చంద్రబాబునాయుడు అంటేనే ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ మరి. ఆయనకు అంత అనుభవం ఉంది. ఆయన ముందు ఎవరైనా పిల్ల కుంకల్లాగానే కనిపిస్తారు. బాబు ఏం చేసినా రైటో రైటు. కానీ అవతల వారు ఏదైనా చేయబోతే మాత్రం రాంగో రాంగు అంటూ రాగింగూ చేస్తారు, వీరంగమూ వేస్తారు.
ఇదిలా ఉంటే తనకు విశాఖ అంటే ఎంతో ఇష్టమని ఒకటికి పదిసార్లు చెప్పుకునే బాబు అదే నోటితో విషం కూడా కావాల్సినంత కక్కుతున్నారు. విశాఖలో ఏముంది హుదూద్ తుఫానులు తప్ప అనడమూ బాబు అండ్ కో కే చెల్లింది.
విశాఖ మూలన ఉంది. ఎవరూ పట్టించుకోరు, ఆ వైపుగా చూడరు అంటూ ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేసిందీ తెలుగు తమ్ముళ్ళే. ఇపుడు బాబు గారు మరో ముందు అడుగేసి విశాఖ రాజధాని అంటే బుద్దున్నోడు ఎవడైనా ఆ వైపుగా వస్తారా అన్నారట.
మరి ఈ మాట పట్టుకుని బాబుని గట్టిగానే తగులుకున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. బాబు మీరు ఈ మాటలు అనడమేంటి, విశాఖకు బుద్ది ఉన్న వాళ్ళు వస్తారా అని మీలాంటి ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అనడం సబబా అంటూనే మీరే కదా సామీ సదస్సులు సెమినార్లూ అంటూ విశాఖ చుట్టూ గత అయిదేళ్ళలో తిరిగిందీ అని అవంతి బాగానే దెప్పిపొడిచారు.
ఆనాడు బాబు బుద్ది ఏమైపోయిందని కూడా మంత్రి అవంతి నిలదీస్తున్నారు. విశాఖ వాడుకోవడానికి అన్నింటికీ కావాలి, రాజధాని అంటే మాత్రం వద్దు.. ఏంటి బాబు మీ డబుల్ స్టాండర్డ్ మాటలూ అంటూ అవంతి గట్టిగానే వేసుకున్నారు.
అయినా సిటీ ఆఫ్ డెస్టినీ అని విశాఖను అంతా అంటారు. మరి బుద్ది ఉన్న వారే కదా విశాఖకు వస్తూంటారు, వెళ్తూంటారు. అలాంటి విశాఖపైన బాబు వంటి పెద్ద మనిషి ఇలా అన్నారా అంటూ నగరవాసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న్నారు. మొత్తానికి విశాఖ మీద బాబుకు రోజురోజుకూ కోపం అలా పెరిగిపోతోంది.. ఎందువల్లనో.