ఎమ్బీయస్‌: కేంద్రం జోక్యం చేసుకోవాలా?

అమరావతి ఆందోళన చేసిచేసి టిడిపి కాళ్లు పీకుతున్నాయి. కేంద్రం బూచి చూపి జగన్ని బెదిరించ బోయారు. ‘ఎక్కడ ఉన్నా, ఏమైనా నీ సుఖమే కోరుతున్నా, అందుకే పార్టీ వీడి వెళ్లా…’ అని పాట పాడుకునే…

అమరావతి ఆందోళన చేసిచేసి టిడిపి కాళ్లు పీకుతున్నాయి. కేంద్రం బూచి చూపి జగన్ని బెదిరించ బోయారు. ‘ఎక్కడ ఉన్నా, ఏమైనా నీ సుఖమే కోరుతున్నా, అందుకే పార్టీ వీడి వెళ్లా…’ అని పాట పాడుకునే సుజనా చౌదరి చేత ‘కేంద్రం ఊరుకోదు, ఖబడ్దార్‌’ అనిపించారు. ఆయన వెనకాలే నిలబడి జివిఎల్‌ నోట్లో నాలుక ఆడిస్తూ ‘అంతా ఉత్తిత్తిదే’ అనేశారు. దాంతో కన్నయ్య గారు ‘అయినను హస్తినకు పోయి చక్రం తిప్పవలె’ అన్నారు కానీ ఆశించిన రీతిలో ఏ ప్రకటనా రాలేదు.

ఓపిక పట్టలేని గల్లా కేంద్రాన్ని గల్లా పట్టుకుని అడిగేశారు 'కలగజేసుకుంటారా' లేదా అని. కేంద్రం తొణక్క, బెణక్క, సణక్క చెప్పేసింది  -కోం అని. దాంతో యిప్పుడు పార్టీపరంగా నెగ్గుకు వద్దామని చూస్తోంది టిడిపి. ఉద్యమనాయకత్వం వహించమని బిజెపిని అడుగుతోంది. ఎందుకీ అవస్థ అంటే పరిస్థితి అలా దాపురించింది పాపం.

ఎంతెంత దూరం?

ఉద్యమం మొదలై 50 రోజు దాటింది. ఫలితం  కనుచూపు మేరలో ఆనటం లేదు. రాజధాని కదిలించవద్దు అంటున్నారు రైతు. ‘అబ్బే, నేనెక్కడ కదిలించాను, లెజిస్లేటివ్‌ రాజధాని అక్కడేగా ఉంటుంది’ అంటున్నాడు జగన్‌. ‘అది ఒకటే కాదు, తక్కిన రాజధాను లు అక్కడే వుండాలి. ఒట్టి రాజధానే కాదు, ‘కాశీపట్నం చూడర బాబూ’లో బాబు చూపించిన రంగు మేడలన్నీ వెలవాలి’ అంటున్నారు వీళ్లు. ‘డబ్బెక్కడుంది? బాబు వల్లే కాలేదు. ఎక్కడ ఖర్చు తక్కువౌతుందాని చూసుకుని, అక్కడక్కడ సర్దుతున్నా’ అంటున్నాడు జగన్‌. ఎన్నాళ్లు వాదించినా దీనికి అంతేముంది? పరిష్కారమేముంది? అందుకే రైతులు.. అన్నదాతలు.. త్యాగమూర్తులు.. వాళ్ల పొట్ట కొడితే ఎలా? అనే సెంటిమెంటు మీదే కథ నడుపుతున్నారు. ఎన్నో ఆశతో కోట్ల కొద్దీ పెట్టుబడి పెట్టాం, యిప్పుడెలా? అనే యిన్వెస్టర్ల పేర ఉద్యమం చేయలేరు కదా!

