పసుపు ఖాకీలు: ఈ పాపం నీది కాదా చంద్రబాబూ!

అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ విభాగాన్ని తనకి ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు చంద్రబాబు. ఎన్నికల సమయంలో తనకి అనుకూలంగా పనిచేసే ఉన్నతోద్యోగుల్ని వైసీపీ ప్రభావిత జిల్లాలకు పంపించారు. వైసీపీ కార్యకర్తల్ని, అభ్యర్థుల్ని ముప్పతిప్పలు పెట్టారు. ఒకే…

అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ విభాగాన్ని తనకి ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు చంద్రబాబు. ఎన్నికల సమయంలో తనకి అనుకూలంగా పనిచేసే ఉన్నతోద్యోగుల్ని వైసీపీ ప్రభావిత జిల్లాలకు పంపించారు. వైసీపీ కార్యకర్తల్ని, అభ్యర్థుల్ని ముప్పతిప్పలు పెట్టారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి అప్పటి చంద్రబాబు సర్కారు కీలక శాఖల్లో పోస్టింగ్ లు ఇచ్చి మరీ తమ పబ్బం గడుపుకుంది.

దీనిపై జగన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. ఈసీ కలుగజేసుకుని ఇద్దరు ఎస్పీలను బదిలీ చేసిందంటే.. అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే ఈ పసుపు ఖాకీలకు పాపం పండింది. జగన్ సర్కారు ఏరివేత మొదలు పెట్టింది. డీఎస్పీ స్థాయి ఉద్యోగుల్ని సైతం వీఆర్ కు పంపించింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పై వేటు వేయడంతో ఒకరకంగా ఈ ప్రక్షాళణ పూర్తయినట్టే చెప్పాలి.

అయితే అంతలోనే టీడీపీ నేతలు ఖాకీలకు వంతపాడుతూ కొత్త పల్లవి అందుకున్నారు. ఉద్యోగులపై జగన్ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ దుష్ప్రచారానికి తెరతీశారు. అసలీ పాపాలన్నిటికీ కారణం చంద్రబాబు కాదా. పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగుల్ని వాడుకునే దౌర్భాగ్య స్థితికి చంద్రబాబు రాజకీయాల్ని దిగజార్చారు. ఉద్యోగ సంఘాల నాయకుల సేవలకు ప్రతిఫలంగా వారికి ఎమ్మెల్సీ సీటు కూడా ఇచ్చారంటే.. పదవిలో ఉన్నప్పుడు వారు ఎంతగా బాబుకి సేవచేసి తరించారో అర్థం చేసుకోవచ్చు.

ఈ కారణాల వల్లే అక్రమాలకు సహకరించిన అవినీతి పోలీస్ అధికారులపై జగన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. చేసిన పాపానికి వారు శిక్ష అనుభవిస్తున్నారు. ఆ పాపాలకు సూత్రధారి అయిన చంద్రబాబు ఇప్పుడు బైటకొచ్చి వీరంగం వేయడమే ఇక్కడ కొసమెరుపు. అయితే బాబు మొదలుపెట్టిన ఈ డ్రామా కూడా ఎక్కువ రోజు సాగదంటున్నారు విశ్లేషకులు. టైమ్ చూసి ఈ అంశంపై కూడా బాబు యూటర్న్ తీసుకోవడం గ్యారెంటీ అని చెబుతున్నారు.

ఈ వేసవి లో పెళ్లి చేసుకోబోతున్న దిల్ రాజు