‘పులివెందుల పంచాయితీ’ అంటారు, ‘ఫ్యాక్షన్ రాజకీయాలు’ అంటారు.. విపక్షాలకు ఇంకే అంశాలూ లేనట్లు, ప్రతి విషయూనికీ ఈ ‘పులివెందుల పంచాయితీ – ఫ్యాక్షన్ రాజకీయం’ అనే ట్యాగ్‌లైన్ తగిలించేయడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య చాలా ఎక్కువగా ఈ ‘ఫ్యాక్షన్’ అనే విమర్శ మీద ఎఫెక్షన్ పెంచేసుకున్నట్లే కన్పిస్తోంది.
అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కియా పరిశ్రమ, ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్ళిపోనుందంటూ ‘రాయిటర్స్’లో ఓ కథనం వచ్చిన మాట వాస్తవం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. కియా పరిశ్రమ తరఫున కూడా ఖండన ప్రకటనను చూస్తున్నాం. సరే, విపక్షాలన్నాక.. విమర్శలు సర్వసాధారణం. కానీ, ఆ విమర్శలకీ ఓ హద్దూ అదుపూ అనేవి వుండాలి కదా.! దురదృష్టవశాత్తూ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో విమర్శలకు హద్దులెప్పుడో చెరిగిపోయాయనుకోండి.. అది వేరే విషయం.
అయితే, సున్నితమైన అంశాల విషయంలో కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తే.. అది రాష్ట్రానికి మేలు చేయదు సరికదా, కీడు చేస్తుంది. కియా లాంటి సంస్థల విషయంలో విపక్షాల యాగీ, రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మేలు చేయదు. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం వరకూ విపక్షాల వాదనని తప్పుపట్టలేం. కానీ, రాష్ట్రానికి వున్న ఆ కాస్త ఇమేజ్‌నీ డ్యామేజ్ చేసేస్తే.. ఇక అంతే సంగతులు. ఆ మాత్రం విజ్ఞత మాత్రం విపక్షాల్లో కన్పించడంలేదు.
టీడీపీ సంగతి అందరికీ తెల్సిందే. ఆ పార్టీ నుంచి ‘విజ్ఞత’ని ఎవరూ ఆశించరు. జనసేన పార్టీకి ఏమయ్యింది.? ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా ఎదగాలనుకున్నప్పుడు ఆ మాత్రం సంయమనం లేకపోతే ఎలా.? ఇలాంటప్పుడే, ప్రభుత్వానికి విలువైన సూచనలు చేయగలగాలి. అప్పుడే ఓ బాధ్యతాయుత విపక్షంగా జనసేన తన ఉనికిని కాపాడుకునే అవకాశముంటుంది. అది మానేసి, టీడీపీ బాటలోనే.. ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలితే ఏం లాభం.?
పైగా, ‘ఫ్యాక్షన్’ అనే మాట ఊతపదంగా మారిపోయింది జనసేన పార్టీకి. విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనగానే.. ‘పులివెందుల పంచాయితీ – ఫ్యాక్షన్ రాజకీయం’ అనేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ‘కియా’ విషయంలోనూ అదే తొందర. ఇలాగైతే, 2019 ఎన్నికల్లో వచ్చిన ఆ కాసిని ఓట్లు కూడా ఇకపై జనసేనకు వచ్చే అవకాశం లేదు.