ఈమధ్య యూబ్యూబ్ ఛానెళ్లకు తెగ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సీనియర్ దర్శకుడు బి.గోపాల్. అన్నింటిలో ఆయన కామన్ గా చెప్పే పాయింట్ మాత్రం ఒకటుంది. అదే బాలయ్యతో సినిమా. తన ఫేవరెట్ హీరో బాలకృష్ణతో సినిమా తీసి రిటైర్ అవుతానని ప్రకటించుకున్నారు బి.గోపాల్.
బాలకృష్ణ, బి.గోపాల్ ది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరి కాంబోలో లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. పల్నాటి బ్రహ్మనాయుడు తర్వాత బాలయ్యతో మళ్లీ సినిమా తీయలేదు బి.గోపాల్. అలా దాదాపు 20 ఏళ్ల గ్యాప్ వచ్చేసింది.
ఈమధ్య ఓ సినిమా ఫంక్షన్ లో బాలకృష్ణతో కలిసి కనిపించారు బి.గోపాల్. అప్పట్నుంచి ఈ కాంబినేషన్ పై మళ్లీ చర్చ మొదలైంది. ఆ తర్వాత పలు సందర్భాల్లో బి.గోపాల్ కూడా బాలకృష్ణతో సినిమా చేస్తానని ప్రకటించారు. ఈరోజు కూడా తిరుమలలో ఆయన ఇదే ప్రకటన చేశారు.
“బాలయ్య కోసం ఓ సబ్జెక్ట్ చేస్తున్నాం. కథ ఫైనలైజ్ అయిన తర్వాత ఆయన డేట్స్ బట్టి సినిమా ఉంటుంది. అయితే దీనికి ఇంకా టైమ్ పడుతుంది. ఎందుకంటే మా కథ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇటు బాలయ్య కూడా బిజీగా ఉన్నారు. కథ పూర్తయి, దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినంత వరకు చెప్పలేం.”
ఇలా బాలయ్యతో సినిమా చేస్తానని చెబుతూనే, ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు పరోక్షంగా వెల్లడించారు బి.గోపాల్. బాలయ్య సినిమాతో కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్న ఈ సీనియర్ దర్శకుడికి బాలకృష్ణ చివరి అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ మూవీ తర్వాత బాబి దర్శకత్వంలో సినిమా చేస్తారు. లిస్ట్ లో పూరి జగన్నాధ్ పేరు కూడా వినిపిస్తోంది. ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తున్న బాలకృష్ణ, బి.గోపాల్ కు ఎప్పుడు అవకాశం ఇస్తారో!