ఎమ్బీయస్‌: ఇన్‌కమ్‌టాక్స్‌ విధానంలో మార్పు

నేను బజెట్‌ గురించి వ్యాసాలు రాయను. రాయకపోవడమే కాదు, సీరియస్‌గా వినడం, చదవడం కూడా మానేశాను. ఒకప్పుడు పరీక్ష కెళ్లేంత స్థాయిలో అధ్యయనం చేసేసేవాణ్ని. తర్వాత తర్వాత బజెట్‌ తన శాంక్టిటీ పోగొట్టుకుందనిపించింది. ఎందుకంటే…

నేను బజెట్‌ గురించి వ్యాసాలు రాయను. రాయకపోవడమే కాదు, సీరియస్‌గా వినడం, చదవడం కూడా మానేశాను. ఒకప్పుడు పరీక్ష కెళ్లేంత స్థాయిలో అధ్యయనం చేసేసేవాణ్ని. తర్వాత తర్వాత బజెట్‌ తన శాంక్టిటీ పోగొట్టుకుందనిపించింది. ఎందుకంటే బజెట్‌లో పన్నులేవీ లేవంటారు, రైలు చార్జీలు పెంచలేదంటారు. తీరా చూస్తే నెల తిరక్కుండా ఒక ప్రకటన ద్వారా పెంచేస్తారు. కావలసినవాళ్లకి సుంకాలు తగ్గించేస్తారు. డిఫెన్సుకి కావాలంటూ భారీ ఒప్పందాలు చేసేసుకుంటారు. ఇంకెందుకు బజెట్‌? బజెట్‌కు ముందు ఫైనాన్షియల్‌ రిపోర్టు చదివితే తెలుస్తుంది. వీళ్ల అంచనాలకు, వాస్తవాలకు ఎంత పొంతన ఉందో! ఈ ఏడాది బజెట్‌లో రెండిటి గురించి నా భావాలు మీతో పంచుకోవాలని ఉంది. ఒకటి ఇన్‌కమ్‌టాక్స్‌, రెండోది ఎల్‌ఐసి ప్రయివేటీకరణ (వేరే వ్యాసంలో). భయపడకండి గణాంకాలు యివ్వను. ఫిలాసఫీ చర్చిస్తానంతే.

ఆదాయపు పన్ను లెక్కించే విధానంలో యీసారి మార్పు ప్రవేశపెట్టారు. పాత, కొత్త అంటూ. పాత విధానంలో ఏ మార్పూ చేయలేదు. మధ్యతరగతి జీవికి ఏ ఊరటా, ఏ కన్సెషనూ యివ్వలేదు. కొత్త విధానం అంటూ పెట్టినదానిలో మార్పు ఏమిటంటే పన్ను శ్లాబులు తగ్గించారు. ఇక్కడ మెలిక ఏమిటంటే, దాదాపు అన్ని మినహాయింపులు తీసేశారు. ఇప్పటివరకు వున్న విధానంలో భవిష్యత్తు కోసం కుటుంబసంక్షేమం కోసం యిల్లు కట్టుకున్నా, ఎల్‌ఐసి పాలసీ తీసుకున్నా, బ్యాంకులో డిపాజిట్టు వేసుకున్నా, మెడికల్‌ యిన్సూరెన్సు తీసుకున్నా, కుటుంబాన్ని విహారయాత్రలకు తీసుకెళ్లినా, మంచి యింట్లో ఉంచినా పన్నులో రాయితీ వచ్చేది. ఇప్పుడు వాటికి మంగళం పాడేశారు. అసలు యీ మినహాయింపులు యివ్వడానికి వెనక గల ఫిలాసఫీ ఏమిటో మనం గుర్తు చేసుకోవాలి.