‘మొండివాడు రాజు కంటె బలవంతుడు’ అని సామెత. ఇక్కడ మొండివాడే రాజు అయినప్పుడు డబుల్‌ వ్హామీ. జగన్‌ చలించటం లేదు. తన పని తను చేసుకుని పోతున్నాడు. జీఓలతోనే ఆఫీసు తరలిస్తున్నాడు. వాట్‌ నెక్స్‌ట్‌? అనేది టిడిపి సమస్య. అస్త్రాలన్నీ దాదాపుగా అయిపోయినట్లున్నాయి. కోర్టు మీదే ఆశ. మహా అయితే ఏదో ఒక న్యాయమూర్తి రాజధానిని తరలించడానికి వీల్లేదు అనవచ్చు. ఏ చట్టం కింద, ఏ పూర్వ ఉదాహరణ ఉటంకించి వీల్లేదంటున్నావు అని ప్రభుత్వం అడగవచ్చు. సుప్రీం కోర్టుకి అప్పీలు కి వెళ్లవచ్చు. రాజ్యాంగంలో దీని గురించి రాయలేదు. శివరామకృష్ణన్‌ రిపోర్టు ఒకటి ప్రభుత్వానికి అంది వస్తుంది. అక్కడైతే   అప్పివ్వనన్న ప్రపంచ బ్యాంకు ప్రకటన కూడా ఉపకరిస్తుంది. పర్యావరణ సంస్థల రిపోర్టులు ఎలాగూ ఉన్నాయి.

నష్టపోయిన రైతులెందరు?

ఇవన్నీ తిరస్కరిస్తూ ఒకవేళ కోర్టు ‘మూడు రాజధానుల ఐడియా నాన్సెన్స్‌, నో’ తరలింపు’ అని గట్టిగా చెప్పినా, ‘ఇక్కడి రైతు వాళ్ల కూతుళ్లకు భారీ కట్నా లు యిచ్చేందుకు వీలుగా అద్భుత నగరాన్ని కట్టు’ అని చెప్పగలదా? ఆ అద్భుతనగరం వెలవనప్పుడు ఒట్టి రాజధాని పేర నాలుగు బిల్డింగులు మాత్రమే ఉంటే లాభమేమిటి? నయా రాయపూర్‌, కొత్త భువనేశ్వర్‌లో భూములున్నవారు ఏమైనా బావుకుంటున్నారా? ఈ తరహా ఆలోచనలు రైతులకు వస్తూండవచ్చు. నిజానికి 28 వేల మంది రైతుల్లో తమకు ఎలాట్‌ అయిన వాటిని అమ్ముకోనివారు 6 వేలే మిగిలారని బుగ్గన అసెంబ్లీలో లెక్కలు చెప్పారు. తక్కినవారికి బాగానే ఆదాయం వచ్చి వుండాలి. నేను విన్న కేసులో 450 చ.గ. కమ్మర్షియల్‌ స్థ లం 1.20 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది కాక 1000 చ.గ. నివేశన స్థలం యిచ్చారు. దాన్ని ఏకాండీగానో, విడివిడిగానో అమ్మి వుంటే మరో 80 లక్షలు వచ్చి ఉండవచ్చు. అంటే రెండు కోట్లు అన్నమాట. ఇది యావరేజి ఫిగరు. కొందరికి ఎక్కువ వచ్చి వుండవచ్చు, మరి కొందరికి తక్కువ వచ్చి వుండవచ్చు.

ఎకరా-రెండు ఎకరాల లోపలున్న రైతు 86% మంది ఉన్నారని ఆంధ్రజ్యోతి రాసింది. అంత చిన్నస్థాయిలో చేసేది కిట్టుబాటు వ్యవసాయం కాదు. పెద్దగా ఏమీ మిగలదు. అలాటప్పుడు తమకు ఎలాట్‌ చేసిన భూమును అమ్ముకుని ఎకరాకు రూ. 2 కోట్లు సంపాదించినపుడు రైతు సంతోషంగానే ఉంటాడు. ఎన్నేళ్లు చెమటోడిస్తే అంత సమకూరుతుంది? తమకు ఎలాట్‌ అయినవి అమ్ముకోకుండా ఉన్న రైతుల్లో ఆందోళన వుండడం సహజం. ఎక్కువ వస్తుందని ఆశ పడకుండా, అప్పుడే అమ్మేసుకోవాల్సింది అనే బాధ తినేస్తుంది. కానీ యీ 6 వేలమంది రిజిస్టర్‌ చేయించుకోని వాళ్లన్నమాట. వీళ్లల్లో కొందరు బయానా తీసుకుని, ఎగ్రిమెంట్లు రాసుకుని ఉన్నారేమో మనకు తెలియదు. అలాటి కేసుల్లో మారిన పరిస్థితుల కారణంగా అవతలి వాళ్లు తక్కిన సొమ్ము యిచ్చి రిజిస్టర్‌ చేయించుకోవడం కంటె అడ్వాన్సు  వదులుకోవడం మంచిదనుకోవచ్చు. అలా అయితే వీళ్లకు ఆ డబ్బూ మిగుతుంది, భూమీ మిగుతుంది.

