బోల్డ్ సినిమా తీస్తున్నారా.. అయితే ఇది మీకే!

బోల్డ్.. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పదం కామన్ అయిపోయింది. తమ సినిమా బోల్డ్ గా ఉంటుందని చెప్పుకోవడం ఇండస్ట్రీలో ఫ్యాషన్ అయిపోయింది. లిప్ కిస్సులు, అడల్ట్ కంటెంట్ ఇరికించడమే బోల్డ్…

బోల్డ్.. టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పదం కామన్ అయిపోయింది. తమ సినిమా బోల్డ్ గా ఉంటుందని చెప్పుకోవడం ఇండస్ట్రీలో ఫ్యాషన్ అయిపోయింది. లిప్ కిస్సులు, అడల్ట్ కంటెంట్ ఇరికించడమే బోల్డ్ అని ఫీల్ అయిపోతున్నారు చాలామంది. అదే విషయాన్ని గొప్పగా కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఇలాంటి సినిమాలు తీసేవాళ్లంతా ఓ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదే శాటిలైట్ బిజినెస్.

సినిమా వ్యాపారంలో అత్యంత కీలకంగా మారిన శాటిలైట్ బిజినెస్ విషయంలో మాత్రం ఈ బోల్డ్ అనే పదం పనిచేయదు. కంటెంట్ లో బోల్డ్ ఉంటే ఛానెల్స్ అన్నీ వెనక్కి తగ్గుతున్నాయి. ఓటీటీ విషయంలో వెంటనే డీల్స్ ఓకే అయిపోవచ్చు కానీ, ఆ మేరకు శాటిలైట్ మార్కెట్ ను మాత్రం వీళ్లంతా కోల్పోవడం ఖాయం.

డిగ్రీకాలేజ్, ఏడు చేపల కథ, వైఫ్ ఐ, చీకటి గదిలో చితక్కొక్కుడు, రాయలసీమ లవ్ స్టోరీ, రొమాంటిక్ క్రిమినల్.. ఇలా చెప్పుకుంటూ పోతే శాటిలైట్ కు నోచుకోని బోల్డ్ సినిమాలు కోకొల్లలు. చివరికి కల్ట్ అని పేరుతెచ్చుకున్న అర్జున్ రెడ్డి సినిమా కూడా శాటిలైట్ లాక్ చేసుకోవడానికి అపసోపాలు పడాల్సి వచ్చింది. అంతెందుకు, ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అయి, సెన్సార్ కత్తెర్ల మధ్య నలిగిపోతున్న పలాస సినిమా కూడా శాటిలైట్ కు నోచుకోలేదు.

కాస్త కంటెంట్, ఇంకాస్త స్టార్ వాల్యూ ఉంటే శాటిలైట్ డీల్స్ తోనే సగం బడ్జెట్ వెనక్కు లాగేయొచ్చు. ప్రస్తుతం ఈ మార్కెట్  ఆ రేంజ్ లో వెలిగిపోతోంది. బన్నీ, మహేష్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాలు మొట్టమొదటగా కళ్లజూసేది శాటిలైట్ లాభాల్నే. అలాంటి కీలకమైన మార్కెట్ ను ఇలా బోల్డ్ అని చెప్పుకునే సినిమాలు కోల్పోవడం ఖాయం.

అదృష్టవశాత్తూ బుల్లితెరపై ఇంకా విశృంఖలత్వం రాలేదు. టీవీల్లో వేసే ప్రతి సినిమాకు ప్రత్యేకంగా సెన్సార్ ఫార్మాలిటీస్ ఉంటున్నాయి. ఇలాంటి నిబంధనల వల్ల బోల్డ్ సినిమాలకు శాటిలైట్ డీల్స్ కుదరడం లేదు. మార్కెట్ కోల్పోతున్నామని తెలిసినప్పటికీ కొంతమంది మేకర్స్ తగ్గడం లేదు.. ఇనిస్టెంట్ గా వచ్చే డబ్బుల కోసం, బి-సి సెంటర్లలో ఈజీగా మార్కెట్ అవుతుందనే సౌకర్యంతో ఇలాంటి “బోల్డ్” సినిమాలు తీసేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారు.

14 రోజుల్లోనే ఉరి శిక్ష‌