ఏపీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలు కానుంది. చాలా సాధారణ ప్రక్రియగా జరగబోతున్న ఈ వ్యవహారాన్ని వీలైనంత రాద్ధాంతంగా మార్చడానికి, తద్వారా రైతుల్లో భయాందోళనలు పుట్టించడానికి తెలుగుదేశం దుర్మార్గమైన ప్రయత్నానికి ఒడిగడుతోంది.
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం వలన.. జరిగే ఉపద్రవం ఏమీ లేకపోగా.. అర్థం లేని భయాలను ప్రచారం చేస్తున్నది? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సొంత జిల్లాలోనే తమ తప్పుడు ప్రచారాలతో వారు రైతులను నమ్మించలేకపోయారు! ఇక రాష్ట్రమంతా ఎలా మభ్యపెట్టగలరు? అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.
విషయం ఏంటంటే.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు అనేది.. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసింది. కేవలం మీటర్ల ద్వారా వ్యవసాయానికి వాడే విద్యుత్తుకు లెక్క తేలిందే తప్ప.. రైతులు భయపడే పరిస్థితి ఏమాత్రమూ రాలేదు. భారీ స్థాయిలో విద్యుత్తు వినియోగంలో తేడా వచ్చింది. విద్యుత్తు మిగులు వచ్చింది. అందువలన రాష్ట్రవ్యాప్తంగా పెట్టాలని సర్కారు నిర్ణయించింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన చోట ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. మీటర్ల వలన తమకు కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదని రైతులు నమ్మారు.
శ్రీకాకుళం అంటే అచ్చెన్నాయుడు సొంత జిల్లా. ఆ పార్టీ చెబుతున్న మాటలు, చేస్తున్న ప్రచారం నిజమే అయితే.. కనీసం పార్టీ అధ్యక్షుడి సొంత జిల్లాలో అయినా.. కొంతమంది అయినా నిజాయితీగా దానిని నమ్మిఉండాలి కదా! అలా ఎంతమాత్రమూ జరగలేదు. మీటర్ల వలన విద్యుత్తు లెక్క తేలుతుందే తప్ప.. అది రైతుకు ప్రమాదకర నిర్ణయం కాదనే అందరూ భావిస్తున్నారు. నిశ్చింతగా ఉన్నారు.
రైతులు అలా నిశ్చింతగా ఉండడాన్ని చూసి తెలుగుదేశం ఓర్చుకోలేకపోతోంది. వారిలో భయాన్ని పుట్టించకపోతే తమ పార్టీకి మనుగడ ఉండదనేది వారి భయం.
ప్రభుత్వం మాత్రం మీటర్లు బిగించడం వెనుక ఉన్న లక్ష్యాలను చాలా విపులంగా రైతులకు వివరిస్తోంది. కేంద్రప్రభుత్వపు నిర్దేశకాల మేరకే వాటిని బిగిస్తున్నట్లు చెబుతోంది. దానివల్ల విద్యుత్తు మిగులు కావడం మినహా వేరే నష్టాలు ఉండవని అంటోంది. అయితే టీడీపీ మాత్రం.. ఉచిత విద్యుత్తు పథకాన్ని రద్దు చేయడానికి ఇది మొదటి అడుగుగా అభివర్ణిస్తోంది.
‘రైతులకు ఉచిత విద్యుత్తు’ అనే తన తండ్రి వైఎస్సార్ స్వప్నాన్ని.. జగన్ ఎందుకు తొలగించాలనుకుంటారు.. అనే లాజిక్ కూడా లేకుండా.. టీడీపీ చేస్తున్న విషప్రచారం నవ్వులపాలవుతోంది.