బిసి.. మైనారిటీ ఓట్లు తెచ్చే పొత్తు కావాలి

తెలుగుదేశం.. జనసేన.. భాజపాల నడుమ ఏం జరుగుతోంది. ఓట్లు చీలనివ్వను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్న జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఎందుకు చాలా సైలంట్ గా తన మానాన తాను అభ్యర్ధులను డిసైడ్ చేసుకుంటూ ముందుకు…

తెలుగుదేశం.. జనసేన.. భాజపాల నడుమ ఏం జరుగుతోంది. ఓట్లు చీలనివ్వను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్న జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఎందుకు చాలా సైలంట్ గా తన మానాన తాను అభ్యర్ధులను డిసైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

ఇదే విధంగా తెలుగుదేశం కూడా తమకు జనసేన పొత్తు అవసరం లేదు అనే సిగ్నల్స్ ఇస్తూ ఎందుకు ముందుకు వెళ్తోంది

ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ కు భాజపా వైపు నుంచి క్లారిటీ వచ్చిందా?

మొత్తానికి ఏదో జరిగింది. వ్యూహం మారుతోంది. ఆ వ్యూహం.. ఎలా ఏమిటి అన్న క్లారిటీ మాత్రం రావాల్సి వుంది.

ప్రస్తుతానికి అయితే తెలుగుదేశం మద్దతు దారుల్లో జనసేన అధిపతి మీద మోజు తగ్గింది అన్నది వాస్తవం. ఎందుకంటే ఎలాగైనా ఈసారి అధికారం సాధించి తీరాల్సిందే.. ఏం చేసి అయినా, ఎలాగైనా అని పట్టుదలగా వున్న ఓ సామజిక వర్గ జనాలు ఇప్పుడు పవన్ ఊసు ఎత్తితే ఏమంత పాజిటివ్‌గా మాట్లాడడం లేదు. బ్రో సినిమా టైమ్ లో కూడా ఈ వర్గం ఏ రూపంగానూ మద్దతు ఇవ్వలేదు. పైగా ఆ వర్గాన్ని పలకరిస్తే చాలు పవన్ ను లైట్ తీసుకోవడమే అంటున్నారు.

ఎవరో ఒకరిద్దరి మాటలు పట్టుకుని ఒపీనియన్ డిసైడ్ అయిపోవడమేనా అనే ప్రశ్న ఎవరైనా వేయచ్చు. మరే వర్గం అయినా ఈ ప్రశ్న సబబు. కానీ పర్టిక్యులర్ వర్గం, ఆ వర్గానికి చెందిన మీడియా అంతా ఒకటే భావజాలంతో వుంటారు. ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచో ఆదేశాలు అందినట్లు, సమాచారం వచ్చినట్లు ఒకే విధంగా మాట్లాడుతుంటారు. ఒకరికి తెలియకుండా ఒకరితో, పదిమంది, పాతిక మందితో మాట్లాడినా ఒకటే భావజాలం వినిపిస్తుంది. అప్పుడు మీకు ఫిక్స్ అవుతుంది. కనిపించని వైఫై వీళ్లను కలుపుతూంది అని.

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాంచి ఊపు మీద వుంది. జనాలు ఫుల్ గా జగన్ కు నెగిటివ్ అయిపోయారని ఫిక్స్ అయిపోయింది. అధికారం ముంగిట్లోకి వచ్చినట్లే అని భావిస్తోంది. ఇలాంటి టైమ్ లో జనసేన-భాజపాలతో పొత్తు ప్లస్ లు మైనస్ లు లెక్కలు వేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.

జనసేనతో పొత్తు వుంటే.

హీనంలో హీనం.. 40 సీట్లు అన్నా ఇవ్వాల్సి వుంటుంది. అంటే నలబై స్థానాల్లో తమ పార్టీ అసమ్మతిని తామే ఎదుర్కోవాల్సి వుంటుంది. అక్కడ ఓట్ల బదలాయింపు జరగకపోతే, వైకాపాకు కనీసం ఓ ఇరవై సీట్లు ఫ్రీగా ఇచ్చేసినట్లు అవుతుంది.

