హైదరాబాద్ లో ఇద్దరికి కరోనా వైరస్ సోకిందట. ఈ విషయాన్ని వైద్యులు కావాలనే దాచిపెడుతున్నారట.. నిన్నట్నుంచి వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకు హైదరాబాద్ లో ఎవ్వరికీ కరోనా సోకలేదని మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వలేదని ప్రకటించిన మంత్రి.. ఈ విషయంలో మీడియాతో పాటు ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు.
“చైనా నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రతి ఒక్కర్ని చెక్ చేస్తున్నాం. ఇద్దరికి వైరస్ సోకిందని వచ్చిన వార్తలో నిజం లేదు. వాళ్లకు పరీక్షలు చేసి ఇంటికి పంపించాం. ముందుజాగ్రత్త కోసం మరోసారి వైద్యులు వాళ్లను పరీక్షించారు. అంతేతప్ప వాళ్లకు కరోనా రాలేదు. నమూనాల్ని కూడా పూణెకు పంపించడం లేదు. కేంద్రం పరీక్ష కిట్స్ ఇచ్చింది, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోనే కరోనా పరీక్షలు చేస్తున్నాం.”
రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తి పెద్దగా ఉండదని అభిప్రాయపడ్డారు ఈటెల. అటు కోటి మందికి పైగా వచ్చే మేడారం జాతరపై కూడా కరోనా ప్రభావం పెద్దగా ఉండదన్నారు. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండడంతో తప్పులేదన్న ఈటెల.. పుకార్లు నమ్మొద్దని కోరారు.
ఇప్పటివరకు గాంధీ హాస్పిటల్ లో 28 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీళ్లందరికీ నెగెటివ్ వచ్చింది. అంటే కరోనా వైరస్ లేదని అర్థం. ఈరోజు కొత్తగా మరో నలుగురు కరోనా అనుమానంతో హాస్పిటల్ లో చేరారు. వీళ్ల నుంచి కూడా శాంపిల్స్ తీసుకున్నారు.
మరోవైపు చైనా నుంచి ప్రతి రోజూ హైదరాబాద్ కు ప్రజలు వస్తూనే ఉన్నారు. కరోనా భయంతో చాలామంది తెలుగువారు చైనా నుంచి వచ్చేస్తున్నారు. వాళ్లందరికీ ఎయిర్ పోర్టుల్లోనే ప్రాధమిక పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. మరికొన్ని రోజుల పాటు చైనాకు వెళ్లకుండా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.