కోడలిని నాగ్ ఆదుకుంటాడా?

నాగార్జున ఇప్పుడు అక్కినేని ఇంటి పెద్ద. ఆయనకు ఆ బాధ్యతలే ఇప్పుడు ఎక్కువ వున్నాయి. ఆ మధ్య అంతా మేనల్లుడు సుశాంత్ సినిమా చిలసౌ, మేనగోడలు సినిమా గూఢచారి ప్రమోషన్లు చూడాల్సి వచ్చింది. చిలసౌ…

నాగార్జున ఇప్పుడు అక్కినేని ఇంటి పెద్ద. ఆయనకు ఆ బాధ్యతలే ఇప్పుడు ఎక్కువ వున్నాయి. ఆ మధ్య అంతా మేనల్లుడు సుశాంత్ సినిమా చిలసౌ, మేనగోడలు సినిమా గూఢచారి ప్రమోషన్లు చూడాల్సి వచ్చింది. చిలసౌ సినిమా అయితే కొనాల్సి కూడా వచ్చింది. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది మరీ స్వంత, దగ్గర వ్యవహారం. కోడలు సమంత వ్యవహారం. అందువల్ల తప్పనే తప్పకపోవచ్చు.

విషయం ఏమిటంటే, సమంత నటించిన యుటర్న్ అనే థ్రిల్లర్ సెప్టెంబర్ లో విడుదలకు రెడీ అవుతోంది. కానీ ఈ సినిమా ఇంకా బిజినెస్ కాలేదని వినికిడి. ఈ సినిమాను ఆంధ్ర ఏరియాకు అయిదు కోట్ల రేషియోలో చెబుతున్నారు. కానీ సినిమా చూస్తే చిన్న సినిమాగా, ఓ పర్టిక్యులర్ జోనర్ సినిమాగా కనిపిస్తోంది. కానీ ఖర్చు చూస్తే పదికోట్లు దాటేసిందట.

సమంత రెమ్యూనిరేషన్ నే కోటి పాతికలక్షలు. అలాగే ఆది, డైరక్టర్, టెక్నీషియన్స్ అందరి రెమ్యూనిరేషన్లు కలిసి అయిదుకోట్లు దాటేసాయట. దాంతో సినిమా నిర్మాణానికి పబ్లిసిటీతో కలిపి పదికోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు మార్కెట్ సమస్య ఎదురు అవుతోంది.

ఆంధ్ర ఏరియాను అయిదుకోట్లు రేషియోలో కోట్ చేస్తున్నారు. కానీ కొనడానికి ఎవరూ ముందుకు రావడంలేదని తెలుస్తోంది. ఎందుకంటే కేవలం సమంతను చూసి మాత్రమే కొనాలి. పైగా ఇది ఓ పర్టిక్యులర్ జోనర్ సినిమా. అందుకే కిందామీదా అవుతున్నారు. ఇలాంటి టైమ్ లో నాగ్ ఎంటర్ అయి, వైజాగ్, కృష్ణాజిల్లాలకు ఏమయినా కొంటారా? లేక సినిమాలో తాను కూడా ఏమయినా పార్టనర్ గా చేరతారా? మేనల్లుడి కోసం చేసినట్లే, కోడలి కోసం కూడా రంగంలోకి దిగుతారేమో?