ధిక్కారమున్ సైతుమే…!

నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు..మా ఇచ్ఛయే గాక మాకేటి వెరపు Advertisement ఈ వాక్యం అక్షరాలా సరిపోతుంది సదరు మీడియాకు. నిజానికి సదరు మీడియా అనే కన్నా సదరు కులపిచ్చకు అంటే సరిపోతుందేమో? ఎందుకంటే…

నవ్వి పోదురుగాక మాకేటి సిగ్గు..మా ఇచ్ఛయే గాక మాకేటి వెరపు

ఈ వాక్యం అక్షరాలా సరిపోతుంది సదరు మీడియాకు. నిజానికి సదరు మీడియా అనే కన్నా సదరు కులపిచ్చకు అంటే సరిపోతుందేమో? ఎందుకంటే తమ కుల ప్రయోజనాలే పరమావధిగా ప్రయాణం సాగిస్తున్న సంస్థలు కదా? అందుకే ఆ కులానికి తగినట్లే, అడుగడుగునా ఫ్యూడల్ మనస్తత్వం తొంగిచూస్తుంటుంది.

మా మాటే నెగ్గాలి…మా అభిమతమే మీ మతం కావాలి. మేము ఎటు మొగ్గితే జనం కూడా అటే మొగ్గాలి. మేము తగ్గమంటే తగ్గాలి. లేదూ, కాదూ అన్నారా? ఇక చూస్తోండి నా రాజా…మా అక్షర తూణీరాలు సంధిస్తాం. ఎలా అంటే అలా రాస్తాం. మీరు అడుగు వేసినా తప్పే, తీసినా తప్పే అన్నట్లు సృష్టిస్తాం. ఒక విషయాన్ని ఎన్ని కోణాల్లో నెగిటివ్ గా విశ్లేషించాలో అంతకు అంతా చేస్తాం. మా సర్వస్వాన్ని ఒడ్డుతాం.

ఇదే తీరు..ఇప్పుడు ఆంధ్రలో తెల్లవారితే చాలు కొన్ని పత్రికల్లో వార్తలై కనిపిస్తోంది.  అందులో మరింక వెనకా ముందూ లేదు, జనాన్ని ఎలా నమ్మబలకాలి. ఎన్ని అసత్యాలు వండి వార్చి, సత్యాల్లా మార్చాలి అన్నదే కనిపిస్తోంది.

ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచీ

తమ పార్టీ, తాము ఏళ్ల తరబడి కష్టపడి నిలబెట్టిన తమ కులసంస్థ అధికారం కోల్పోయి, వేరే పార్టీ అధికారంలోకి రాగానే ప్రారంభమైంది వ్యవహారం. కుర్రకుంక జగన్ ఏం చేస్తాడులే అనుకున్నారు. కానీ వస్తూనే అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం ప్రారంభించాడు.  ఒకేసారి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించాడు. గ్రామీణులు చిన్నా చితకా విషయాలకు మండల కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా చేసాడు. పింఛన్లు, రేషన్లు గుమ్మం ముందుకు వచ్చేలా చేసాడు.

ఇవన్నీ చూసి, సరే ఎన్నాళ్లు చేస్తాడు, డబ్బులు అయిపోతే, దొరికిపోతాడు, మనం ఎలాగూ మాగ్జిమమ్ ఖజానా ఖాళీ చేసి వచ్చాం కదా అనుకున్నారు. కానీ జగన్ అక్కడితో ఊరుకోలేదు. అన్ని విధాలా అనువైన విశాఖను రాజధాని చేస్తే, ప్రగతి మరింత స్పీడ్ అవుతుంది, అన్ని ప్రాంతాలకు ప్రభుత్వాన్ని విస్తరిస్తే, అందరికీ ఆనందం, ఆమోదం అవుతుంది అని అనుకున్నాడు.

అదిగో అక్కడ వచ్చింది సమస్య.

అమరావతి ని ఫిక్స్ చేసిందే తమ కులానికి తరతరాలుగా వున్న అనుబంధంతో. అసలు అమరావతి అనే పేరును, ప్లేస్ ను ఫిక్స్ చేసిందే తాము కదా? తెలుగువారి రాజధాని అమరావతి అన్నది పైకి, కమ్మ ప్రభువుల రాజధాని అమరావతి కదా అన్న సంబరం లోపల. పైగా అమరావతి రాజధాని అనే ఏరియాలో ఎన్ని కులాలైనా వుండొచ్చు, ఎందరైనా వుండొచ్చు. కానీ ఆధిపత్యం ఎవరిది?  వ్యాపారాలు ఎవరివి? మనవేగా? అలాంటి అమరావతిని తోసిరాజని విశాఖను రాజధాని చేస్తే, తమ మనోభావాలు దెబ్బతినవా?

