తెలుగు కోరే వారి గోల తగ్గుతుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేదలు అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులోకి రావాలని, వారంతా మెరుగైన ఉద్యోగావకాశాలకు అర్హులుగా తయారు కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్ని…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేదలు అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులోకి రావాలని, వారంతా మెరుగైన ఉద్యోగావకాశాలకు అర్హులుగా తయారు కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం లోకి మారుస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయం కోర్టు గడప తొక్కింది. తెలుగు భాష కోరుకునే వారి హక్కును కాలరాస్తున్నారు- అంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన వివరణ తెలుగు భాషాభిమానులకు ఊరట కలిగించేదే!

ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా విద్యా శాఖకు చెందిన అధికారి కోర్టుకు నివేదిస్తూ- ప్రతి మండలంలో ఒక తెలుగు మీడియం పాఠశాల ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంటే తెలుగు మీడియం చదువు కోరే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న మాట! మండలానికి ఒకటే స్కూల్ పిల్లలు అంతవరకు అంత దూరం చేయడం ఎలాగా అని ఎవరు చింతించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మండలంలో తెలుగు మీడియం పాఠశాల ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా అది కోరుకునే విద్యార్థులు అందరికీ ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామని హామీ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇక దిగులు లేదు!

ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ ఇంగ్లిషు మీడియంలోకి మార్చాలనే నిర్ణయం పట్ల నిరుపేద వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తెలుగుకు నష్టం జరుగుతుందంటూ ఒకవైపు రాద్ధాంతమూ నడుస్తోంది. పదో తరగతి వరకు నిర్బంధ తెలుగు సబ్జెక్టు ఉంటుందని ప్రభుత్వం ఎంతగా నచ్చజెబుతున్నప్పటికీ.. ఈ విషయంలో ఆందోళనలు చేస్తున్న వారు శాంతించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. ప్రభుత్వం ప్రకటించిన తాజా నిర్ణయంతో ఒక మెట్టు తగ్గినట్టే అనుకోవాలి. మండలానికో తెలుగు మీడియం స్కూలు ఏర్పాటు చేయడం అనేది ఆందోళనలు చేస్తున్న వారికి కూడా అంగీకార యోగ్యమే కావాలి. ఇక్కడితో ఇక ఈ అంశానికి ఫుల్ స్టాప్ పడుతుందనే పలువురు భావిస్తున్నారు.

ఓ తండ్రిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా