అప్పటికి అతడొక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. 2014 ఎన్నికల్లో మాత్రమే తొలిసారి నెగ్గాడు. 2019లో తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేసి ఓడిపోయాడు. ఆ ఐదేళ్లలో ఆయన అక్రమాల గురించి రకరకాల నంబర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు అమరావతి స్కామ్ లో అయితే కళ్లు బైర్లు కమ్మే వ్యవహారాలు బయటపడుతున్నాయట. అక్కడ ఈయన గారు కొనుగోలు చేసిన భూముల విలువ అక్షరాలా 400 కోట్ల రూపాయలు అని సీఐడీ గుర్తించినట్టుగా సమాచారం. ఈ మేరకు ఈడీకి సమాచారం అందించిందట అమరావతి భూముల కొనుగోలు స్కామ్ పై విచారణ జరుపుతున్న సీఐడీ.
వెలగపూడి సచివాలయానికి కూతవేటు దూరంలో 11 ఎకరాలు, ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో మరో 56 ఎకరాల భూమి. ఇవీ వరదాపురం సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ కొనుగోళ్లు అని సీఐడీ నిర్ధారించుకుందట. ఎక్కడో అమరావతికి ఏ మాత్రం సంబంధం లేదని అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఈ వరదాపురం సూరి. టీడీపీ అధికార కాలంలో కాంట్రాక్టులతో వందల కోట్ల రూపాయలను వెనకేశారు అనే వార్తలు వచ్చేవి. ఎన్నికల్లో ధర్మవరం నుంచి తిరిగి పోటీ చేసి ఓటమి పాలయ్యారీయన.
ఇక ఫలితాలు వచ్చిన కొన్ని రోజుల్లోనే భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయారు. అక్రమాల నుంచి రక్షణ పొందడానికే ఈయన బీజేపీలోకి చేరినట్టుగా అనేక మంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అమరావతిలో వరదాపురం భూముల స్కామ్ భారీ ఎత్తున బయటపడిందని తెలుస్తోంది. అమరావతి ని అధికారికంగా రాజధానిగా ప్రకటించక మునుపే చౌక ధరలకు వరదాపురం సూరి భారీ అక్కడ భూములు కొనుగోలు చేశారని, ఈయన కొన్న మొత్తం భూముల విలువ ఇప్పుడు మార్కెట్ వ్యాల్యూ ప్రకారం 400 కోట్ల రూపాయలు అని సీఐడీ తేల్చినట్టుగా తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ ఈడీ దృష్టికి తీసుకెళ్లిందట సీఐడీ. ఎక్కడో ధర్మవరానికి చెందిన వన్ టైమ్ ఎమ్మెల్యేనే అమరావతిలో 400 కోట్ల రూపాయల స్థాయి ఆస్తులు పోగేశాడంటే.. మిగతా వాళ్ల లీలలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహలకు అందడం కూడా కష్టమేమో!