కాపిటల్‌ వ్యవస్థలో యజమాని కార్మికుణ్ని పిండేసేవాడు. రోజుకి 12 గంటలు పని చేయించేవాడు. జీతం పెరిగేది కాదు. ఏ సౌకర్యాలూ ఉండేవి కావు. కొంతకాలానికి కార్మికులు యీ దోపిడీని గుర్తించి తిరగబడసాగారు. 12 గంటలు కాదు, 10 గంటలే చేస్తాం అన్నారు. తర్వాత 8కి తీసుకుని వచ్చారు. యజమానిని లెక్కలడగసాగారు. కొన్ని చోట్ల కర్షకులతో కలిసి విప్లవం లేవదీసి, పెట్టుబడిదారులపై దాడి చేయసాగారు. ఇలా అయితే అసలుకే మోసం వచ్చేట్లుందని భయపడి, యజమానులు కార్మికులకు, ఉద్యోగులకు ప్రయోజనం చేసే పథకాలు చేపట్టారు. కార్ల్‌ మార్క్‌స్‌ కాలం నాటి యజమానులు కారు, ప్రస్తుత యజమానులు. ఉద్యోగులకు క్వార్టర్లతో సహా ఎన్నో సౌకర్యాలు, అలవెన్సులు సమకూర్చారు. అంతేకాదు, వాళ్ల కుటుంబాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారు. దీనివలన యింటి దగ్గర శాంతి లభించి, ఉద్యోగులు మేలైన ఫలితాలు కనబరచడంతో కంపెనీకి లాభం కలిగింది. కొన్ని సంస్థలు ఉద్యోగులకు కంపెనీలో షేర్లు కూడా యిచ్చాయి. దీనివలన విప్లవం వచ్చే ప్రమాదం తప్పిపోయి, పారిశ్రామికంగా ప్రగతి సాధించడానికి వీలుపడింది. 

ఏ రంగాలోనైనా ప్రగతి సాధిస్తే అది దేశానికే మేలు. అందువలన పారిశ్రామికవేత్తలు ఉద్యోగులకు కానీ, సమాజానికి కానీ సౌకర్యాలు కల్పిస్తే వాళ్లకు రాయితీలు యిస్తామంటూ ప్రభుత్వం తాయిలాలు చూపించింది. తన పౌరులు బాగుపడాలని విద్య, వైద్య సౌకర్యాలు సామూహికంగా ఏర్పరుస్తూనే వ్యక్తిగతంగా వారి కోసం కొన్ని చేసింది. ఒక వ్యక్తి సిగరెట్టు పీల్చి/పొగాకు తిని/మద్యం తాగి ఛస్తే నాకేం, యింత వయసు వచ్చినవాడికి ప్రత్యేకంగా చెప్పాలా అనుకోకుండా వాటి గురించి హెచ్చరికలు చేస్తుంది. అది చాలదని వాటిపై పన్నులు పెంచుతూ పోతుంది. ఇది స్టిక్‌ అయితే మంచి పనులకు క్యారట్‌ కూడా యిస్తుంది. 'నువ్వు వచ్చిన డబ్బంతా యిప్పుడే తగలేయకు, కొంత ఋణం తీసుకునైనా ఓ యిల్లు కట్టుకో. నీ కుటుంబానికి ఓ కప్పు సమకూర్చు, నువ్వు చచ్చిపోతే కుటుంబానికి యిన్సూరెన్సు వచ్చే ఏర్పాట్లు చేసుకో. డబ్బు ఆదా చేసి, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్ల ద్వారా దీర్ఘకాలికపు పెట్టుబడులు పెట్టు, బాండ్స్‌లో పెట్టు, అనారోగ్యం వస్తుందేమో హెల్త్‌ యిన్సూరెన్సు చేసుకో, భార్యాబిడ్డలను మూడేళ్ల కోసారైనా విహారయాత్రలకు తిప్పు, సమాజం కోసం దానధర్మాలు చేయి. ఇవన్నీ చేశావనుకో నీకు ఆదాయపు పన్నులో రాయితీలు యిస్తాం' అని ప్రభుత్వం చెపుతుంది. వీటి కారణంగా చాలా దేశాల్లో ఏదో ఒక స్థాయిలో సంక్షేమ రాజ్యం (వెల్‌ఫేర్‌ స్టేట్‌) ఏర్పడింది. 

