ఎంత సేపూ తన గురించే తప్ప, జనం గురించి మాట్లాడటం పవన్‌కల్యాణ్‌కు అలవాటు లేదు. గతంలో అట్లా చేసి ఉంటే , నేను ఇట్లా చేసి ఉండేవాడిని, నన్ను అది అంటున్నారు, ఇది చేస్తున్నారని అనడమే తప్ప, ‘మీ బాధలేంటి’ అని అడిగి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుందామన్న ధ్యాస పవన్‌కల్యాణ్‌లో ఏ మాత్రం కనిపించడం లేదు.
ఏదో రాజకీయాల్లో ‘నేను ఉన్నా’నని చెప్పుకునేందుకు, ఉనికి చాటుకునేందుకు అన్నట్టు నెలకోసారి ఒక్కో జిల్లా నేతలతో పవన్‌కల్యాణ్ సమావేశాలు నిర్వహిస్తున్నారనిపిస్తోంది. హైదరాబాద్‌లో శుక్రవారం కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల జనసేన నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలని మాట్లాడిన తన దిష్టిబొమ్మను దగ్ధం చేసేటంత కోపం కర్నూల్ నాయకులకు ఎందుకని ప్రశ్నించాడు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి కర్నూల్‌కు వెళ్లిన పవన్..రాజధాని అమరావతే అయినప్పటికీ తన మనసులో కర్నూలే రాజధాని అని చెప్పిన విషయాన్ని మరిచినట్టున్నాడు. తన దిష్టిబొమ్మ దగ్ధం చేసినందుకు పవన్ బాధపడుతున్నారే తప్ప….కొన్ని దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నరాయలసీమ గుండె మంట గురించి ఆయన్ను కదిలించకపోవడం ఆశ్చర్యమేస్తోంది.
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చాలా మంది మైనార్టీలు నమ్మక ద్రోహం చేశారని విమర్శిస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరి సీఏఏ, ఎన్ఆర్సీలపై తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్న ముస్లింల ఆవేదనను అర్థం చేసుకోకపోగా, వాటి వల్ల ఎలాంటి ముప్పు ఉండదని తమరు సెలవిస్తే…ద్రోహం చేశారనక, మంచి చేశారని సన్మానం చేస్తారా మేస్టారూ?
కర్నూల్లో హైకోర్టు పెట్టడానికి తాను వ్యతిరేకం కాదంటూనే, మూడు రాజధానుల ఏర్పాటు మభ్యపెట్టడానికే అనడంలో మీ ఆంతర్యం సీమవాసులను మభ్య పెట్టడానికి కాదా? సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే అని ఎందుకు గట్టిగా చెప్పలేకున్నారు? ఇక విశాఖలో పరిపాలన రాజధాని పెడితే పవన్‌కొచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన ఆలోచనల్లో, ఆచరణలో ఎందుకింత అస్పష్టత, గందరగోళం?
జనసేన కార్యకర్తలు, నాయకులతో సమావేశమైనప్పుడు కాస్తా తమరి సమస్యలను చెప్పడం మానేసి, వారి బాధలను ఆలకించండి సార్. మున్ముందు పవన్ వైఖరిలో మార్పు రాకపోతే, తమరి సోది వినడానికి జంకి జనసేన కార్యకర్తలు, నాయకులు రావడమే మానేస్తారని గుర్తిస్తే మంచింది.