అక్కడ ఎన్నికల్లో వారు పెద్ద సీరియస్‌గా ప్రచారం కూడా చేయలేదు. కానీ.. గతంలో కొన్ని సార్లు.. వరుసపెట్టి అధికారం వెలగబెట్టిన రాష్ట్రమే కదా.. ఎక్కడో ఒకటో రెండో సీట్లు వస్తాయని కూడా ఆశపడవచ్చు.. కానీ ఇంకా ఫలితాలు కూడా వెలువడలేదు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే.. వారికి బోణీ ఉండదని జోస్యం చెబుతున్నాయి.. అయినా.. ఫలితాలు తర్వాత.. తమ పార్టీ అనుసరించాల్సిన విధానం ఏమిటి? ప్రభుత్వంలో చేరాలా? అక్కర్లేదా? గెలవబోయే పార్టీతో పొత్తు పెట్టుకోవాలా? అక్కర్లేదా? అనే టాపిక్ మీద.. నాయకులు మాత్రం పరస్పర విమర్శలు, ఒకరిని దెప్పిపొడిచే మరొకరి ప్రకటనలతో కొట్టేసుకుంటున్నారు. ఆ స్థాయిలో పార్టీకి ఠికానా లేకపోయినా.. ముఠా తగాదాలకు మాత్రం కొరత లేకుండా పుష్కలంగా ఉండే పార్టీ గనుకనే.. దానిని ‘కాంగ్రెస్’ అని అన్నారు.
ఇప్పుడు మీరు చదివినదంతా.. కాంగ్రెస్ పార్టీ గురించి. ఢిల్లీ ఎన్నికల బరిలో ఫలితాలు రాబోయే తర్వాతి పరిణామాల గురించి .. ఆ రాష్ట్ర పార్టీ నాయకులు తగాదా పడుతున్న తీరు గురించి..! ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢంకా బజాయించి విజయం సాధించి.. మళ్లీ ప్రభుత్వంలోకి వస్తుందనే సంగతి ఖరారైంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఏకాభిప్రాయాన్నే వెల్లడించాయి. ఢిల్లీ స్థానిక విశ్లేషకులు, ఆప్ అనుకూల భావజాలం ఉన్నవారు 60 స్థానాలు గెలిచినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ముఠాతగాదాలతో, పరస్పర విమర్శలు చేసుకుంటోంది. కాంగ్రెస్ సీనియర్ నేత పిసి చాకో మాత్రం.. ఫలితాల తర్వాత పొత్తులపై అప్పుడు ఆలోచిస్తాం అనే మాట అంటున్నారు. కానీ ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా.. చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. అలాంటి పొత్తులను ఆయన పడనిచ్చేలా లేరు. ఆప్ ను దూరం పెట్టాలనే అంటున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్‌తో పొత్తు ఉండదంటున్నారు. ఆప్ కు పొత్తు అవసరం లేదని, రాబోదని.. మేం పొత్తు పెట్టుకోం అని ముందే భీష్మించుకుంటే గనుక.. కనీసం పరువు దక్కుతుందని చోప్రా అనుకుంటున్నారేమో తెలియదు. కానీ.. గెలిచే అవకాశాలూ, ఫలితాలూ తెలియకుండానే.. ఇలా కీచులాడుకోవడం మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం అపరిమితంగా ఉండే కాంగ్రెసు పార్టీకి మాత్రమే చేతనైన విద్య!!