రైతుల్లో చీలిక!? 

ఇది కాక వీళ్లందరికీ ప్రభుత్వం రైతు కూలీ పరిహారం కింద, భూమి పరిహారంగా యిచ్చే సొమ్ముంది. దాన్ని పెంచుతామంటున్నారు, మరిన్ని ఏళ్లు యిస్తామంటున్నారు. ఇంకేం మరి? ఇలాటి కారణాల వలనే ఉద్యమం నిదానంగా సాగుతోంది. అన్నంముద్ద కోసం జరిగే పోరాటం వేరు, ఐస్‌క్రీము కోసం జరిగే అడిగే తీరు వేరు. అసలైన ఆక్రోశమంతా ఎగబడి పెట్టుబడి పెట్టినవాళ్లది. వాళ్లే టిడిపిపై ఒత్తిడి పెడుతున్నారు ఏదో ఒకటి చేయండి, తరలింపు ఆపండి అంటూ. లేకపోతే మూడు రాజధానుల విషయం యింత చర్చనీయాంశం అయ్యేది కాదు. అమరావతి ఉద్యమానికి సాక్షి తప్ప మీడియా అంతా మద్దతిచ్చింది. వైసిపి తప్ప అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. ఇంతకంటె యింకేం చేయాలి అని టిడిపి వారు ఎదురు ప్రశ్నించవచ్చు.

జై ఆంధ్ర ఉద్యమం 6 నెలలు సాగింది. ఇందిరా గాంధీ మొండికేసి కూర్చోవడంతో చివరకు చప్పబడింది. తెలంగాణ ఉద్యమం ఏళ్ల తరబడి సాగింది. సోనియా మొండికేసినంత కాలం ఏమీ జరగలేదు. చల్లబడింది అనుకున్నాక తన స్వప్రయోజనాల కోసం యిచ్చింది తప్ప ఉద్యమానికి భయపడి కాదు. మొదటిది 13 జిల్లాల్లో సాగితే రెండోది 10 జిల్లాల్లో సాగింది. ఇప్పుడీ ఉద్యమం 2 జిల్లాలకే పరిమితం. అందువలన రాష్ట్రం అట్టుడికి పోవడం లేదు. ఉద్యమకారులు విజయవాడను దిగ్బంధం చేసి ఉంటే అప్పుడు దాని ప్రభావం దేశమంతా ఫీలయేది. ఉద్యమం సంగతి దేశప్రజలు చర్చించేవారు. కానీ టిడిపికి అంత శక్తి ఉన్నట్లు తోచటం లేదు. కొన్ని గ్రామాల్లోనే నడపగలుగుతోంది. కవరేజి కోసం టీవీ కెమెరా వాళ్లు తప్ప తక్కినవాళ్లు వెళ్లనక్కరలేని ప్రాంతాల్లో ఉన్నాయవి. ప్రజాజీవితం యథావిధిగా సాగిపోతోంది.

