ఇంత వరకూ ప్రధాని మోడీని, ఆయన పాలనను పొగడుతూ వచ్చిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనలో ఇంకో కోణం కూడా ఉందని నిరూపించాడు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో గురువారం చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించి ‘ఔరా’ అనిపించాడు.
‘ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోంది. మా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోంది’ అని విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డాడు. అంతేకాదు విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇచ్చిన ప్రధాన హామీలేవీ అమలు చేయడం లేదని ఆరోపించాడు. ప్రత్యేక హోదా ఇస్తామని నాడు హామీ ఇచ్చి, నేడు చేతులెత్తేస్తోందని , ఇది ఎంత వరకు సమంజసమని విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తూ సాగుతున్న విజయసాయి ప్రసంగాన్ని వింటున్న బీజేపీ, టీడీపీ, ఇతర పక్షాల నేతలు సైతం ఆశ్చర్యపోయారు. రెండురోజుల క్రితం బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ నెత్తిన ఎత్తుకంటే, చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాంటి హెచ్చరికలను ఖాతరు చేయకుండా విజయసాయి యథేచ్ఛగా కేంద్రం చేస్తున్న అన్యాయంపై నిలదీశాడు.
ప్రత్యేక హోదా అన్యాయం చేసిన కేంద్రాన్ని ఆయన పదేపదే దోషిగా నిలబెట్టేందుకు యత్నించాడు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ప్రస్తావనే చేయలేదని, 15వ ఆర్థిక సంఘం కూడా తన నివేదికలో ప్రత్యేకహోదా అంశం కేంద్ర పరిధికి సంబంధించిందని స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. అలాగే ప్రత్యేక హోదా, పోలవరం, రెవెన్యూ లోటు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల గురించి ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని విజయసాయిరెడ్డి అన్నాడు. మొత్తానికి రాజ్యసభ వేదికగా కేంద్రాన్ని వైసీపీ నిలదీయడం శుభపరిణామం.