రకుల్ ప్రీత్.. అంత ఖాళీ అయిపోయిందా!

ఒక టీవీ చానళ్లో ప్రముఖ కమేడియన్ నిర్వహించే టాక్ షోకు వచ్చే సెలబ్రిటీలంతా ఔట్ డేటెడ్ అయిన వాళ్లే. సినిమా ఇండస్ట్రీలోని పాతవాళ్లు, పెద్దగా అవకాశాలు లేనివాళ్లు, అంతగా ఫేమ్ లేనివాళ్లు, పాత విషయాలను…

ఒక టీవీ చానళ్లో ప్రముఖ కమేడియన్ నిర్వహించే టాక్ షోకు వచ్చే సెలబ్రిటీలంతా ఔట్ డేటెడ్ అయిన వాళ్లే. సినిమా ఇండస్ట్రీలోని పాతవాళ్లు, పెద్దగా అవకాశాలు లేనివాళ్లు, అంతగా ఫేమ్ లేనివాళ్లు, పాత విషయాలను చెప్పేందుకు ఇష్టం చూపే ఏజ్డ్ యాక్టర్లు ఆ కమేడియన్ షోకు గెస్టులుగా వస్తూ ఉంటారు. లీడింగ్ యాక్టర్లు, నేటితరం హీరోలు, హీరోయిన్లు ఆ షో వైపు వచ్చింది లేదు ఇంతవరకూ. అలా పాతవాళ్లు, తెరమరుగు అయిన వాళ్లు, ఖాళీగా కూర్చున్న వాళ్లను కూర్చోబెట్టి ఆ షోను నడుపుతున్నారు. ఇక ఆ షో ఏమైనా ఆసక్తిదాయకంగా ఉంటుందా? అంటే అంత సీన్ లేదు.

ఏవో కుళ్లు జోకులు.. కాట్రవల్లి, కాట్రే.. అనే మాటలు తప్ప అంతకు మించి సదరు హోస్టు మరేం చేయలేకపోతున్నాడు. మాటల్లో స్పాంటేనివిటీ ఉండదు, సెలబ్రిటీలతో కొత్త విషయాలను చెప్పించేంత సీనూ ఉండదు. దీంతో.. అది అలా అలా నడుస్తోంది. అందుకేనేమో యంగ్ యాక్టర్లు, లీడ్‌లో ఉన్న వారెవరూ ఇందులో కనిపించరు.

అలాంటి షోకు వచ్చింది నటీమణి రకుల్ ప్రీత్ సింగ్. గత వారంలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. ఆ షోలో రకుల్ ను చూడగానే.. ఈ టాక్ షో రేంజ్ పెరిగిందా? లేక రకుల్ అంతా ఖాళీగా ఉందా? అనే సందేహం వస్తే తప్పు ప్రేక్షకుడిది కాదు. సీరియల్స్ చేసుకునే వాళ్లే వచ్చే టాక్ షోకు రకుల్ హాజరు అయ్యింది. ‘స్పైడర్’ తర్వాత రకుల్‌ను టాలీవుడ్ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఎన్టీఆర్ బయోపిక్‌లో అంటున్నారు కానీ.. అది గెస్టు రోలే అయ్యుండవచ్చు. ఇక రకుల్ కు తమిళ తంబీలు మాత్రం లైట్ గా అవకాశాలు ఇస్తున్నారు. సూర్య సినిమాలో చేస్తోంది. ఇక హిందీలో ఏవో ద్వితీయ శ్రేణి సినిమాలు చేస్తోంది. దీంతో అల్లాటప్పా టాక్ షోలకు హాజరయ్యేంత వరకూ వచ్చేసింది రకుల్.

టాప్ లీగ్‌లో ఉండిన ఈ పంజాబీ భామ ఒక్కసారిగా ఇంత ఖాళీ అయిపోవడం విశేషమే. ఈ హీరోయిన్ మళ్లీ అలలా లేస్తుందా?