ఎమ్బీయస్‌: ‘సో కాల్డ్‌..’కు స్పందన

''సోకాల్డ్‌ హేతువాదులు'' వ్యాసానికి వ్యాఖ్యల ద్వారా, వ్యక్తిగత మెయిల్స్‌ ద్వారా వచ్చిన స్పందన పై నా సమాధానాలు :- Advertisement * మొదటగా గోగినేని బాబు, సీత గురించి ఆమాట అనలేదు అని చాలామంది…

''సోకాల్డ్‌ హేతువాదులు'' వ్యాసానికి వ్యాఖ్యల ద్వారా, వ్యక్తిగత మెయిల్స్‌ ద్వారా వచ్చిన స్పందన పై నా సమాధానాలు :-

* మొదటగా గోగినేని బాబు, సీత గురించి ఆమాట అనలేదు అని చాలామంది అంటున్నారు. ఆయనపై కేసులు వేసినాయన అన్నాడని ఆరోపించాడు. దానికి బాబు నుంచి ఖండన రాలేదు. ఆయన ''బిగ్‌బాస్‌''లో ఉన్నాడనుకున్నా ఆయన సభ్యుడిగా ఉన్న అనేక స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఆఫీస్‌ బేరర్స్‌ ఎవరూ ఖండించలేదు. ఆయన కుటుంబసభ్యులూ డిటో. ఏమీ అనకుండా పోలీసులు కేసెందుకు పెడతారు? అందువలన అది నిజమే ననుకున్నాను.

బాబు బయటకు వచ్చేశారు. తనను డిఫెండ్‌ చేసుకోగల సమర్థుడే. నిజమేదో నిర్ధారించాక నామాట వెనక్కి తీసుకుంటాను. అప్పటివరకు '..సబ్జక్ట్‌ టు కరక్షన్‌'గా అనుకోండి. అంతర్జాతీయ సంస్థల్లో ఆయన సభ్యత్వం, పోప్‌తో ఆయన సంభాషణ, ఐఏఎస్‌లకు ఆయన పాఠాలు – అన్నీ ప్రగల్భాలని ఆయనపై కేసు పెట్టినాయన చెపుతున్నాడు. వాటిపై బాబు వివరణ వచ్చినపుడు విషయాలు తేటతెల్లమౌతాయి.  

* అన్ని దేశాల్లోను మతం దాష్టీకానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. వ్యవస్థీకృతమైన మతం వాళ్లని అణచి వేయడానికి చూసింది. 

* కొత్త ఆలోచన ప్రతిపాదించినప్పుడల్లా సమాజంలోని మౌఢ్యం వారిపై ద్వేషాన్ని ప్రకటించింది. సోక్రటీసు వంటి వారిని విషం తాగమని ఆదేశించింది. మన దేశంలో కూడా మత గురువుల మధ్య స్పర్ధ, ద్వేషం ఉండి ఒకరి నొకరు చంపుకోవాలని చూశారు. రామానుజాచార్యుల వారిని ఆయన గురువుగారే చంపుదామనుకున్నాడు. శైవులు, వైష్ణవుల మధ్య హింసాకాండ జరిగింది. 

* క్రైస్తవం అనేక దేశాలకు విస్తరించినప్పుడు స్థానికంగా ఉన్న మతాలను అణచివేయడానికి ఆ యా మతాలలోని దేవుళ్లను గురించి హీనంగా మాట్లాడింది. అదే క్రమంలో మన దేశంలో హిందూ దేవుళ్లను తీసిపారేస్తూ ప్రబోధాలు చేశారు. ఆర్‌ కె నారాయణ్‌ నవల ''స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌''లో క్రైస్తవ ఉపాధ్యాయుడి మాటలు గమనించవచ్చు. అయితే పలు దేశాల్లో స్థానిక మతాలను కబళించిన తర్వాత క్రైస్తవం వాటి ఆచారాలను తమ మతంలో భాగంగా కొనసాగించింది. అందుకే భారతీయ క్రైస్తవుల్లో హిందువుల వారసత్వంగా వచ్చిన ఆచారాలను గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ ఆచారాల్లో భిన్నత్వానికి కారణం అదే. స్థానిక మతాలను జయించడానికే క్రైస్తవం ఆ దేవుళ్లను నిరసించింది కానీ అక్కడ క్రైస్తవం పాదుకున్నాక అప్పటి మత చిహ్నాలను, గుళ్లను, విగ్రహాలను పడగొట్టే ప్రయత్నం చేయలేదు. 

