అందుకే సక్సెస్ మీట్స్ కు వెళ్లను – సమంత

సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రచారానికైనా తను సిద్ధమంటోంది సమంత. అయితే రిలీజ్ తర్వాత పిలిస్తే మాత్రం వెళ్లనని కరాఖండిగా చెబుతోంది. దీనికి సమంత దగ్గర ఓ బలమైన రీజన్ కూడా ఉంది. రిలీజ్ తర్వాత…

సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రచారానికైనా తను సిద్ధమంటోంది సమంత. అయితే రిలీజ్ తర్వాత పిలిస్తే మాత్రం వెళ్లనని కరాఖండిగా చెబుతోంది. దీనికి సమంత దగ్గర ఓ బలమైన రీజన్ కూడా ఉంది. రిలీజ్ తర్వాత సదరు సినిమాతో ఎటాచ్ మెంట్ పెట్టుకోనంటోంది ఈ హీరోయిన్.

“ప్రమోషన్ అనేది కలెక్షన్లపై ఎంత ప్రభావం చూపిస్తుందో నాకు తెలియదు. కానీ నేను ప్రమోషన్ కు వెళ్లడం వల్ల 10 టిక్కెట్లు వస్తాయంటే మాత్రం కచ్చితంగా వెళ్తాను. నన్ను నమ్మి నా నిర్మాత ఇంత రెమ్యూనరేషన్ ఇస్తున్నప్పుడు నేను ప్రమోట్ చేయాలి కదా. కాబట్టి సినిమా రిలీజ్ కు ముందు ఏ తరహా ప్రచారానికైనా నేను రెడీ. కానీ ఒక్కసారి సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఇక ఆ సినిమాతో ఎటాచ్ మెంట్ పెట్టుకోను. అప్పటికే చాలా కష్టపడి ఉంటాను. మెంటల్లీ బాగా ఒత్తిడి ఫీల్ అవుతాను. సో.. రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ రిలీజ్ తర్వాత ఇక ఆ సినిమాతో సంబంధం పెట్టుకోను. అందుకే సక్సెస్ మీట్స్ కు పిలిచినా వెళ్లను.”

ఇన్నేళ్ల కెరీర్ లో తను బాగా కష్టపడిన సందర్భాన్ని, కష్టపడి చేసిన పాత్ర వివరాల్ని మీడియాతో షేర్ చేసుకుంది సమంత. త్వరలోనే రాబోతున్న ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2లో తను నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తానని.. ఆ పాత్ర కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

“ఫ్యామిలీ మేన్ సీజన్-2 వెబ్ సిరీస్ చేశాను. అందులో కొత్త సమంతను చూస్తారు. ఫుల్ యాక్షన్ ఉంటుంది. దాని కోసం బాగా ట్రైనింగ్ తీసుకున్నాను. హీరోలు ఎంత కష్టపడుతున్నారో, ఎంత కష్టపడి ఫైట్స్ చేస్తున్నారో.. ఫ్యామిలీ మేన్ లో నటించిన తర్వాత నాకు తెలిసింది. యాక్షన్ చేయడం చాలా కష్టం. నేను ఒక్క షాట్ లో కూడా డూప్ వాడలేదు. అంతా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్. క్రావ్ మాగా అనే ఫారిన్ ఫైట్ మాస్టర్ నాకు ఫైట్స్ నేర్పించారు. ఇంతకుముందు ఎప్పుడూ ఫైట్స్ చేయలేదు, పైగా నెగెటివ్ క్యారెక్టర్ కూడా చేయలేదు. అందుకే ఫ్యామిలీ మేన్ సీజన్-2 కోసం బాగా కష్టపడాల్సి వచ్చింది.”

జాను మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడిన సమంత.. కథల ఎంపికలో అందరూ అనుకునేంత టాలెంట్ తనకు లేదంటోంది. రంగస్థలం లాంటి సినిమాలు కథ వినకుండానే ఒప్పుకున్నానని, అదృష్టం బాగుండి అవి హిట్టయ్యాయని చెబుతోంది.