రాను రాను చిన్న, మీడియం సినిమాలు డిస్కౌంట్ సేల్ మాదిరిగా తయారవుతున్నాయి. మరో డేట్ లేదు కదా? విడుదల చేసేద్దాం అనుకుంటున్నారు. అంతేతప్ప, గుంపులో గోవిందా అయిపోతాయని చూసుకోవడంలేదు. దీనివల్ల ఒక్కోసారి మంచి సినిమాలు కూడా మిస్ అయిపోతున్నాయి.
కోనవెంకట్-ఆదిపినిశెట్టి-తాప్సీ కాంబినేషన్ లో మాంచి థ్రిల్లర్ తయారయింది. దాన్ని ఈనెల 24న వదుల్తున్నారు. థియేటర్లలో గీతగోవిందం సినిమా మానియా వుంది. పైగా నెలాఖరున రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి నాగచైతన్య-మారుతి కాంబినేషన్. ఇలాంటి టైమ్ లో ప్రేక్షకుల్లో ఎంతో రిజిస్టర్ అయ్యే టాక్ తెచ్చుకుంటే తప్ప నిలబడడం కష్టం.
అలాగే నారారోహిత్-జగపతిబాబు కలిసి ఆటగాళ్లు అనే వైవిధ్యమైన సినిమా చేసారు. ఈ సినిమా బాగానే వచ్చిందని టాక్ వుంది. ఇటు ఓ థ్రిల్లర్ తో కలిసి విడుదలవుతూ, ఇటు గీతగోవిందం, అటు రెండు క్రేజీ సినిమాలు అంటే పరిస్థితి ఆలోచించాలి. సూపర్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప నిలదొక్కుకోవడం కష్టం.
సెప్టెంబర్ ఏడవ తేదీ పరిస్థితి ఇలాగే వుంది. అదేరోజు ఇప్పటికి నాలుగు సినిమాలు ఖరారయ్యాయి. అల్లరి నరేష్-సునీల్ కాంబినేషన్ లోనే సిల్లీ ఫెలోస్ కీలకమైన సినిమా. ఎంత ప్లాప్ ల్లో వున్నా, ఆ ఇద్దరికీ బి,సి సెంటర్లలో ఇంతో అంతో క్రేజ్ వుంది. అది కాదనలేం. దీనికి పోటీగా సంపత్ నంది పేపర్ బాయ్ విడుదలవుతోంది. సంపత్ నంది మంచి కమర్షియల్ టచ్ వున్న డైరక్టరే. కానీ చిన్న హీరోతో చేస్తున్న రెగ్యులర్ ఫార్మాట్ కమర్షియల్ సినిమాను ఈ కామెడీ ద్వయం సినిమా మీదకు వదలడం అంత సరైన నిర్ణయం అవుతుందా? అన్నది అనుమానం.
ఈ రెండు సినిమాలతో పాటు కేరాఫ్ కంచరపాలెం అనే ప్రయోగాత్మక సినిమా విడుదలవుతోంది. ఇక అదే రోజు మను అనే డిఫరెంట్ థ్రిల్లర్ కూడా విడుదలవుతొంది. అంటే 24 నుంచి ఏడులోగా తొమ్మిది సినిమాలు. మూడు నాలుగు థ్రిల్లర్ లు, ఒక డిఫరెంట్ మూవీ. మూడు ఫార్మాట్ సినిమాలు.. ఓ కామెడీ సినిమా ఇలా… మరి జనాలు వీటిని ఆదరించాలి అంటే అంతకు అంతా అద్భుతమైన టాక్ ను తెచ్చుకోవాలి. లేదూ అంటే బానే వున్నాయి. ఫరావాలేదు అనే టాక్ తో నిలదొక్కుకోవడం కష్టం. ఇవే సినిమాలు కాస్త టైమ్ చూసుకుని వస్తే వేరేగా వుంటుంది వ్యవహారం.