ఇది ఎన్నో దశాబ్దాలుగా అద్భుతంగా పనిచేస్తున్న ఫార్ములా. గతంలో రిటైరయ్యాక వచ్చిన డబ్బుతో యిల్ల్లు కట్టుకునేవారు. ఇప్పుడు మంచి ఉద్యోగం వస్తే నలభై ఏళ్ల వయసులోపునే యిల్లు అమరుతోంది. తద్వారా అందరికీ యిళ్లు కట్టిచ్చే భారం ప్రభుత్వానికి తప్పిపోతోంది. ఇలాటి విధానాన్ని తాజా బజెట్‌ ద్వారా మోదీ ప్రభుత్వం మార్చేసింది. ఏం బావుకుంటుందో అర్థం కావటం లేదు. కారు కొంటే టాక్స్‌ రిబేట్‌ రాదు, యిల్లు కొంటే వస్తుంది అని యిన్నాళ్లూ ప్రభుత్వం చెప్పింది కాబట్టి 5 లక్షల కారు ఆలోచన వాయిదా వేసి, 50 లక్షల యిల్లు వెంటనే కొన్నారు. ఇప్పుడు యిల్లు కొన్నా రాయితీ రాదంటున్నారు కాబట్టి యిల్లు కొనే ఆలోచన వాయిదా వేసి కారు కొంటారు. ఎల్‌ఐసి కట్టినా దండగ, హెల్త్‌ ఇన్సూరెన్సు కట్టినా దండగ, డబ్బు పొదుపు చేసినా దండగ, బ్యాంకు డిపాజిట్ల రేట్లు తగ్గిస్తూ పోతున్నాం అర్థం కావటం లేదా అని ప్రభుత్వం ఎలుగెత్తి చెప్తోంది. ఇది ప్రజల మంచి కోసమేనా?

ఎందుకిలా చేస్తున్నారు? అని అడిగితే రేపటికోసం దాచుకోకుండా ప్రజలు చేతిలో డబ్బంతా యివాళే ఖర్చు పెట్టాలని మా ఉద్దేశం. లేకపోతే మార్కెట్లో వస్తువులు అమ్ముడుపోవటం లేదు. వస్తువులు అమ్ముడు పోకపోతే పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. ప్రజల చేతిలో డబ్బు రావాలి అంటే నిరుద్యోగ సమస్య పోవాలి. ప్రస్తుతం నిరుద్యోగిత దశాబ్దాల రికార్డు అధిగమించి వుంది. గత ఐదేళ్లుగా బిజెపి అమలు చేసిన దిక్కుమాలిన ఆర్థిక విధానాల, ప్రయోగాల ఫలితం యిది. వీళ్లు అధికారంలోకి రాగానే అంతర్జాతీయంగా పెట్రోలు ధరలు పడిపోయి, ఎంతో డబ్బు మిగిలింది. ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందించలేదు. కరువుకాటకాలు పెద్దగా లేవు. మరి ఎందుకింత క్రైసిస్‌ వచ్చిందో ఆలోచించుకుని పరిష్కారాలు వెతకాలి. వాళ్లు తెచ్చుకున్న ఆర్థిక నిపుణులందరూ కొంతకాలానికి బయటకు వెళ్లి తిట్టిపోస్తున్నారు, మేం చెప్పిన మాట వినటం లేదు అని. ఇన్నాళ్లూ యిష్టారాజ్యంగా నడిపి ఇప్పుడు 'కొంప మునిగింది, అందువలన యీ రాయితీలు ఎత్తేస్తున్నాం. మీరు చేతిలో డబ్బంతా వెంటనే తగలేయండి' అని ప్రభుత్వం సందేశం యిస్తోంది.

