పిల్లలు లేని వారికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. వేల కోట్ల ఆస్తిపాస్తులున్నా, పిల్లలు లేకపోతే, ఎంత సంపాదన ఉన్నా వృథా అని ఫీల్ అవుతారు. మాతృత్వంలోని మాధుర్యం మరెందులోనూ ఉండదు. ‘అమ్మా’ అని పిలిపించుకోవడంలోని ఆనందం మరే పిలుపులోనూ దక్కదు. అందుకే గర్భధారణను ‘కడుపు పండింది’ అని ఎంతో పూజ్యనీయ భావంతో పిలుస్తారు.
ఇక ఎప్పటికీ పిల్లలు పుట్టరని వైద్యులు తేల్చి చెబితే…అలాంటి వారికి సరోగసి రూపంలో తల్లిదండ్రులు అయ్యే సువర్ణావకాశాన్ని వైద్యరంగంలో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం కల్పిస్తోంది. దాన్నే వైద్య పరిభాషలో ‘సరోగసీ’ అంటారు. సరోగసీనే తెలుగులో అద్దె గర్భం అని పిలుస్తారు. అయితే సరోగసీ ద్వారా పిల్లలను కనడానికి కఠిన నిబంధనలు అడ్డంకిగా నిలిచాయి.. గర్భధారణ మహిళ దగ్గరి బంధువై ఉండాలనే నిబంధన….చాలా మందికి పెద్ద అడ్డంకిగా మారింది.
ఈ నేపథ్యంలో సరోగసీ (నియంత్రణ) బిల్లు-2019లో 15 భారీ మార్పులను రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ప్రతిపాదించింది. సరోగసీ ద్వారా పిల్లలను పొందాలనుకునే విధానాన్ని సరళతరం చేయడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం. ఇకపై అద్దెకు గర్భం ఇచ్చే మహిళ దగ్గరి బంధువే కానవసరం లేదు.
గతంలో సరోగసీపై దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. సరోగసీ (నియంత్రణ) బిల్లు-2019 ప్రకారం భారతీయ దంపతులు అద్దె గర్భం ద్వారా పిల్లలు కనాలంటే వివాహమై ఐదేళ్లు పూర్తయి ఉండాలి. అలాగే గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ….ఆ దంపతులకు సమీప బంధువై ఉండాలి. ఇంకా అనేక కఠిన నిబంధనలతో లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లు….రాజ్యసభకు గత ఏడాది నవంబర్‌లో చేరింది. అయితే ఈ బిల్లుపై పలు సూచనలతో రాజ్యసభ సభ్యులు సెలెక్ట్ కమిటీకి పంపారు.
సెలెక్ట్ కమిటీ పదిసార్లు సమావేశమై, అనేక మంది ప్రజలతో మాట్లాడిన తర్వాత 15 ప్రధాన మార్పులను ప్రతిపాదించింది. సమీప బంధువు అనే కండీషన్ వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, సరోగసీ ద్వారా పిల్లల్ని కనేందుకు ఇష్టంగా ముందుకు వచ్చే వారిని బంధుత్వం సంబంధం లేకుండా అనుమతించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. అలాగే వివాహమై ఐదేళ్లు పూర్తి… అనే నిబంధనను కూడా తొలగించాలని ప్రతిపాదించారని తెలిసింది.
భర్త చనిపోయి లేదా విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలు 35-45 ఏళ్ల మధ్య వయస్సున్న వారు కూడా సరోగసీ ద్వారా పిల్లల్ని కనేందుకు అనుమతించాలని, బీమా కవరేజీని 16 నుంచి 36 నెలలకు పొడిగించాలని, ఇతర ప్రతిపాదనలతో నివేదికను తయారు చేసి సెలెక్ట్ కమిటీ చైర్మన్ భూపేందర్ యాదవ్ రాజ్యసభకు సమర్పించారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే సరోగసీ ద్వారా పిల్లల్ని కనడం ఈజీ అవుతుంది.