చంద్రబాబు కారణజన్ముడు. ఉమ్మడి ఏపీకి దాదాపు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. విభజన ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు. నయా హైదరాబాఅద్ ని ఆయనే నిర్మించారు. ఇక నవ్యాంధ్రలో రాజధాని పేరిట ఇంద్రుని అమరావతినే నేలకు దింపాలనుకున్నారు. దేశంలో ఎందరో ప్రధానులను, ముఖ్యమంత్రులను తయారు చేసి జాతికి అందించారు.
మైక్ ఇస్తే చాలు, ఇలా సాగిపోతుంది తమ్ముళ్ళ స్తోత్ర పాఠం. అవును బాబు ఇవన్నీ ఎటువంటి ఫలాపేక్షా, స్వార్ధం లేకుండానే చేశారు. ఆయనకు పదవులు లెక్కలేదు, అవసరం అంతకంటే లేదూ ఇలా కూడా గుక్కతిప్పుకోకుండా చెబుతారు పసుపు పార్టీ కార్యకర్తలు.
నిజానికి బాబు డెబ్బయ్యేళ్ళ వయసులో రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా. లేదంటే లేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయపాత్రుడు అంటున్నారు. బాబు ఈ ముదిమి వయసులో కష్టపడుతున్నారూ అంటే అది కేవలం ప్రజల కోసం.
ఆయన తలచుకుంటే ఇంట్లో కూర్చోలేరా. ఆయన చేయని పదవులా ఇవీ అంటున్నారు జూనియర్ అయ్యన్నపాత్రుడు. ముమ్మారు సీఎంగా బాబు పనిచేశారు. మరో ముమ్మారు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన పనిచేసారు. ఇంతటి ఘనమైన చరిత్ర ఎవరికైనా ఉంటుందా. ఇది నెవ్వర్ బీఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ అంటున్నాడీ పసుపు పసి తమ్ముడు.
బాబుకు పదవుల మీద మోజు లేదు, ఆయనకు రాజకీయం బొత్తిగా అవసరం లేదు అని కూడా చెప్పేస్తున్నాడు. నిజమేనా..ఇదే లెక్కలో బాబును స్తుతి చేసే విధానం మరింత ఎక్కువైతే నిజంగా బాబు గారే కంగారు పడిపోరూ.
బాబు ఇప్పటికీ చెబుతున్నారుగా. తాను మరో ఇరవయ్యేళ్ళ పాటు ఆరోగ్యంగా జీవిస్తానని. తాను మళ్ళీ సీఎం అవుతానని, అమరావతిని చెప్పిన ప్రకారం ప్రపంచ రాజధానిని చేస్తానని, రద్దు చేసిన శాసనమండలిని పునరుధ్ధరిస్తానని కూడా చెబుతున్నారుగా.
మరి బాబుకు పదవుల మీద ఆశలు లేవని అపుడే తేల్చేస్తే తెలుగుదేశం వల్లభుడు తల్లడిల్లడా. పొగడ్తలకైనా కూడా ఓ హద్దు ఉండాలిగా అంటూ ఎకసెక్కం ఆడుతున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి టీడీపీలో తానే సీనియర్ అని గట్టిగా జబ్బలు చరచుకునే అయ్యన్నకు సరైన వారసుడే జూనియర్ కూడా అంటూ ఓ లెవెల్లో సెటైర్లు పడుతున్నాయి.