ఎక్కడన్నా ప్రభుత్వం భూములు తీసుకుంటే బాధపడతారు. కానీ అమరావతిలో ఆనందపడ్డారు. ఎంత ఆనందం అంటే అమెరికా నుంచి వచ్చి మరీ ఎకరానో, రెండు ఎకరాలో కొనేసి, అర్జెంట్ గా పూలింగ్ కు ఇచ్చేసేంత ఆనందం. ఇలా చేసిన వారు ఎందరో.

ఎందుకలా?  ఇందులో వున్న మతలబు ఏమిటి? ప్రభుత్వం ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మాదిరిగా ఎకరా తీసుకుని, అందులో ముప్పావు ఎకరా కమర్షియల్ గా వాడేసి, పావు ఎకరాను తిరిగి ఇస్తుంది. ఇచ్చిన ఎకరా రేటు కన్నా, వచ్చే పావు ఎకరా రేటు ఎక్కువ వుంటుందన్న లెక్కలు.

ఇది ఒకవైపు

మరో వైపు, అమరావతికి చుట్టూ అన్నీ మనవాళ్లు కొన్న భూములేగా? మరి వాటి మాటేమిటి? వాటి ధరలు ధడాల్న పడిపోతే, మనవాళ్లకు ఎంత నష్టం. మన వ్యాపారాలకు ఎంత నష్టం. విజయవాడ నుంచి మంత్రులు, ఉద్యోగులు తరలిపోతే, 'మనవాళ్ల'కు, మన వ్యాపారాలకు ఎంత నష్టం.

ఇన్ని ఆలోచనలు , ఇన్ని ఆందోళనలు, ఇంత సెంటిమెంట్. వెరసి ఇప్పుడు జరుగుతున్న ఆందోళన. వండివారుస్తున్న అసత్య కథనాలు. ఎలాగైనా జగన్ ను కిందకు లాగేయకపోతే, తమ భవిష్యత్ ఏమయిపోతుందో అన్న భయం. ఈ జగన్ అనే మొండివాడు రాజకున్నా బలవంతుడు ఆయిపోతాడేమో అన్న అనుమానం.

స్టెప్ బై స్టెప్

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చూడండి. సదరు మీడియా వార్తలు అన్నీ డేట్ ల వారీ పేర్చి చూస్తే, భలే చిత్రంగా అనిపిస్తుంది.

కరెంట్ కొరత, ఇసుక, ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి రాజధాని మీదుగా కియా వరకు ఎన్ని హడావుడులు, అలజడులు. కానీ ఏ అసంబద్దపు హడావుడి ఆయుష్షు కూడా పట్టుమని పది రోజులు వుండదు. ఒకదాని తరువాత ఒకటి. అయిపోయిన దాన్ని చాలా కన్వీనియెంట్ గా మరిచిపోయే వైనం. ఇలాగే గడపుకుంటూ వస్తున్నారు.

విస్మరిస్తున్న అసలు విషయం

అంతా బాగానే వుంది. తమ పార్టీని నిలబెట్టడానికి తమ మీడియాను, మాయమైపోయిన తమ లాభాలను మళ్లీ రాబట్టుకోవడానికి తమ ప్రయోజనాలను పణంగా పెట్టిన వారు బాగానే వున్నారు. వారి కృషి బాగానే చేస్తున్నారు. కానీ ఇక్కడే కనిపించని ప్రమాదం కనిపిస్తోంది. ప్రతిపక్షంగా తాము చేయాల్సిన పనిని తమ అను'కుల' మీడియా చేస్తేస్తుండడంతో, పార్టీ జనాల్లో బద్దకం పెరిగిపోతోంది.

అయిదేళ్ల తరువాత కావచ్చు లేదా రాబోయే రకరకాల ఎన్నికల్లో విజ యం కోసం కావచ్చు తెలుగు దేశం పార్టీ చేయాల్సింది చేయడం లేదు. తెల్లవారితే తెలుగుదేశం పార్టీ కోసం సదరు మీడియా చేస్తున్న కృషిలో, పడుతున్న తాపత్రయంలో ఒక్క శాతం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు.

