ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతూ ఉంది. గత 24 గంటలుగా ఈ సోదాలు కొనసాగుతూ ఉండటం గమనార్హం. హైదరాబాద్ లోని చంపాపేట్, విజయవాడలోని గాయత్రీ నగర్ కంచుకోట అపార్ట్ మెంట్ లలో ఏకకాలంలో సోదాలు కొనసాగుతూ ఉన్నాయని తెలుస్తోంది.
అధికారులు నిన్న రాత్రంతా మేలుకొని డాక్యుమెంట్లను పరిశీలించినట్టుగా సమాచారం. అయినా అదంతా ఇంకా ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. చంద్రబాబు వద్ద సుదీర్ఘ కాలం పని చేశారట ఆయన. ఇప్పటి వరకూ బయటపడిన ఆస్తుల విలువ దాదాపు 150 కోట్ల రూపాయలని సమాచారం. అందుకు సంబంధించి కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది.
కాంట్రాక్టు పనుల కేటాయింపులో ఈయన కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది. అలా భారీగా ముడుపులు అందిపుచ్చుకున్నారని సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ టీమ్ సీఆర్పీఎఫ్ బృందాలను వెంట తెచ్చుకుంది. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంటి మీదే ఇలాంటి ఐటీ రైడ్స్ జరగడంతో.. తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతూ ఉందని సమాచారం.