ఆ ప్రాంతాల రైతుల్లో చీలిక తెచ్చేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది. జగనే మా దగ్గరకు వచ్చి మాట్లాడాలి అని భీష్మించుకుని కూర్చున్న రైతులను వదిలేసి, తక్కినవారిని తన వద్దకు రప్పించుకున్నాడు జగన్‌. ఊళ్ల వారీగా పథకాలు  ప్రకటించి వాళ్లను ఆకట్టుకుంటున్నాడు. రైతులు – ముఖ్యంగా రాజకీయంగా చైతన్యవంతంగా ఉండే అక్కడి రైతులు- అమాయకులు కారు. వాళ్లూ పేపరు చదువుతున్నారు, టీవీలు చూస్తున్నారు.  వాళ్లకు తెలుసు – రాష్ట్రం దగ్గర డబ్బు లేదు, కేంద్రం యివ్వటం లేదు, తమకు గత ప్రభుత్వం రాసిచ్చిన ఒప్పందాల్లో ఫలానా తేదీలోగా డెవలప్‌ చేస్తామని లేదు, అందువలన చేస్తాంచేస్తామంటూ యీ ప్రభుత్వం ఏళ్లూపూళ్లూ గడిపేయవచ్చు. టిడిపి మళ్లీ ఎన్నటికి అధికారంలోకి వచ్చేనో, ఎప్పుడు కట్టేనో! కాబట్టి యిప్పటికిప్పుడు వచ్చే లాభాలు  చూసుకుందాం అని గ్రామవాసులు అనుకుంటే వైసిపి వలలో పడతారు. ఉద్యమం  పూర్తిగా నీరు కారుతుంది.

రావమ్మ కేంద్ర లక్ష్మి, రావమ్మా..

ఇదంతా చూసి టిడిపి భయపడుతోంది. కేంద్రాన్ని యిన్‌వాల్వ్‌ చేద్దామని చూస్తోంది. కేంద్రం తలచుకుంటే ఏమైనా చేయగదు, తరలింపు ఆపేయగలదు, జగన్‌కు మొట్టికాయలు వేసి కట్టడాలు కట్టించేయగలదు అని ఉద్యమకారులను ఊదరగొడుతోంది. కేంద్రం మిథ్య అన్నాడు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్‌. రాష్ట్రానికి సిబిఐని రానివ్వమన్నాడు ప్రస్తుత అధ్యక్షుడు. కేంద్రం ఐటీ, ఈడీ దాడుల ద్వారా ఆంధ్రులపై దాడి చేసిందనీ అన్నాడు. రాష్ట్రప్రభుత్వ హక్కులలో కేంద్రం జోక్యం చేసుకోకూడదని గురించి అనేకసార్లు నినదించిన టిడిపి యిప్పుడు కేంద్రాన్ని రారమ్మని పిలుస్తోంది. మూడు రాజధానులను అడ్డుకోండి, రాజధాని తరలింపు ఆపండి, శాంతిభద్రతలకు లోపం జరిగిందనే మిషతో జగన్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయండి అని విన్నపాలు చేస్తోంది.

గతంలో సంస్థానాధీశులు ఇంగ్లీషు వారిని, ఫ్రెంచ్‌ వారిని యిలాగే పిలిచేవారు. ఓ రాజు చనిపోగానే, గద్దె కోసం కొడుకులు తమలో తాము కలహించుకుని బయటివారి మద్దతు కోసం చూసేవారు. అన్నగారు ఇంగ్లీషు వాళ్లని ఆశ్రయిస్తే, తమ్ముడు ఫ్రెంచ్‌ వాళ్ల దగ్గరకు వెళ్లేవాడు. వీళ్ల తరఫున వాళ్లు యుద్ధాలు చేసేవారు. నెగ్గినవాడు కొత్త రాజు నుంచి కొంత ప్రాంతం రాయించుకుని, కొన్ని హక్కులు సంపాదించుకునేవారు. తమిళనాడులో డిఎంకె ప్రాంతీయపార్టీగా అవతరించి, కాంగ్రెసును తరిమికొట్టింది. కొన్నాళ్లకు డిఎంకె చీలింది. ఎడిఎంకె, డిఎంకెలు అవతలివాళ్లను అణచడానికి కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోసాగాయి. కొంతకాలానికి బిజెపి జాతీయస్థాయిలో బలపడ్డాక, అదీ యిదే ఆట ఆడింది. ఇప్పుడు ఆంధ్రలో టిడిపి-వైసిపి-బిజెపిల మధ్య యిదే ఆట సాగుతోంది. మొన్నటిదాకా బిజెపిని నానా తిట్లూ తిట్టిన టిడిపి యిప్పుడు వైసిపిపై పోట్లాడడానికి కలిసి రావాని కోరుకుంటోంది. పోరాటం అయిపోయాక మళ్లీ మీకు మీరే-మాకు మేమే అనవచ్చని ఆశ.