పొదుపు చేసే అలవాటు నేర్పడం కష్టం కానీ, చేతిలో ఆర్పేసే విద్య యింకోళ్లు నేర్పాలా? అందునా క్రెడిట్‌ కార్డులు వచ్చాక వచ్చే నెల జీతం కూడా ఖర్చు పెట్టేస్తున్నారు. అమెరికా టైపులో అందరూ ఖర్చు పెట్టేవాళ్లయితే ఆర్థిక మాంద్యం వచ్చినపుడు దేశం అల్లకల్లోలమై పోతుంది. కుటుంబ సంక్షేమ చర్యలను, పొదుపును నిరుత్సాహ పరిస్తే ఆ కుటుంబాలు వీధిపాలై అసాంఘిక శక్తులు ప్రబలుతాయి. వాటిని అదుపు చేయడానికి పోలీసు వ్యవస్థపై ప్రభుత్వం వేల కోట్లు గుమ్మరించాలి. చిన్న తరహా పరిశ్రమలు ప్రోత్సహిస్తూ సామాన్య ప్రజల చేతిలో డబ్బు ఆడేట్లు చూడాలి. ఉద్యోగాలు కల్పిస్తాయి కాబట్టి కార్పోరేట్లకు యిస్తాం అంటూ వేలాది కోట్లు వారి ఎదాన పోశారు. ఫలితం ఏమైనా వచ్చిందా? ఇదేమి ప్లానింగో నాకు అస్సలు అర్థం కావటం లేదు.

కొత్త పద్ధతి నాలాటి వాడికి ఉపయోగకరం. ఎందుకంటే నేను జీవనసంధ్యాకాలంలో ఉన్నాను. బీమా పాలసీ నేనడిగినా యివ్వరు, ఇప్పుడు హోమ్‌ లోన్‌ తీసుకుని యిళ్లు కట్టే సాహసం చేయను. ఎన్‌ఎస్‌సిలో పెడదామన్నా అది మెచ్యూర్‌ అయ్యేదాకా ఉంటానో ఊడతానో, అదేదో బ్యాంకులో వేసుకుని వడ్డీ తిందాం అనుకుంటున్నాను. పదేళ్ల కింద యీ ఆప్షన్‌ వచ్చి వుంటే అప్పుడు పాత పద్ధతే ఎంచుకునేవాణ్ని. 60 ఏళ్ల లోపు వాళ్లెవరికీ కొత్త పద్ధతి పనికి రాదని నా అంచనా. ఎందుకంటే పోనుపోను సగటు ఆయుర్దాయం పెరుగుతోంది. 80-85 ఏళ్ల వరకు బతికే ఛాన్సు/ప్రమాదం ఉంది. మరి అప్పటిదాకా ఏం తిని బతకాలి? కనీసం మందుల కోసమైనా నెలనెలా నికరాదాయం వచ్చే సాధనమేమిటి? అనే భయంతోనైనా భవిష్యత్‌ ప్రణాళికలు వేసుకోవాలి. ఉన్నది హారతి కర్పూరంలా హరాయించేస్తే వృద్ధాప్యంలో కడగండ్లు తప్పవు. 

ప్రస్తుతానికైతే పాత, కొత్త పద్ధతుల్లో ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు అని అన్నారు. నేను చెప్పిన లాజిక్‌ ప్రకారం 60 లోపు వాళ్లందరూ పాత పద్ధతి ఎంచుకుంటారనే ఊహతో వాళ్లకి ఒక్క రూపాయి కూడా కన్సెషన్‌ యివ్వలేదు. ఎందుకంటే అందర్నీ కొత్త పద్ధతి వైపు తరమాలని ప్రభుత్వప్రయత్నం. ఇది సమాజానికి అనర్థదాయకమని నా నమ్మకం. కాదని భావించేవాళ్లు వారి వాదనలు వినిపించవచ్చు.

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2020)
[email protected]