* బుద్ధుడు ఆత్మ, పునర్జన్మ లేదని చెప్పిన మాట నిజం. ఆయన మరణం తర్వాత శాఖలుగా విడిపోయింది. ఒక శాఖవారు బుద్ధుడికి హిందూమతం తరహాలో పూర్వజన్మలు కల్పించి 'జాతక కథలు' రాశారు.

* ఆధునిక యుగంలో ఇతర దేశాల్లో కూడా హేతువాదం బలంగా ఉంది. దైవభావనను ప్రశ్నించారు, ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు దేవుడిపై నమ్మకం ఉందని ప్రకటించుకుంటున్నాయి కానీ సాధారణ పౌరుల్లో దేవుడిపై శ్రద్ధ అక్కడ బాగా దెబ్బ తింది. చర్చికి వెళ్లేవారు తగ్గిపోతున్నారు. 

* అక్కడ దేవుడు లేడని వాదించేవాళ్లు పురాణాల జోలికి వెళ్లటం లేదు. మోడర్న్‌ ఫిలాసఫర్స్‌ ఐన హెగెల్‌, రస్సెల్‌, సార్త్రే వంటి వాళ్లు బైబిల్‌ గురించి, వాటిలో పాత్రలను నిందిస్తూ మాట్లాడలేదు, మానసిక తత్త్వవేత్త ఫ్రాయిడ్‌ ఐతే గ్రీకు పురాణ పాత్రలను తన సిద్ధాంతాలను విశదీకరించడానికి వాడుకున్నాడు. ఇవన్నీ జనజీవితంలో భాగాలుగా గుర్తించారు. 

* నా ఉద్దేశంలో సమాజంలో హేతువాదం, శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్‌ టెంపర్‌మెంట్‌ పెరగాలి. ఆ భావాలను ఓపిగ్గా సిద్ధాంతాల ద్వారా వ్యాప్తి చేయాలి తప్ప, పురాణ పురుషులను తిట్టి కాదు. అవి యితిహాసాలు అంతే. సమాజం యొక్క పరిణామాన్ని సూచిస్తాయి. ఆ కథల ద్వారా సమాజం యొక్క నీతినియమాలను ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించారు. వాటికి చారిత్రక మూలం కొద్దిగా ఉంటే ఉండవచ్చు. కాలక్రమంలో అతిశయోక్తులతో, ఉత్ప్రేక్షలతో నింపి వేయడం వలన వాటిలో వైరుధ్యాలు కనబడతాయి. దేవుడు ఉన్నాడా లేడా అన్న చర్చకు అవి తోడ్పడవు. 

చివరగా – ఇటీవల ఒక విషయం గమనించాను. వ్యాఖ్యలు రాసేవాళ్లు నా వయసు గురించి ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. నేను రాసే కంటెంట్‌ పై వ్యాఖ్యానించడానికి ఏమీ లేకనే నా వయసు గురించి మాట్లాడుతున్నారా?  దాని గురించి నేను గాని, వాళ్లు గాని ఏమీ చేయలేము. నా వయసు చూపించి గౌరవాన్ని కోరను, జ్ఞానవంతుణ్నని క్లెయిమ్‌ చేయను. ఇక్కడ విషయంపై చర్చే ముఖ్యం. సత్తా వుంటే దాని గురించే మాట్లాడాలి. ఇలాటి వ్యాఖ్యలకు నేనెలా స్పందించాలని అని ఆలోచిస్తే ఒక విషయం గుర్తుకు వచ్చింది.

బాలమురళీకృష్ణగారు చైల్డ్‌ ప్రాడిజీగా ఉండే రోజుల్లో 80 ఏళ్ల సంగీతకారుడి వద్దకు తీసుకెళ్లారట. ఆయన 'నా వలె వృద్ధుడివై…' అంటూ ఆశీర్వదించారట. అంటే దీర్ఘాయువు కావాలని దీవెన. అదే తరహాలో వీళ్లందరూ కనీసం నా వయసు వరకైనా చేరి ముసలివాళ్లు కావాలని కోరుకుంటున్నాను. నా వయసు 66. నా సమవయస్కులు, నా కంటె పిన్నలు చాలా మంది పోయారు. ఉన్నవాళ్లలో కూడా జీవితంపై ఆసక్తి పోగొట్టుకున్నవారు, జ్ఞాపకశక్తి తగ్గిపోయినవారు, ఆధునిక సాంకేతికతను అందుకోలేక పోయినవారు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పోగొట్టుకున్నవారూ కొందరున్నారు.

నాకా సమస్యలు యిప్పటిదాకా లేవు. అందువలన యీ వ్యాఖ్యాతలు 66 దాకా బతకడమే కాక, చురుకుగా కూడా ఉండాలని ఆశిస్తున్నాను.
-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2018)