బిజెపి అధిష్టానాన్ని ఎప్రోచ్‌ కాలేరు కాబట్టి అక్కడున్న ‘మనోడు‘ను వాడారు. కానీ కేంద్రం ప్రత్యేక హోదా యిస్తుంది, యిస్తోంది, యిస్తూనే.. వుంది అంటూ చెప్పిన కబుర్ల వలన సుజనా చౌదరి పరపతి తిరపతికి వెళ్లింది. బిజెపి తన అధికార ప్రతినిథి జివిఎల్‌ చేత వెంటనే కౌంటర్‌ యిప్పించేసింది – కేంద్రం కలగజేసుకోదు అంటూ. దాంతో కొన్నాళ్లు తగ్గినా సుజనా యీ మధ్య ‘సరైన సమయంలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుంది’ అంటూన్నారు. ఇది తెలంగాణ ఉద్యమసమయంలో కాంగ్రెసు ఎంపీ లు అరగదీసి, దీసి అవతల పడేసిన ఆకురాయి. దాంతో ప్రజలు నమ్మటం లేదని గ్రహించిన టిడిపి రకరకాలుగా కేంద్రాన్ని రెచ్చగొడదామని చూస్తోంది. ‘రాష్ట్రంలో యింత ఘోరం జరుగుతూంటే కేంద్రానికి ఏమీ పట్టదా? ఆంధ్రులు అడుక్కుతిన్నా పట్టించుకోదా? ప్రధాని శంకుస్థాపన చేసిన చోట రాజధాని కట్టకుండా మరో చోట కడితే ఎలా? మీరిచ్చిన రెండున్నర కోట్ల నిధులు వ్యర్థమౌతున్నా మీకేమీ ఖాతరు లేదా? ఈ ఘోరకలిని ఆపవలసిన బాధ్యత విస్మరించారా?’ అని నిలదీసింది.

నిమ్మకు నీరెత్తిన కేంద్రం 

అయినా కేంద్రం కిమ్మనలేదు. తాము శంకుస్థాపన చేసిన చోటల్లా నిర్మాణం జరిగి తీరుతుందని ఏ నాయకుడూ అనుకోడు. అయితే మంచిదే, కాకపోతే సరే అన్నట్లుగా ఉంటారు. ప్రభుత్వం మారినా, మంత్రి మారినా, పాత శంకుస్థాపన రాయి తీసిపారేసి కాస్త అవతల మరో శంకుస్థాపన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏదైనా ప్రాజెక్టు ఫైనల్‌గా తయారై ఆవిష్కరించేటప్పుడు ఉన్నవాడికి వచ్చిన ఖ్యాతి శంకుస్థాపన చేసినవాడికి రాదు. రాజకీయాల్లో యివన్నీ సహజం. అందువలన వాళ్లు నిర్లిప్తంగానే ఉంటారు తప్ప వూరికే సెంటిమెంటల్‌ అయిపోరు. పైగా వాళ్లిచ్చిన నిధులతో కట్టిన బిల్డింగు కూల్చేయటం లేదు. సెక్రటేరియట్‌కు కాకపోతే మరోదానికి వాడతారు. కాదు, సెక్రటేరియట్‌కే వాడాలి అని నిబంధన పెడితే, అయితే గత ప్రభుత్వం పంపిన 52 వేల కోట్ల ప్రతిపాదన సంగతి ఏమిటి? వాటికి నిధులు పంపండి అనవచ్చు రాష్ట్రప్రభుత్వం. ఎందుకొచ్చిన గొడవ అని మెదలకుండా కూర్చుంది కేంద్రం.

