మోడీ సర్కారుకు బుద్ధి వస్తుందా?

రెండోసారికూడా చాలా స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత.. ఇన్నాళ్లూ ముసుగు కప్పి ఉన్న తమ విభిన్న ఎజెండా అంశాలను తెరమీదకు తెస్తూ.. మోడీ సర్కారు దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.  ప్రత్యేకించి……

రెండోసారికూడా చాలా స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత.. ఇన్నాళ్లూ ముసుగు కప్పి ఉన్న తమ విభిన్న ఎజెండా అంశాలను తెరమీదకు తెస్తూ.. మోడీ సర్కారు దూకుడు ప్రదర్శిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.  ప్రత్యేకించి… ఇప్పుడు వివాదాస్పద నిర్ణయాలుగా ఉన్న సీఏఏ, ఎన్ఆర్సీ వంటి వాటిపై దేశవ్యాప్తంగా ఎంతగా నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. వారు ఏమాత్రం పట్టించుకోకుండా.. దూసుకుపోతున్నారు. అయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు, భాజపాకు కళ్లు తెరిపిస్తాయా? వారి దూకుడుకు బ్రేకులు వేస్తాయా? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో జరుగుతోంది.

ఢిల్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన దాదాపు అన్ని సంస్థలూ ఏకపక్షంగా ఆప్‌కే విజయాన్ని కట్టబెడుతున్నాయి. తిరుగులేని మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతూ హ్యాట్రిక్ కొడతారనే మాట బాగా వినిపిస్తోంది. అధికారం మీద కన్నేసిన భారతీయజనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఓడిపోతే.. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న నూతనవిధానాలను ప్రజలు తిరస్కరించినట్లుగా భావించాల్సి ఉంటుందా..? అలాంటి ప్రజల తీర్పు.. మోడీ సర్కారులో కాస్త పాజిటివ్ బుద్ధిని కలిగిస్తుందా? అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.

దేశరక్షణ విషయంలో మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలకు, అరవింద్ కేజ్రీవాల్ గత అయిదేళ్లుగా అందించిన పాలనకు పోటీగా ఈ ఎన్నికలను అందరూ అభివర్ణించారు. తమ విధానాలపై ఈ ఎన్నికలు ప్రజా తీర్పు అని చాటుకోవడానికి భాజపా కూడా చాలా ముచ్చటపడింది. అరవింద్ కేజ్రీవాల్ ను ఉగ్రవాదిగా అభివర్ణించింది. ఎంత చేసినా ఫలితాలు కేజ్రీవాల్ కే అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. మరిప్పుడు తమ ఓటమిని.. దేశాన్ని అస్థిరతకు గురిచేస్తున్న మోడీ సర్కారు నూతన విధానాల పట్ల ప్రజల తిరస్కారంగా వారు గుర్తిస్తారా లేదా?  కనీసం ఆపాటి గుర్తించగల వివేచన వారికి ఉంటే వివాదాస్పదంగా ఉన్న ఈ విధానాలను కాస్త సరిదిద్దుకుంటారని ఆశించవచ్చు.

14 రోజుల్లోనే ఉరి శిక్ష‌