పోనీ జనసేన నలభై సీట్లు గెలుచుకు వచ్చింది అనుకుంటే, మంత్రి పదవులు కీలకమైనవి ఇవ్వాల్సి వుంటుంది. పవన్ తో ఏ క్షణం ఎలా వుంటుందో తెలియదు.

ఇవన్నీ చిన్న సమస్యలు. అసలు సిసలు సమస్య బిసి ఓటు బ్యాంక్. కాపు పార్టీ గా ముద్రపడిపోయిన, ముద్ర వేసేసిన జనసేన తో పొత్తు పెట్టుకుంటే బిసి ఓటు బ్యాంక్ దూరం అవతుందేమో అన్న భయం. సీట్లు ఎక్కువ బిసి లకు ఇస్తారు అంత వరకు చేయగలరు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమికి కారణమైన బిసి ఓటు బ్యాంక్ ను దగ్గర చేయడం సాధ్యమవుతుందా? ఇప్పుడు బిసి లు ఎక్కువగా వైకాపా వైపు వున్నారు. వాళ్లను ఇటు మళ్లించాల్సి వుంది. కానీ జగన్ కాపు ఓట్ బ్యాంక్ ను వదలుకుని మరీ బిసి లను దగ్గరకు తీస్తున్నారు. ఇలాంటి టైమ్ లో పవన్ ను దగ్గరకు తీసుకుంటే బిసి ఓట్ బ్యాంక్ కు నమ్మకం సడలిపోతుందేమో అన్న అనుమానం తెలుగుదేశం పార్టీని పీడిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక భాజపాతో పొత్తు. భాజపా అవసరం తెలుగుదేశం పార్టీకి కేవలం పోల్ మేనేజ్ మెంట్ వరకు మాత్రమే. అక్కడ వచ్చే ఓట్లు ఏమీ లేవు. పైగా పోయేవే ఎక్కువ. అఫీషియల్ గా పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓటు బ్యాంక్ పూర్తిగా దూరం అవుతుంది. అసలే మైనారిటీ ఓటు బ్యాంక్ ఇప్పుడు భాజపా మీద అలకబూని వుంది. అదే ఓటు బ్యాంక్ ఇప్పుడు జగన్ కు బలంగా వుంది. ఈ బలాన్ని తగ్గించాలంటే భాజపాతో అధికార పొత్తు పనికిరాదు.

అంటే జనసేనతో.. భాజపాతో పొత్తు వుండాలి. కానీ అది కనిపించకూడదు. భావసారూప్యం ఒకటే..యాంటీ వైకాపా. అదే తీరు మీద వెళ్లాలి. కానీ ఒకటే సమస్య.. అది జనం ఏ మేరకు నమ్ముతారు అన్నదే.

అందుకే ప్రస్తుతానికి ఎవరి వర్క్ వాళ్లు చేసుకునే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. జనసేన తన వారాహి యాత్రలు తాను కొనసాగిస్తుంది. తేదేపా యువగళం దాని మానాన అది సాగుతుంది. పురంధేశ్వరి విమర్శలు మామూలే. ఈ విధంగా వైకాపా మీద యాంటీ ఓట్ ను వీలయినంత పెంచాలి. ఎన్నికల దగ్గరకు వెళ్లాక వ్యూహం డిసైడ్ చేసుకోవాలి.

ఇదీ తేదేపా ఎత్తుగడ. కానీ తేదేపా సంగతి తెలిసిన వాళ్లు ఎవరైనా ఒకటే అంటారు. ముగ్గురూ కలిసి యాంటీ ఓటును పెంచాక, ఎన్నికల ముందు బై.. బై అంటే రెండు పార్టీలు అందులోనూ ముఖ్యంగా జనసేన పరిస్థితి ఏమిటి? అన్నదే ఆ ప్రశ్న.

ఈ చిక్కుముడి మామూలుది కాదు. విప్పడం అంత సులువు కాదు. అదే జగన్ ధీమా కావచ్చు.