అమరావతి జెఎసి రైతుబృందాన్ని దిల్లీకి తీసుకెళితే పెద్ద తలకాయలేవీ తలతిప్పలేదు. కిషన్‌ రెడ్డి రాష్ట్ర బిజెపి పాటే పాడాడు. ఏ అధికారమూ లేక ఉపరాష్ట్రపతిగా మగ్గుతున్న వెంకయ్య నాయుడుగారు. ‘ఉండవయ్యా, నేనూ బోలెడు యిన్వెస్టు చేశానక్కడ, నా గోడు ఎవడితో చెప్పుకోను?’ అని వుంటారు. ఆంధ్ర నుంచి రాజ్యసభకు వెళ్లారు కాబట్టి తప్పక, నిర్మలా సీతారామన్‌ గారు ఆ మధ్య పవన్‌కు దర్శనమిచ్చినా ‘అమరావతి నిర్మాణాలకై యీసారి బజెట్‌లో లక్ష కోట్లు కేటాయిస్తాను, అవి ఖర్చు పెట్టచ్చుగా, హన్నా ఆగండి జగన్‌ను అడుగుతా’ అని ధైర్యం చెప్పినట్లూ లేదు.

రాష్ట్ర బిజెపిపై గురి

కేంద్ర బిజెపి వాళ్లతో పని కావటం లేదని గ్రహించిన టిడిపి యిక రాష్ట్ర బిజెపి వాళ్లపై పడింది. ‘‘మీకు ఒక స్పష్టమైన విధానం లేదు. మీ నాయకులు ప్రాంతాలవారీగా విడిపోయి మాట్లాడుతున్నారు.’’ అని నిందించింది. ఆ మాట వాస్తవమే కావడంతో తర్జనభర్జన పడి కొన్ని రోజుల తర్వాత బిజెపి ‘‘హైకోర్టు కర్నూలులో పెట్టాలని మా పార్టీ విధానం. అదే విధంగా అమరావతిని రియల్‌ ఎస్టేటు వెంచర్‌గా మార్చేశారని మా మానిఫెస్టోలో చెప్పినా, ఒకసారి రాజధానిగా అంగీకరించారు కాబట్టి, అక్కడే కొనసాగించాలని మా ఉద్దేశం.’’ అని ప్రకటించి ఊరుకుంది. అమరావతిలో చిన్న స్థాయిలో ఉద్యమాలతో సరిపెట్టుకుంటోంది. గుంటూరు వాస్తవ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఒకరే కాస్త అడావుడి చేస్తున్నారు. అది టిడిపికి చాలటం లేదు.

‘అలా అని ఊరుకుంటే ఎలా? మీ దిల్లీ నాయకులకు చెప్పి, యీ అన్యాయాన్ని ఆపండి. మీ నాయకుడు..,, మీరు స్తుతించే మోదీ.., మీ మోదీ… శంకుస్థాపన చోటు, గుక్కెడు నీళ్లు, గుప్పెడు మట్టి తెచ్చి యిచ్చిన చోటు నామరూపాలు లేకుండా పోతూంటే చీమ కుట్టినట్లు లేదా? ఇదేనా మీ రాజభక్తి? మీరు తెలుగువాళ్లు కారా? తెలుగు రాష్ట్రం నాశనమై పోతూ వుంటే మనసు చివుక్కుమనటం లేదా? హోదా ఎలాగూ యివ్వలేదు, కనీసం మా ప్రాంతానికి రాజధాని లేకుండా చేస్తారా? మిమ్మల్ని ఖాతరు చేయకుండా, మాటవరసకైనా ఓ మాట అడక్కుండా రాజధాని మార్చేస్తూంటే చూస్తూ ఊరుకుంటారా? రోషం లేదా? ఉక్రోషం కలగటం లేదా? మీ లెక్కేమిటి అన్నట్లు ప్రవర్తిస్తున్న జగన్‌కు గట్టిగా బుద్ధి చెప్పరా? మూడు రాజధాను లనగానే పెట్టుబడులు హూష్‌కాకీ అని ఎగిరిపోతున్నాయి. ఆంధ్ర ఎలా పోయినా మీకు ఫర్వాలేదా? ఎంతసేపూ ఉత్తర భారతమే తప్ప మీకు దక్షిణ భారతం పట్టదా? ఇలా అయితే యీ రాష్ట్రంలో మీరు ఎప్పటికైనా ఎదగగలరా?’ అని రకరకాలుగా ఊదరగొట్టేస్తున్నారు.