కాంగ్రెస్ బాటలో

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర తప్పిదం ఒకటి వుంది. యువతరాన్ని అంతగా ఎంకరేజ్ చేయకుండా పంచెలు కట్టిన వారే కలకాల అధికారంలో వుండాలనుకున్నారు. భవిష్యత్ తరం అనేది పార్టీలో ఎదగకుండా చేసుకున్నారు. ఇప్పుడు వెళ్లాల్సిన వాళ్లంతా వైకాపాలోకో, తేదేపాలోకో సర్దుకు పోయిన తరువాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ని ముందుకు తీసుకెళ్లడానికి మనుషులు లేకుండా పోయారు.

ఇప్పుడు ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి కూడా పట్టేలా కనిపిస్తోంది. ఎన్టీఆర్ టైమ్ లో రంగప్రవేశం చేసిన వాళ్లే డెభై శాతం మంది ఇప్పటికీ హవా చలాయిస్తున్నారు. అదే యనమల, అదే అయ్యన్న అన్నట్లుంది వ్యవహారం. వీళ్లందరికీ బాబుపై భరోసా. ఆయనకు ఆయన అను'కుల' మీడియా మీద నమ్మకం. కావాల్సిన కార్యక్రమం అంతా ఆ మీడియా చేస్తుంది, చూసుకుంటుందనే భరోసా.

కానీ దీనివల్ల క్షేత్ర స్థాయిలో రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటి అధికారం అందిన ఆనందంతో వైకాపా శ్రేణులు హుషారుగా వున్నాయి. అధికారం పోయింది, నాయకులే సైలంట్ గా వున్నారు. దాంతో పార్టీ ఎక్కడ వేసిన గొండళి అక్కడే అన్నట్లుగా వుంది. జారిపోయే వాళ్లు జారిపోతున్నారు. వయసు అయిపోతున్న నాయకులు మిగులుతున్నారు.

కొడుకు మాత్రమే

చంద్రబాబు దృష్టిలో కొడుకు లోకేష్ మాత్రమే యూత్ ఐకాన్. మరింక మిగిలిన పార్టీ కావచ్చు. చుట్టూ వున్నవారు, వుండేవారు కావచ్చు అంతా తనతో ఏనాటి నుంచో ట్రావెల్ అవుతున్నవారే. లోకేష్ కూడా కళా వెంకటరావు, యనమల ఇలాంటి వారిని చుట్టూ వుంచుకునే రాజకీయం చేస్తున్నారు.ఎక్కడ యువతను చుట్టూ వుంచుకుంటే, వారి చురుకుదనం ముందు తాను చులకనైపోతానో అన్న భయం ఏ మూలో లోకేష్ కు వున్నట్లు కనిపిస్తోంది.

ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి కూడా వృద్ధాప్య చిహ్నాలు అలుముకుంటున్నాయి. ఈ మీడియా కూడా ఎన్నాళ్లు అండగా వుంటుంది. తెలంగాణలో తమ అవసరం కోసం ఇదే మీడియా ఏనాడో బాబును పక్కన పడేసి కేసిఆర్ పక్కకు చేరిపోయింది. దాంతో అక్కడ పార్టీ కుదేలైపోయి, మూలాలు కూడా లేకుండా పోయింది. అప్పుడే అర్థం అయిపోయింది. మాంత్రికుడి ప్రాణం చిలకలో వున్నట్లుగా తెలుగుదేశం బలం ఈ మీడియాలోనే వుందీ అని.

ఇప్పుడు ఆంధ్రలో కూడా ఈ మీడియా ఎంత వరకు పోరాడుతుందో చూడాలి. ఆంధ్రలో కూడా సదరు మీడియాకు అలుపు వచ్చినా, విధానాలు మార్చుకున్నా తెలుగుదేశం పార్టీ దుకాణం బంద్ చేసుకోవాల్సినంత అగత్యం ఏర్పడుతుంది. అయితే అలా అని ఆ మీడియా బాబును ఎందుకు వదుల్తుంది అన్న అనుమానం రావచ్చు. బాబును వదలడం అంటే జగన్ పక్కన చేరడం కాదు. ఇప్పటికే తెలుగుదేశం 2 గా భాజపాను చేయడానికి కొంత మంది కమ్మ సామాజిక వర్గ నేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ మీడియా కూడా అటు వెళ్తే…బాబు ఒంటరైపోతారు. పార్టీ అనాధైపోతుంది.

చాణక్య
[email protected]