సవాలులో ఓడితే.. లోకేష్ సన్యాసమేనా?

ఎట్టకేలకు నారా లోకేష్ ఒక సవాలు విసిరారు. ఒక రాష్ట్రం- ఒకే రాజధాని అనే అంశంతోనే తాము స్థానిక ఎన్నికలకు వెళ్తాం అంటూ నినదించారు. చిత్తశుద్ధి, మాట మీద నిలబడడం అంటే అలాగే ఉండాలి.…

ఎట్టకేలకు నారా లోకేష్ ఒక సవాలు విసిరారు. ఒక రాష్ట్రం- ఒకే రాజధాని అనే అంశంతోనే తాము స్థానిక ఎన్నికలకు వెళ్తాం అంటూ నినదించారు. చిత్తశుద్ధి, మాట మీద నిలబడడం అంటే అలాగే ఉండాలి. అమరావతిలోనే రాజధాని ఉండాలనే డిమాండుతో జరుగుతున్న ఉద్యమాలకు తెలుగుదేశం నాయకత్వం వహిస్తూ, మార్గదర్శకత్వం చేస్తూ, మద్దతిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అధికార వికేంద్రీకరణను వారు తప్పుపడుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతున్నాయి. 150 స్థానాలకు పైగా గెలిచి జోరుమీదున్న వైఎస్సార్ కాంగ్రెస్ అదే జోరును స్థానిక ఎన్నికల్లో కూడా చూపించాలని ఉత్సాహంగా ఉంది. శాసనసభలో కేవలం 22 స్థానాలు మిగిలిఉన్న తెలుగుదేశం కునారిల్లుతోంది. ఈ ఎన్నికల్లో వైకాపాను దెబ్బకొట్టాలని ఆరాటపడుతోంది.

ఇలాంటి సమయంలో రాజధాని గురించిన రగడ పెద్దస్థాయిలో జరుగుతోంది. అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం చేస్తున్నారు గనుక.. ఆ ఎజెండా అంశం తీసుకుంటే ఎన్నికల్లో లాభం ఉంటుందని.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ భావిస్తున్నట్లుంది. అందుకే ఆయన ఒకే రాజధాని అంశంతోనే ఎన్నికలకు వెళ్తాం అని అంటున్నారు. తమాషా ఏంటంటే.. అమరావతి కోసం జరుగుతున్న పోరాటాల్లో ఆ 29 గ్రామాల ప్రజలు తప్ప.. మిగిలిన గుంటూరు జిల్లా వాసులు కూడా పెద్దగా పాల్గొనడం లేదు.

ఇలాంటి పేలవమైన అంశాన్ని ప్రధాన ఎజెండాగా పెట్టుకుంటే తతిమ్మా రాష్ట్రం మొత్తం తెలుగుదేశాన్ని అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. మూడు ప్రాంతాల అభివృద్ధి అనే పేరుతో.. జగన్ వికేంద్రీకరణకు నడుం బిగించారు. మరి దానికి ఒకేరాజధాని సవాలు విసరుతున్న లోకేష్.. స్థానిక ఎన్నికల్లో తెదేపా ఓడిపోతే..రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అనే చర్చ ప్రజల్లో నడుస్తోంది.

సవాళ్లు విసరడం పెద్ద విషయం కాదు. అవి విఫలమైనప్పుడు.. అందుకు బాధ్యత వహించడమే హీరోయిజం అనిపించుకుంటుంది. స్థానిక ఎన్నికల్లో తెదేపా ఓడితే.. అధికార పార్టీ అక్రమాలు చేసిందంటూ చిలకపలుకులు పలకకుండా.. జనం నాడిని గమనించలేకపోయినందుకు లోకేష్ తన వైఫల్యాన్ని అంగీకరించేట్లయితేనే ఇలాంటి సవాళ్లు విసరాలని పలువురు అంటున్నారు.

జగన్ గారితో సినిమా వాళ్ల ర్యాపొ తక్కువ