అయితే బిజెపి దక్షిణభారత ప్రతినిథి జివిఎల్‌ ఏపాటి శషభిషలు లేకుండా చెప్పేశారు – ‘‘మమ్మల్ని అడిగితే బాగుండేది. కానీ అప్పుడు మీరూ అఖిలపక్షం వేయలేదు. ఇప్పుడు వీళ్లూ వేయలేదు. శివరామకృష్ణన్‌ కమిటీ రిపోర్టు తుంగలోకి తొక్కి మీ నారాయణ కమిటీ రిపోర్టు అమలు చేసినప్పుడు యిదేమిటి అని అడగలేదు. ఇప్పుడు వీళ్లు మరో కమిటీ రిపోర్టు అంటూ మార్చేస్తున్నారు. రాజధాని రాష్ట్రపరిధిలో అంశం. రాజధాని గురించి పాత జీవో శిలాశాసనం కాదు. దాని కెంత విలువుందో కొత్తదానికీ అంతే ఉంటుంది. కాదంటూ మేం కలగచేసుకుంటే మీరే గగ్గోలు పెడతారు. ప్రభుత్వం తరఫున మేం అప్పుడు మూసుకున్న నోరు యిప్పుడూ తెరవం. రాష్ట్రప్రభుత్వం చేసినదానికి అప్పుడూ తల వూపాం, యిప్పుడూ వూపుతాం. ఇక పార్టీ తరఫునంటారా, మా స్టాండ్‌ మేం చెప్పేశాం.’’ అని. మీరు మా భుజంపై తుపాకీ పెట్టి కాలుద్దామంటే సరేననడానికి మేం సిద్ధంగా లేం అన్నట్లు తోచింది.

‘మీరు పెద్దన్నలు, మేం తమ్ముళ్లం’

 ఇది పద్ధతి కాదని టిడిపి యిప్పుడు సముద్రలంఘనానికి ముందు హనుమంతుల వారిని పొగిడినట్లు బిజెపిని పొగడడం మొదుపెట్టింది. ఎన్నికలకు ముందు ‘ఎవడు వాడు, ఎచటివాడు, యిటు వచ్చిన బిజెపి వాడు, వాడికి యిక్కడేం పని? మా ప్రాపకంతో నాలుగు ఓట్లు, సీట్లు తెచ్చుకుని యిప్పుడు మాకే శఠగోపం పెడతారా? అసలా పార్టీకి యిక్కడ ఉప్పూపత్రి ఉందా? ఆ జాతీయపార్టీకి ప్రాంతీయ అవసరాలు తెలుసా?’ అంటూ యీసడించిన బిజెపిని హఠాత్తుగా విశ్వరూప సందర్శనం వేళ కృష్ణుణ్ని అర్జునుడు చూసిన యాంగిల్‌లో చూడసాగారు.

