రాజమౌళి-రామారావు-రామ్ చరణ్ కాంబినేషన్ లో డివివి దానయ్య నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అప్ డేట్ వచ్చేసింది. 2021 సంక్రాంతికి బరిలోకి దిగుతోంది. దీంతో ఇక ఆ సంక్రాంతికి అది ఒక్కటే సినిమా అన్న టాక్ ఇప్పటికే బయల్దేరింది. కానీ ఇండస్ట్రీ ఎక్స్ పెర్ట్ లు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ విడుదలైతే అదే ఫస్ట్ ఆప్షన్ అనడంలో సందేహం లేదని, కానీ మరో రెండు సినిమాలు అవసరం పడతాయని అంటున్నారు.
ఆర్ఆర్ఆర్ కు పోటీగా కనీసం మరో పెద్ద సినిమా, మరో చిన్న సినిమా విడుదలైనా ఫరవాలేదని, అయితే ఆ సినిమాలు కూడా బాగుండాలని చెబుతున్నారు. అప్పుడు ఫస్ట్ టికెట్ ఆర్ఆర్ఆర్ కు తెగితే, రెండు మూడు టికెట్ లు ఈ సినిమాలకు తెగుతాయంటున్నారు. అదీ కాక 8న ఆర్ఆర్ఆర్ విడుదలయితే, పండగ అన్నది 12 నుంచి మొదలవుతుందని, అందువల్ల 13 లేదా 14లో మరో సినిమాకు చాన్స్ వుందని టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ జనాలు విశ్లేషిస్తున్న పాయింట్లు ఇలా వున్నాయి.
అడియో -విడియో
ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలకు పాటలు ప్రాణం. ఆర్ఆర్ఆర్ లో మూడు లేదా నాలుగు పాటలు వుంటాయని వినిపిస్తోంది. ఇందులో ఒకటి దేశ భక్తి గీతం కావచ్చని తెలుస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్లు. కానీ కొమరం భీమ్, అల్లూరి పాత్రలకు డ్యూయట్లు పెట్టి డ్యాన్స్ లు చేయిుస్తే జనం నుంచి వేరే విధమైన రియాక్షన్ వస్తుంది.
అలాగే ఇప్పటి వరకు రాజమౌళి సినిమాల్లో ప్రేమ అన్నది కీలకమైన ముడిసరుకుగా వుంటుంది. కానీ ఈ సినిమాలో లవ్ అన్నది అంత కీలకం కాదు.
బ్రిటిష్ సమస్య
సైరా మాదిరిగానే ఆర్ఆర్ఆర్ కూడా బ్రిటిష్ కాల నేపథ్యంలోనే సాగుతుంది. మన దగ్గర బ్రిటిష్ కాల నేపథ్యం సినిమాలు మరీ అద్భుతమైన విజయాలు సాధించింది తక్కువ. పైగా ఈ జనరేషన్ కు బ్రిటిష్ వాళ్లు విలన్లు అనేది పెద్దగా పట్టే పాయింట్ కాదు. ఓ మెయిన్ విలన్ అనే పాయింట్ కచ్చితంగా వుండాలి. సైరా కు కూడా అదే సమస్య అయింది. బ్రిటిష్ వాళ్లు జనాల్ని హింసించడం, హీరో తిరగబడడం అన్న పాయింట్ మన సినిమా ప్రేక్షకులకు బాగా బోర్ కొట్టేసిన పాయింట్.
బాలీవుడ్ ను వదిలేసారా?
బాలీవుడ్ మార్కెట్ తక్కువ కాదు. కానీ ఆర్ఆర్ఆర్ దీన్ని వదిలేసిందా? అన్న అనుమానలు కలుగుతున్నాయి. బాలీవుడ్ కు ఆగస్టు, అక్టోబర్ మంచి సీజన్. సంక్రాంతి కాదు. సంక్రాంతి బాలీవుడ్ కు బ్యాడ్ సీజన్. పైగా ఆర్ఆర్ఆర్ యూనివర్సల్ సబ్జెక్ట్ కాదు. అందువల్ల ఆర్ఆర్ఆర్ ను అక్కడ అమ్మడం కన్నా, నేరుగా విడుదల మాత్రమే వుంటుదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అందువల్ల ఈసారి రాజమౌళి సినిమా అంటే మరీ భయపడిపోనక్కరలేదని, దాని మీద ఇరవై, పాతిక కోట్ల సినిమా ఈజీగా పండగ టైమ్ లో రెండు అయినా వేసుకోవచ్చని, అయితే అవి కూడా బాగుండాలని ఇండస్ట్రీ జనాలు విశ్లేషిస్తున్నారు. కానీ అదే టైమ్ లో ఎప్పటి రాజమౌళి సినిమాల మాదిరిగా ఓ సునామీ మాదిరిగా విరుచుకు పడితే మాత్రం కష్టం అవుతుందని కూడా అంటున్నారు.