ఇలాంటివే కావాలి, రావాలి జ‌గ‌న్‌

యువ‌కుడైన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నుంచి సుప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌లు కోరుకున్నారు. అయితే ప్ర‌జాకాంక్ష‌కు అనుగుణంగా పాల‌న సాగ‌డం లేద‌నే అసంతృప్తి ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు కోరుకుంటున్న‌ట్టుగా ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఇప్పుడిప్పుడే జ‌గ‌న్ శ్రీ‌కారం…

యువ‌కుడైన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నుంచి సుప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌లు కోరుకున్నారు. అయితే ప్ర‌జాకాంక్ష‌కు అనుగుణంగా పాల‌న సాగ‌డం లేద‌నే అసంతృప్తి ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు కోరుకుంటున్న‌ట్టుగా ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ఇప్పుడిప్పుడే జ‌గ‌న్ శ్రీ‌కారం చుట్ట‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. ప్రపంచంలో మూడు విభాగాల ద్వారా ఒకే యూనిట్‌ నుంచి 5,230 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిచేసే తొలి ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం జ‌గ‌న్ మంగ‌ళ‌వారం శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్, పాణ్యం మండలాల సరిహద్దులోని పిన్నాపురంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్టుకు ఎంతో ప్ర‌త్యేక‌త వుంది. ప్రపంచంలోనే అత్యధిక విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కావ‌డం విశేషం. అంతేకాదు, ఒకే యూనిట్‌ నుంచి సోలార్, పవన, హైడల్‌ పవర్‌ను ఉత్పత్తిచేసే ప్రాజెక్టుగా ఇది ఘ‌న‌త సాధించ‌నుంది.

ఈ ప్రాజెక్టులో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి 3,000 మెగావాట్లు, విండ్‌ 550 మెగావాట్లు, హైడల్‌ పవర్‌ 1,680 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. దీంతో విద్యుత్ కొర‌త చాలా వ‌ర‌కు తీర‌నుంది. ఈ ఇంధన ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుతో జిల్లాలో నిరుద్యోగ కొర‌త కొంత వ‌ర‌కు తీర‌నుంది.  

ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 15 వేల ఉద్యోగాలొస్తాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఐదేళ్లలో పూర్తికానుంది. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్త‌యితే  ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా 5 వేల మంది ఉపాధి పొందనున్నారు.

ఇదిలా వుండ‌గా జ‌గ‌న్ ప్ర‌భుత్వం నుంచి ఇలాంటి ప్రాజెక్టుల‌ను రాష్ట్ర ప్ర‌జానీకం కోరుకుంటోంది. ముఖ్యంగా క‌ర‌వుల‌తో అల్లాడే రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు నెల‌కొల్పాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం శుభ‌ప‌రిణామం. ఇటీవ‌ల రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిశ్రమ‌ల స్థాప‌న‌కు శంకుస్థాప‌న‌లు, అలాగే ప్రారంభాలు జ‌రుగుతుండ‌డం సంతోష‌క‌రం. 

కేవ‌లం ప్ర‌జానీకం డ‌బ్బును సంక్షేమ ప‌థ‌కాల‌కు పంచ‌డానికే ప్ర‌భుత్వం ప‌రిమిత‌మైంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్న త‌రుణంలో ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుపై హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటివే కావాలి, రావాలి జ‌గ‌న్ అని ప్ర‌జ‌లు ముక్త‌కంఠంతో నిన‌దిస్తున్నారు.