మాజీ మంత్రి నారా లోకేష్ కి భద్రత తగ్గించారు, ఇదో అంతర్జాతీయ సమస్యగా పచ్చ మీడియా, టీడీపీ నేతలు తెగ ఫీలైపోతున్నారు. లోకేష్ కూడా తనకు భద్రత తగ్గించారని అలిగారట. ఇప్పటి వరకూ భారీ భద్రతతో లోకేష్ ఏమీ సాహస కార్యాలు చేయలేదు. మహా అయితే మండలికి పోయేవారు, ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో సమావేశాలు, సమీక్షలకి హాజరయ్యేవారు. అక్కడ ఉండేది అందరూ టీడీపీ కార్యకర్తలే కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు.
ఇక రాజకీయ విమర్శలు చేస్తే వైరి పక్షాలు దాడి చేస్తారని భయపడటానికి లోకేష్ ఇలాంటి ప్రేలాపనలన్నిటికీ ట్విట్టర్ వేదికగా చేసుకుంటారాయె. నేరుగా ఎవర్నీ ఏమీ అనలేని ఉత్తర కుమారుడు లోకేష్.. ట్విట్టర్ లో రెచ్చిపోతుంటారు. సో.. ట్రోలింగ్ బాధే ఉంటుంది కానీ నేరుగా ఎలాంటి భౌతిక దాడి లోకేష్ పై జరిగే అవకాశమే లేదు. పోనీ భద్రతా సిబ్బంది ఇలాంటి సోషల్ మీడియా ట్రోలింగ్ ని అడ్డుకుంటారా అంటే అదీ లేదు. అది వారి భద్రతా విధుల్లో లేదు, అయినా దానికి వేరే బ్యాచ్ ఉండనే ఉంది.
ఇక లోకేష్ కి అంత భారీ భద్రత ఎందుకు అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. దానికి లోకేషే సమాధానం చెబుతున్నారు. లోకేష్ తరచూ పెళ్లిళ్లు, రిసెప్షన్లు, మరణానికి సంబంధించిన కార్యాలకి వెళ్తుంటారు. ఎంచక్కా ఫొటోలు దిగి ట్విట్టర్లో పెట్టుకుంటుంటారు. భద్రత తగ్గిస్తే ఇలాంటి కార్యాలకి బైటకు వెళ్లడం ఇబ్బంది అవుతుందని లోకేష్ తెగ ఫీలవుతున్నారట.
పెళ్లిల్లు, ఫంక్షన్లకి వెళ్లేటప్పుడు మందీ మార్బలం ఉండి, పక్కన గన్ మెన్లు ఉంటే ఆ రేంజే వేరు. ఇప్పటివరకూ లోకేష్ కి భద్రతా సిబ్బంది కేవలం ఈ షో కోసం మాత్రమే పనికొచ్చారు. ఇకపై ఆ హడావిడి ఉండదనేది లోకేష్ బాధ. సెక్యూరిటీ తగ్గిస్తే ఎవరైనా తమకు హాని కలుగుతుందేమోనని ఆందోళనపడతారు. కానీ లోకేష్ మాత్రం తన రేంజ్ తగ్గిపోతుందని బాధపడుతున్నారు. అందుకే ఆయన ప్రభుత్వంపై అలిగారు.