దర్శకుడు భాస్కర్ ను బొమ్మరిల్లు భాస్కర్ చేసింది ఆ సినిమా. కానీ ఆ తరవాత అన్నీ ఫెయిల్యూర్ లే. మళ్లీ ఆ రేంజ్ సినిమా రాలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా అఖిల్ తో చేస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ సినిమా మాత్రం పూర్తి భరోసా ఇస్తోందని తెలుస్తోంది. దానికి కారణం మరేం కాదు. సినిమాకు సరైన పాయింట్ దొరకడమే.
బొమ్మరిల్లు సినిమాలో తండ్రీ కొడుకుల మీద దర్శకుడు కాన్సన్ ట్రేట్ చేస్తే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో భార్య భర్తల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే భార్య భర్తలు అంటే ఏదో వయసు మీద పడిపోయాకో, మధ్య వయస్సు అనో కాకుండా, అసలు పెళ్లి చేసుకుంటే ఓ అమ్మాయి-అబ్బాయి ఎన్నాళ్ల పాటు ఎన్ని షేర్ చేసుకోవాల్సి వుంటుంది. అలాంటి పెళ్లిని టైమ్ బౌండ్ పెట్టుకుని చేసుకోవడం, అమెరికా నుంచి వచ్చి ఇలా చేసుకుని, అలా వెళ్లిపోవడం వంటి వ్యవహారాలు సరికాదని యువతకు చెప్పడమే బొమ్మరిల్లు భాస్కర్ పట్టుకున్న కొత్త పాయింట్ అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇదిలా వుంటే సినిమాలో అఖిల్ కు చకచకా తొమ్మిది పెళ్లిచూపులు వుంటాయని, అవన్నీ ఫన్నీగా చిత్రీకరించారని తెలుస్తోంది. జిఎ 2 బ్యానర్ పై నిర్మాత బన్నీవాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.