త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఆగిపోయింది. కరెక్ట్ గా చెప్పాలంటే వాయిదా పడింది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ ఓ సినిమా చేసి వచ్చేలాగా, ఈ లోగా త్రివిక్రమ్ వేరే సినిమా చేసి వచ్చేలా ఓ జెంటిల్ మన్ అగ్రిమెంట్ కుదిరినట్లు యూనిట్ వర్గాల బోగట్టా.
అంతకు మించి మరేం కాదని, ఆర్ఆర్ఆర్ రేంజ్ సినిమా తరువాత ఏ రేంజ్ సినిమా చేయాలో, ఎలాంటి సినిమా చేయాలో అన్నది ఊహకు అందకకపోవడం వల్లే ఈ ఏర్పాటు అని వివరిస్తున్నారు. ఇదంతా యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న సంగతి. మరో వైపు ఎన్టీఆర్ వైపు వెర్షన్ వేరుగా వుంది.
తివిక్రమ్ ఇప్పటికి మూడు లైన్లు చెప్పారని, వాటిలో రెండింటిని ఎన్టీఆర్ ఓకె అన్నారని,కానీ మళ్లీ త్రివిక్రమ్ నే వెనకుడుగు వేసి వేరే స్క్రిప్ట్ చెప్తా అన్నారన్నది ఆ వెర్షన్.అంతే కాదు, అలా చెప్పిన ఆ రెండు వెర్షన్లు రామ్ చరణ్ కు, మహేష్ కు ఇచ్చేసారని ఎన్టీఆర్ కు తెలిసి ఫీలయ్యారని బోగట్టా. దాంతో ప్రాజెక్టుకు గండి పడిందన్నది ఎన్టీఆర్ వైపు వెర్షన్ గా వుంది.
మొత్తానికి రెండు వైపుల నుంచి వస్తున్న వెర్షన్లు వేరు వేరుగా వున్నా సారం ఒకటే ప్రస్తుతానికి త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా వుండకపోవచ్చు అన్నదే. అలాగే మహేష్ తో తివిక్రమ్ సినిమా పక్కా అయింది అన్నదే. ఇక మిగిలింది ఒకటే అధికారికంగా వార్త బయటకు రావడం. దానికి మరికాస్త టైమ్ వుందని తెలుస్తోంది.