింది. మీరు చేసిన అప్పులు నుంచి ఆంధ్రప్రదేశ్‌ని దూరం జరిపే ప్రయత్నం చెయ్యండి” అని ప‌వ‌న్ ఉచిత స‌ల‌హా ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

అప్పులు చేయ‌డంలో చంద్ర‌బాబు, జ‌గ‌న్ దొందు దొందే. అయితే నాడు చంద్ర‌బాబును మాట మాత్రం కాకుండా అన‌కుండా, నేడు జ‌గ‌న్‌పై మాత్రమే విమ‌ర్శ‌లు చేయ‌డం వ‌ల్ల ప‌వ‌న్ రాజ‌కీయానికి విశ్వ‌స‌నీయ‌త పోయింది. చంద్ర‌బాబును సీఎం చేయ‌డానికి మాత్ర‌మే ప‌వ‌న్ ఉన్నార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డ‌డానికి ఇలాంటి ట్వీట్లు, విమ‌ర్శ‌లే కార‌ణం. 

శ్రీ‌లంక‌కు, మ‌న రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితికి ఏంటి సంబంధం? ఏదో ఒక‌టి విమ‌ర్శ చేయాల‌నే త‌లంపుతో పొంత‌న లేకుండా మాట్లాడ్డం వ‌ల్లే ప‌వ‌న్ చుల‌క‌న అవుతున్నారు. అదేదో జ‌గ‌న్ మాత్ర‌మే అప్పులు చేస్తున్న‌ట్టు, మ‌రెవ‌రూ చేయ‌న‌ట్టు ప‌వ‌న్ విమ‌ర్శ‌లున్నాయి. 

బీజేపీ అధికారంలోకి వ‌చ్చే నాటికి మ‌న‌దేశం అప్పు ఎంత‌;? ఇవాళ ఎంత‌? ప‌వ‌న్ వాస్త‌వాలు చెప్పి, నిల‌దీసే ద‌మ్ముందా?  కేవ‌లం జ‌గ‌న్‌పై అక్క‌సుతో ప‌వ‌న్ విమ‌ర్శిస్తున్నార‌నే సంగ‌తి జ‌నానికి తెలిసిపోయింది. అందుకే ఆయ‌న‌కు జ‌నం నుంచి త‌గినంత‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేద‌న్న‌ది వాస్త‌వం.