‘‘మీరే ఉద్యమనాయకత్వం వహించండి. మాకు ఏ రాజకీయప్రయోజనమూ అక్కరలేదు. మీ అమిత్‌ షాను యిక్కడకు రప్పించండి. ముందువరుసలో నిలబడమనండి, మేం వెనక్కాల నడుస్తాం. మీరు పెద్దన్న పాత్ర వహించండి. మమ్మల్ని తమ్ముళ్లగా భావించండి. మేం ఎన్టీయార్‌ను అన్నగా గౌరవిస్తూ, తక్కిన వారందరమూ తమ్ముళ్లగా భావించుకుంటాం. ఎన్టీయార్‌ అన్న అయితే ఇప్పుడు పెద్దన్న అమిత్‌ షా మాకు.’’ అని వేడికోళ్లు మొదలుపెట్టారు. దాదాపు నాలుగు దశాబ్దాల ప్రాంతీయ పార్టీ, ప్రభావిత రెండు జిల్లాలో ఎంతో బలమున్న పార్టీ, గత 50 రోజులగా శ్రమకు, ఖర్చుకు వెనకాడకుండా ఉద్యమం నడుపుతున్న పార్టీ, యిలా లీడర్‌షిప్‌ను ఒక జాతీయపార్టీకి, మొన్నటిదాకా దాన్నీ, దాని నాయకత్వాన్నీ బండబూతులు తిట్టిన పార్టీకి, యిలా ఉద్యమనాయకత్వం అప్పగించడమేమిటి? రాజకీయప్రయోజనాల కంటె ఆర్థిక ప్రయోజనాలే ఎక్కువై పోయాయని దాని అర్థం కాదా!

ఈ ఉచ్చులో పడడానికి బిజెపి సిద్ధంగా లేదు. అసలే బాబు యిస్టరీ అంతంత మాత్రం. యూజ్‌ అండ్‌ త్రో వస్తువులకు బ్రాండ్‌ అంబాసిడర్‌. ఈ అమరావతి ఉద్యమం సక్సెసయితే గియితే ఆ క్రెడిట్‌ను తన మీడియా ద్వారా తన ఖాతాలోకి వేయించేసుకుంటారని తెలుసు. ఈ భాగ్యానికి తక్కిన 11 జిల్లాల్లో పార్టీ క్యాడర్‌ను అసంతృప్త పరచడం దేనికి? వాళ్ల బదులు తాము శిలువెక్కడం దేనికి? పైగా రాజధాని ఎక్కడ వస్తుందో ముందస్తుగా బాబు తన పార్టీ వాళ్లకు  చెప్పుకున్నారు తప్ప బిజెపి వాళ్లకు కాదు కదా! అప్పుడు గుర్తుకు రాలేదు కానీ యిప్పుడు గుర్తుకొచ్చామా? అని వాళ్లనుకున్నారు. అందుకే జివిఎల్‌ కాస్త కటువుగానే ‘‘మేం పెద్దన్న పాత్ర పోషిస్తే, ప్రధాన ప్రతిపక్షం దద్దమ్మ పాత్ర పోషిస్తుందా?’’ అని అనేశారు. చేస్తేగీస్తే మీరే చేయండి, ఇది మీరు చేసిన మెస్‌. చితిలో కాలే గింజల్ని మా చేత్తో తీయించాలని చూడకండి అని స్పష్టం చేశారు.

ఇక టిడిపికి ఏమీ పాలుపోవటం లేదు. బిజెపి రానంటోంది కాబట్టి ‘కుడి ఎడమైతే పొరపాటే లేదోయి’ అనుకుని సిపిఐను పిల్చుకుని వచ్చింది. ఆ రామకృష్ణగారు ఏదేదో మాట్లాడి వెళ్లారు. కమ్యూనిస్టులు కలిసి వచ్చినా రాకపోయినా ఒకటే అని పవన్‌ కళ్యాణ్‌ గారి నడిగినా చెప్తారు. గుడ్డి కన్ను మూసినా, తెరిచినా ఒకటే. ‘కో వాడిస్‌’ (ఎటు వెళ్తున్నాం?) అనే స్థితిలో ఉంది టిడిపి. ప్రశాంత్‌ కిశోర్‌ను సలహాదారుగా పెట్టుకుంటే మంచిదేమో! దిల్లీ ఎన్నికలయిపోయి ఖాళీగా ఉన్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చెప్పినది నిజమైతే చంద్రబాబు వంటి ఉత్తముణ్ని దుష్టదుర్యోధనుడిగా, కులాభిమానిగా చిత్రీకరించి, ఒంటి చేత్తో ఓడించి, ఆంధ్రులకు అన్యాయం చేశాననే పశ్చాత్తాపాగ్నిలో రగులుతూ, కుములుతూ ఉన్నాడు. బాబు అడిగితే ఉచితంగా వచ్చి సేవలందించవచ్చు! 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2020)